అయోధ్యలో రామ మందిరం కేవలం ఒక ఆలయం కాదు, అది కోట్లాది భక్తుల విశ్వాసానికి, శతాబ్దాల చరిత్రకు ప్రతీక. రామజన్మ భూమిపై రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత, ఇప్పుడు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దీనికి సంబంధించిన ఘట్టాలు , అవి జరిగిన తేదీలను పుస్తక రూపం లో అందుబాటులోకి తిసుకురాబోతుంది. ఈ పుస్తక రచన బాధ్యతను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కు అప్పగించారు. ఆయన ఈ ఉద్యమంతో దశాబ్దాలుగా ముడిపడి ఉన్న వ్యక్తి కావడంతో, ఇందులో ఎక్కడా బయట దొరకని కొన్ని 'ఇన్సైడ్ స్టోరీస్' కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో రామభక్తులకు చిరస్మరణీయంగా నిలిచిపోయే ఆయా తేదీలు, కార్యక్రమాలకు సంభందించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. దీనికంటే ముందు రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు నుండి వచ్చిన తీర్పుకు సంబంధించిన సాక్ష్యాలు, ముఖ్యమైన పత్రాల డిజిటలైజేషన్ కూడా చేయిస్తున్నారు. ఈ పని ప్రస్తుతం కొనసాగుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో పత్రాల డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత రామభక్తులు ఒక్క క్లిక్‌తో రామ మందిరానికి సంబంధించిన అన్ని పత్రాలను వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ పుస్తకాన్ని కేవలం ఒక డైరీలా కాకుండా, రామాలయ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన సంఘటనల సమాహారంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా చారిత్రక ఆధారాలు, సుప్రీంకోర్టు తీర్పుకు దారితీసిన కీలక సాక్ష్యాలను ఇందులో పొందుపరుస్తారు. నిర్మాణ విశేషాలు , ఆలయ శిల్పకళ, వాస్తు శాస్త్రం మరియు నిర్మాణంలో ఉపయోగించిన ప్రత్యేక రాళ్ల గురించి సమాచారం ఉంటుంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆలయ ప్రాముఖ్యతను సులభంగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక 'గైడ్'లా పనిచేస్తుంది.
పుస్తకంలో లిఖితబద్ధం కానున్న తేదీలు :
- 09 నవంబర్ 2019: సుప్రీంకోర్టు నుండి రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు.
- 05 ఫిబ్రవరి 2020: తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు.
- 25 మార్చి 2020: రామలల్లా విగ్రహాన్ని తాత్కాలిక గర్భాలయంలో ప్రతిష్ఠించడం.
- 05 ఆగస్టు 2020: రామ మందిర నిర్మాణానికి భూమి పూజ.
- 15 జనవరి 2021: రామ మందిర నిర్మాణం కోసం పునాది తవ్వకం ప్రారంభం.
- 22 జనవరి 2024: భవ్య రామ మందిరంలో రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ.
- 11 జనవరి 2025: మందిరం యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్ఠా ద్వాదశి కార్యక్రమం.
- 05 జూన్ 2025: రామ దర్బార్ మరియు ఏడు అనుబంధ ఆలయాల ప్రాణ ప్రతిష్ఠ.
- 25 నవంబర్ 2025: రామ మందిర స్వర్ణ శిఖరంపై ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించడం (ఆరోహణ).
- 31 డిసెంబర్ 2025: మందిరం రెండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్ఠా ద్వాదశి రోజున అన్నపూర్ణ మందిరంపై ధ్వజారోహణం.
- 19 మార్చి 2026: రామ మందిరం రెండవ అంతస్తులో శ్రీరామయంత్ర ప్రతిష్ఠాపన.
ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. రామాయణ పారాయణం, భజన కీర్తనలతో అయోధ్య నగరం అంతా 'రామ నామ' స్మరణతో మారుమోగిపోతుంది. శ్రీరామ నవమి గురువారం రావడం చాలా విశేషమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే గురువారం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు, శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారంగా చెబుతారు. రామాయణ పారాయణం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున (నవమి) శ్రీరామ నవమిని జరుపుకుంటారు. ఈ రోజునే పురుషోత్తముడైన శ్రీరామ చంద్రుడు జన్మించాడని భక్తుల నమ్మకం. అయోధ్యలో మార్చి 26, 2026 (గురువారం) నాడు వేడుకలను నిర్వహిస్తున్నారు. తిథి మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. రామ జన్మఘడియలు అంటే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:25 సమయంలో ఉంటాయి. ఈ సమయంలోనే ప్రధాన పూజలు జరుగుతాయి.
బాల రాముడు నుదుటిపై సూర్య కిరణాలు :
ఖగోళ శాస్త్రం మరియు అత్యాధునిక లెన్స్/మిర్రర్ల సహాయంతో సూర్య కిరణాలను మళ్ళించి, సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు రాముడి నుదుటిపైసూర్య కిరణాలు పడేలా చేస్తారు. ఇది దాదాపు 4 నిమిషాల పాటు కనిపిస్తుంది. సూర్యవంశీయుడైన రాముడికి స్వయంగా భాస్కరుడు తిలకం దిద్దినట్లుగా ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
రామ దర్బార్ 2025లో ప్రతిష్ఠాపన పూర్తయినందున, ఈ ఏడాది భక్తులు మొదటి అంతస్తులోని 'రామ దర్బార్'ను కూడా పూర్తి వైభవంతో దర్శించుకోవచ్చు. ఆలయం మొత్తాన్ని క్వింటాళ్ల కొద్దీ దేశీ, విదేశీ పూలతో 'ఫూల్ బంగ్లా' మాదిరిగా అలంకరిస్తారు. ఉదయాన్నే బాల రాముడికి అష్టోత్తర శత కలశాలతో (108 కలశాలు) మహా అభిషేకం నిర్వహిస్తారు.
భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు :
అయోధ్యలోని సరయూ నదిలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరాముడిని పెద్దఎత్తున దర్శించుకుంటారు. రద్దీ దృష్ట్యా ఉదయం 3:30 AM నుండే భక్తులను అనుమతిస్తారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 10 లక్షల మంది భక్తుల కోసం ప్రత్యేకంగా ధనియాల పంజరి (ధనియాల ప్రసాదం) మరియు లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. అయోధ్య అంతటా దాదాపు 100 పైగా పెద్ద ఎల్ ఇ డి స్క్రీన్లను ఏర్పాటు చేసి, గర్భాలయంలో జరిగే పూజలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.




