తమిళనాడు బీజేపీ నేత అన్నామలై హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు, మోదీ-అమిత్ షాల అత్యవసర ఆహ్వానం మరియు ఆయనకు దక్కబోయే కొత్త బాధ్యతలపై ప్రత్యేక విశ్లేషణ. రేపటి ఎన్నికల ప్రచారంపై తాజా అప్డేట్!
దక్షిణాది రాజకీయాల్లో, ముఖ్యంగా తమిళనాడులో 'సింగం'గా ముద్ర వేయించుకున్న బీజేపీ నేత అన్నామలై చుట్టూ ఇప్పుడు రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఆయన హుటాహుటిన ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి పయనం కావడం రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. అసలు ఆయనకు ఎంపీ టికెట్ దక్కకపోవడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? మోదీ-అమిత్ షా ద్వయం నుంచి వచ్చిన ఆ అత్యవసర పిలుపు దేనికి సంకేతం? ఇప్పుడు ఇదే అంశం ఇటు తమిళనాడులోనూ, అటు ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
గత కొన్నాళ్లుగా తమిళనాడులో బీజేపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తూ, డీఎంకే సర్కార్‌పై విరుచుకుపడుతున్న అన్నామలై పేరు తొలి అభ్యర్థుల జాబితాలో లేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రెండు రోజుల క్రితం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన అన్నామలై, తన నిరాశను ఏమాత్రం దాచుకోలేదు. "తమిళనాడు ఎంపిక కమిటీ ఢిల్లీకి పంపిన జాబితాలో నా పేరు లేదు. అటువంటప్పుడు నాకు సీటు ఎలా వస్తుంది?" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి. అయితే, అదే సమయంలో "పరిస్థితి మారబోతోంది" అని ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేస్తోంది.
పుదుచ్చేరిలోని కారైకల్‌లో ప్రైవేట్ హెలికాప్టర్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, సాయంత్రం 6 గంటల సమయంలో చెన్నై పాత విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయ అతిథి గదిలో కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగానే, ఢిల్లీ నుంచి అధిష్టానం పిలుపు అందినట్లు సమాచారం. వెంటనే రాత్రి 7.20 గంటలకు ప్రత్యేక ప్రైవేట్ విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సాధారణంగా ఒక రాష్ట్ర నేత కోసం ఇంత వేగంగా ఏర్పాట్లు జరగడం వెనుక ఏదో 'పెద్ద ప్లాన్' ఉందనేది స్పష్టమవుతోంది.
అసలు రహస్యం ఏమిటి?
అన్నామలైని ఢిల్లీకి పిలిపించడం వెనుక ప్రధానంగా మూడు రకాల చర్చలు సాగుతున్నాయి. తమిళనాడు బీజేపీలోని పాత తరం నేతలకు, ఐపీఎస్ వదిలి వచ్చిన అన్నామలై దూకుడుకు మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాష్ట్ర కమిటీ పంపిన జాబితాలో ఆయన పేరు లేకపోవడం వెనుక స్థానిక నేతల 'చెక్' ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. దీనిపై హైకమాండ్ వివరణ కోరి ఉండవచ్చు. అదేవిధంగా ఒక నియోజకవర్గానికి మాత్రమే అన్నామలైని పరిమితం చేయడం హైకమాండ్‌కు ఇష్టం లేదని సమాచారం. ఆయనకున్న క్రేజ్‌ను కేవలం తమిళనాడుకే కాకుండా, దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో 'స్టార్ క్యాంపెయినర్'గా ఉపయోగించుకోవాలని మోదీ-షా ద్వయం భావిస్తోంది. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం మెండుగా ఉంది.
ఢిల్లీ చేరుకున్న అన్నామలై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు పార్టీ జాతీయ అధ్యక్షుడునితిన్ నబిన్ లతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అన్నామలైకి టికెట్ దక్కలేదన్న బాధలో ఉన్న తమిళ తంబీలకు, అధిష్టానం ఏదైనా 'బంపర్ ఆఫర్' ఇస్తుందేమో చూడాలి.
ఏది ఏమైనా, "పరిస్థితి మారబోతోంది" అని అన్నామలై అన్న మాటలు నిజమైతే, తమిళనాడు రాజకీయాల్లో ఇది సరికొత్త అధ్యాయానికి నాంది కానుంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ కీలక పరిణామాలు తమిళ బీజేపీ శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
రేపు యధావిధిగా ఎన్నికల ప్రచారం
రాబోయే శాసనసభ ఎన్నికలలో, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – యెన్ డి ఏ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరుపున రేపు సాయంత్రం పల్లడం, తిరుప్పూర్ సౌత్, తిరుప్పూర్ నార్త్, అవినాశి మరియు సూలూరు నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నన్నట్లు అన్నామలై తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో కొద్ది సేపటి క్రితం పోస్ట్ చేసారు.
దేశాభివృద్ధి కోసం, తమిళనాడు పురోగతి కోసం, అలాగే తమిళనాడును అత్యంత దారుణమైన స్థితిలోకి నెట్టిన ప్రజా వ్యతిరేక డీఎంకే పాలనను అంతమొందించేందుకు, ప్రజలందరూ మాకు మద్దతు తెలపాలని కోరుతున్నాను అంటూ అన్నామలై తన పోస్ట్ లో పేర్కొనటం ప్రాధాన్యతను సంతరించుకుంది.