దేశవ్యాప్తంగా ‘జై శ్రీరామ్’ నినాదం మారుమోగుతోంది. అయోధ్యలో భవ్య రామమందిరం సాకారమై, కోట్లమంది భక్తుల కల నెరవేరిన వేళ.. శ్రీరాముడి జీవితంతో పెనవేసుకున్న మరో అద్భుత ఘట్టం ఛత్తీస్‌గఢ్ మట్టిలో నిశ్శబ్దంగా తన ఉనికిని చాటుకుంటోంది. ఆమే రాముడి కన్నతల్లి కౌసల్య. ఆమె జన్మించిన పుణ్యభూమి.. చందఖురి. రాముడికి ఇది ‘ననిహాల్’ (అమ్మమ్మగారి ఊరు). ఇప్పటికీ బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ ఆధ్యాత్మిక రహస్యం, ఇప్పుడు అభివృద్ధి ఆభరణాలను అద్దుకుని ‘పర్యాటక స్వర్గం’గా మారుతోంది.
మేనల్లుడి రూపంలో ‘రామయ్య’.. ఇదో వింత సంప్రదాయం!
భారతదేశం అంతటా రాముడిని దేవుడిగా కొలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి ఇంట్లో ఆయనను తమ ‘మేనల్లుడి’ (భాంజా)గా ఆరాధిస్తారు. చందఖురి కౌసల్యాదేవి పుట్టిన ఊరు కావడంతో, రాముడు ఈ ప్రాంతానికి మేనల్లుడు అవుతాడు. అందుకే ఇక్కడ ప్రజలు రాముడిని ‘భాంజా రామ్’ అని పిలుచుకుంటారు. ఈ సంప్రదాయం ఎంతగా పాతుకుపోయిందంటే.. ఇక్కడి ప్రజలు తమ సొంత మేనల్లుళ్లను కూడా రాముడి స్వరూపంగా భావించి వారి పాదాలకు నమస్కరిస్తారు. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక అనుబంధం.
జలసేన చెరువులో ‘కౌసల్య’ కొలువు
చందఖురిలోని ప్రధాన ఆకర్షణ మాతా కౌసల్య ఆలయం. జలసేన అనే విశాలమైన చెరువు మధ్యలో, ఒక ద్వీపంలా ఈ ఆలయం వెలిసింది. ప్రపంచంలో కౌసల్యాదేవికి ఉన్న ఏకైక ఆలయం ఇదే కావడం విశేషం. ఆలయంలో కౌసల్య తన ముద్దుల పట్టి రాముడిని ఒడిలో కూర్చోబెట్టుకున్న దృశ్యం భక్తుల మనసులను కట్టిపడేస్తుంది. 17వ శతాబ్దపు శిల్పకళా చాతుర్యం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన 51 అడుగుల భారీ శ్రీరాముడి విగ్రహం పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. మాతా కౌసల్యా ఆలయంప్రతిరోజూ ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు, తిరిగి సాయంత్రం 3:00 నుండి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. సాయంత్రం వేళల్లో ఆలయ సౌందర్యం మరియు లైటింగ్ చూడముచ్చటగా ఉంటుంది. చందఖురి వెళ్ళినప్పుడుఆలయానికి అతి సమీపంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేట్ పోలీస్ అకాడమీ, నవ రాయ్‌పూర్ను చూడవచ్చు.ఆధునిక పద్ధతిలో నిర్మించిన ఈ నగరం, ఇక్కడి సెంట్రల్ పార్క్ , సాంస్కృతిక మ్యూజియం) పర్యాటకులను ఆకర్షిస్తాయి.
అభివృద్ధికి ‘రామ్ వన్ గమన’ వారధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రామ్ వన్ గమన టూరిజం సర్క్యూట్’లో చందఖురి గుండెకాయ వంటిది. రాముడు వనవాస కాలంలో సంచరించిన ప్రదేశాలను కలిపే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ₹133 కోట్లు కేటాయించారు. రాయ్‌పూర్ నుండి సులభంగా చేరుకునేలా ఫోర్-లేన్ రహదారి నిర్మాణం. పర్యాటకుల కోసం లైట్ అండ్ సౌండ్ షో, మ్యూజికల్ ఫౌంటైన్లు, కెఫెటేరియా మరియు బస చేసేందుకు కాటేజీల ఏర్పాటు. స్థానిక మహిళా సంఘాలకు పూల దుకాణాలు, ప్రసాదం కౌంటర్ల ద్వారా ఉపాధి కల్పన వంటి అంశాలు ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి.
