ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' ఫస్ట్ లుక్ రివ్యూ. షారుఖ్ ఖాన్ ప్రశంసలు, దీపికా పదుకొణె రోల్ మరియు సినిమా విశేషాలతో కూడిన పూర్తి కథనం.
భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు.. ‘రాకా’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం, అనౌన్స్‌మెంట్ రోజే సరికొత్త రికార్డులకు తెరలేపింది. అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ చిత్ర టైటిల్ , ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా, బాలీవుడ్ అగ్ర నటుల ప్రశంసలు సైతం ఈ సినిమాపై కురుస్తుండటం విశేషం.
విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత వైవిధ్యంగా కనిపిస్తోంది. తన పంజాల వంటి చేతితో ముఖాన్ని సగం కప్పుకుని, కెమెరా వైపు తీక్షణంగా చూస్తున్న బన్నీ లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. గంభీరమైన కళ్లకు కాటుక, గుండు, దట్టమైన తెల్లటి మీసం మరియు గడ్డంతో ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటే, అట్లీ ఏదో పెద్ద ప్రయోగాన్నే చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ లుక్ చూస్తుంటే గతంలో కార్తీ నటించిన ‘కాశీమోర’ ఛాయలు కనిపిస్తున్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నప్పటికీ, అట్లీ మార్క్ మేకింగ్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి దర్శకుడు అట్లీ చేసిన వ్యాఖ్యలు సినిమా తీవ్రతను తెలియజేస్తున్నాయి. "రాకా అనేది కేవలం ఒక సినిమా కాదు, అది 18 ఏళ్లుగా నాలో దాచుకున్న ఒక భావన. ఆ ఆలోచన నన్ను ఎన్నో సార్లు పరీక్షించింది, నన్ను నేను తీర్చిదిద్దుకునేలా చేసింది" అంటూ అట్లీ తన ఎమోషన్‌ను పంచుకున్నారు. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ కి, ‘జవాన్’తో గ్లోబల్ రేంజ్ హిట్ అందుకున్న అట్లీ తోడవ్వడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
షారుఖ్ ఖాన్ ప్రశంసల జల్లు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ లుక్‌పై స్పందిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, "ఈ పోస్టర్ మీలాగే చాలా ఆసక్తికరంగా మరియు అద్భుతంగా ఉంది. మీ అద్భుతాన్ని వెండితెరపై చూడాలని ఎదురుచూస్తున్నాను. అట్లీ మాటల్లో చెప్పాలంటే.. ఈ అనుభవం జబర్దస్త్ జబర్దస్త్‌గా ఉండబోతోంది" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు. షారుఖ్ స్వయంగా అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ వంటి భారీ విజయాన్ని అందుకోవడం, ఇప్పుడు అదే దర్శకుడు అల్లు అర్జున్‌తో కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
భారీ తారాగణం.. గ్లోబల్ టెక్నాలజీ
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. ఇది అల్లు అర్జున్-దీపికా కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్దపీట వేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే, గ్లోబల్ ప్రేక్షకులను అలరించే యాక్షన్ డ్రామాగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం 2027లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
ఒక హద్దులు లేని అనుభవం
నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ, "హద్దుల్ని మించిన అనుభవానికి సిద్ధమవ్వండి" అని పేర్కొనడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. భారతీయ భాషలన్నింటితో పాటు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసే ప్రణాళికలు జరుగుతున్నాయి. ఐకాన్ స్టార్ క్రేజ్, అట్లీ మేకింగ్ స్టైల్, దీపికా పదుకొణె గ్లామర్.. వెరసి ‘రాకా’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి, అల్లు అర్జున్ పుట్టినరోజున వెలువడిన ఈ ‘రాకా’ అప్‌డేట్ ఆయన అభిమానులకు ఐ పీస్ట్ లాంటిదని చెప్పవచ్చు. 2027 వరకు వేచి చూడాల్సి ఉన్నా, అప్పుడే ‘రాకా’ మేనియా మొదలైపోయింది!