చండీగఢ్‌లో మద్యం విక్రయాలపై తీసుకువచ్చిన కొత్త విధానం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఇప్పటివరకు సంప్రదాయ మద్యం దుకాణాలకు మాత్రమే పరిమితమైన అమ్మకాలను, ఇకపై పెట్రోల్ పంపులు, షాపింగ్ మాల్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్లు వరకు విస్తరించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం గమనార్హం. ఈ మార్పులు కేవలం వినియోగదారులకు సౌకర్యం కల్పించడమే కాకుండా, మద్యం విక్రయాల్లో పారదర్శకత, నియంత్రణను పెంచాలన్న ఉద్దేశంతో తీసుకున్న అడుగులుగా అధికారులు చెబుతున్నారు.

కొత్త ఎక్సైజ్ పాలసీ 2026–27లో మద్యం కొనుగోలు అనేది ఇక ప్రత్యేక దుకాణాలకు పరిమితం కాకుండా, సాధారణ షాపింగ్ లో భాగంగా మారబోతోంది. పెట్రోల్ పోయించుకునే సమయంలోనే మద్యం కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా మాల్స్‌లో ఇతర వస్తువులతో పాటు బీర్, వైన్ అందుబాటులో ఉండటం ద్వారా వినియోగదారులకు సమయాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుండని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ సౌకర్యాల వెనుక ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలను కూడా అమలు చేయనుంది. ప్రతి మద్యం విక్రయ కేంద్రంలో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయడం ద్వారా నగదు లావాదేవీలలో అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆల్కహాల్ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారుల మద్యం పరిమాణాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఇది బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించే చర్యగా భావిస్తున్నారు.

చండీగఢ్‌లో మొత్తం 97 మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, ధరల పెరుగుదలపై కూడా నియంత్రణ విధించింది. గరిష్టంగా 2 శాతం వరకు మాత్రమే ధరలు పెరగవచ్చని పేర్కొంది. అదేవిధంగా మద్యం రవాణా వాహనాలకు జి పి ఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయడం ద్వారా అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నం జరుగుతోంది. సిసి టి వి కెమెరాలు, లైవ్ మానిటరింగ్ వ్యవస్థలతో పర్యవేక్షణను మరింత కఠినతరం చేయనున్నారు.

భారతదేశంలో మద్యం నియంత్రణ పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండటం వల్ల ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో సంపూర్ణ నిషేధం అమల్లో ఉండగా, తమిళనాడు, కేరళలో ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలు ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చండీగఢ్ తీసుకున్న తాజా నిర్ణయం, ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా మారే అవకాశముంది.

మద్యం సేవించే కనీస వయస్సు విషయంలో కూడా దేశంలో ఏకరీతి లేదు. కొన్ని రాష్ట్రాల్లో 18 ఏళ్లు, మరికొన్ని చోట్ల 21 లేదా 25 ఏళ్లు కనీస వయస్సుగా నిర్ణయించారు. ఈ భిన్న విధానాలు సామాజిక పరిస్థితులు, సంస్కృతి, ప్రభుత్వ లక్ష్యాల ఆధారంగా రూపొందించబడుతున్నాయి.

ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాలు పన్నుల విధానంలో కూడా మార్పులు చేస్తున్నాయి. ఉదాహరణకు కర్ణాటకలో మద్యం ధరను కాకుండా అందులోని ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్ను విధించే ప్రయత్నం జరుగుతోంది. మహారాష్ట్రలో పండుగల రోజుల్లో ‘డ్రై డే’ నియమాలను సడలించడం కూడా గమనించదగ్గ పరిణామం.

అంతర్జాతీయంగా చూస్తే, చండీగఢ్ తీసుకున్న నిర్ణయం కొత్తది కాదు. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో సూపర్ మార్కెట్లు, గ్యాస్ స్టేషన్లలో మద్యం అమ్మకాలు సాధారణమే. అయితే అక్కడ అమ్మకాల సమయాలు, వినియోగంపై కఠిన నియంత్రణలు ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అంశాలపై తీవ్ర శిక్షలు అమలు చేస్తారు. కొన్ని దేశాల్లో అయితే మద్యం పూర్తిగా నిషేధితమే. సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాల్లో మద్యం తయారీ, వినియోగం చట్టవిరుద్ధం. మరోవైపు ఆస్ట్రేలియా వంటి దేశాలు అధిక పన్నుల ద్వారా వినియోగాన్ని తగ్గించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చండీగఢ్ కొత్త పాలసీ భారతదేశంలో మద్యం విక్రయాల దిశను మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఒకవైపు ఆదాయం పెరగడం, వినియోగదారులకు సౌలభ్యం కలగడం వంటి ప్రయోజనాలు కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు నియంత్రణ లోపిస్తే సామాజిక సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

రిపోర్టర్ నోట్ (కోడికూత):
సౌకర్యం పెరగడం అనేది ఎప్పుడూ అభివృద్ధి సంకేతమే. కానీ మద్యం వంటి సున్నిత అంశాల్లో సౌలభ్యానికి తోడు బాధ్యత, నియంత్రణ కూడా సమానంగా ఉండాలి. చండీగఢ్ మోడల్ దేశానికి ఆదర్శమవుతుందా? లేక సవాళ్లకు కారణమవుతుందా? అన్నది అమలు విధానంపైనే ఆధారపడి ఉంటుంది.