ఆధ్యాత్మికత చెంతనే.. రక్షణ శిక్షణ!
చందఖురి మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణానికి పక్కనే అత్యున్నత స్థాయి ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేట్ పోలీస్ అకాడమీ’ ఉండటం. ఒకవైపు నక్సలిజం సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులకు కఠిన శిక్షణ ఇస్తూనే, మరోవైపు రామరాజ్యం లాంటి శాంతియుత సమాజాన్ని నిర్మించాలనే ఆకాంక్ష ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
మహోత్సవాల మెరుపులు.. సాధికారత వెలుగులు!
ఇటీవల నిర్వహించిన ‘మాతా కౌసల్య మహోత్సవం 2026’ ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. కేవలం భక్తికే పరిమితం కాకుండా, మహిళా సాధికారతకు ఈ వేదిక అద్దం పట్టింది. ‘మహతారి వందన యోజన’ వంటి పథకాలతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూనే, సంస్కృతిని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చట్టిస్గడ్ మంత్రి గురు ఖుశ్వంత్ సాహెబ్ అన్నారు. "రాముడు చూపిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ, అభివృద్ధి ఫలాలను చివరి వ్యక్తి వరకు చేరవేస్తున్నట్లు ఆయన చెప్పారు.
అయోధ్య స్థాయికి చేరుతుందా?
మౌనిక సదుపాయాల కల్పన ద్వారా భౌతిక అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ, చందఖురి ఇంకా జాతీయ స్థాయిలో తన ముద్ర వేయాల్సి ఉంది. అయోధ్య భౌగోళికంగా పెద్దదైనప్పటికీ, భావోద్వేగ పరంగా చందఖురికి ఉన్న ప్రాముఖ్యత తక్కువ కాదు. ఆధ్యాత్మికత, రాజకీయ ప్రాధాన్యత, మరియు అభివృద్ధి సమ్మిళితమైతేనే చందఖురి ‘దక్షిణ అయోధ్య’గా విరాజిల్లుతుంది. రాముడి కథలో ఇప్పటివరకు మరుగున పడిన ఈ ‘ననిహాల్’ అధ్యాయం, భవిష్యత్తులో భారత పర్యాటక రంగంలో ఒక ధ్రువతారగా వెలగడం ఖాయంగా కనిపిస్తుంది.
చందఖురి (మాతా కౌసల్యా ధామ్) సందర్శించాలనుకునే భక్తులు మరియు పర్యాటకుల కోసం ప్రయాణ మార్గాలు, వసతికి సంబంధించిన పూర్తి వివరాలు :
ప్రయాణ మార్గాలు :
చందఖురి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుండి సుమారు 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయం చందఖురికి అత్యంత సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి చందఖురి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ నుండి టాక్సీ లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రైలులో వెళుతుంటే రాయ్‌పూర్ జంక్షన్ ప్రధాన రైల్వే స్టేషన్. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైలు సౌకర్యం ఉంది. స్టేషన్ నుండి క్యాబ్స్, ఆటోలు లేదా బస్సుల ద్వారా చందఖురి చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో రాయ్‌పూర్ నుండి చందఖురికి ప్రభుత్వం మెరుగైన రహదారి సౌకర్యాన్ని (4-లేన్ రోడ్డు) కల్పించింది. రాయ్‌పూర్ ప్రధాన నగరం నుండి ఆరంగ్ వెళ్లే మార్గంలో చందఖురి వస్తుంది. సొంత వాహనం లేదా అద్దె టాక్సీలలో వెళ్లడం సౌకర్యవంతంగా ఉంటుంది.
చందఖురి ఒక చిన్న గ్రామం కావడంతో, అక్కడ నేరుగా పెద్ద హోటళ్లు ఉండకపోవచ్చు. కానీ రాయ్‌పూర్ నగరం మరియు చందఖురి మార్గంలో అద్భుతమైన రిసార్టులు, హోటళ్లు అందుబాటులో ఉన్నాయి.




