డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌కు రాజకీయనేతలకు ప్రత్యక్ష సంభందాలు ఉన్నాయా అనే అనుమానాలు ఇపుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో వెలుగు చూసిన పెద్ద పెద్ద డ్రగ్స్ వినియోగం కేసుల్లో చాలా మంది రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి, అయితే వీటిలో పలు కేసులు ఇంకా విచారణ దశలోనే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. కోర్టులో దోషిగా తేలకపోతే వారిని నేరస్థులుగా పరిగణించరు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏలూరు పార్లమెంట్ సభ్యుడు, టి డి పి పార్టీ కి చెందిన పుట్టా మహేష్ యాదవ్ , తెలంగాణాకు చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటు రాజస్థాన్‌కు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే సహా పలువురు తెలంగాణ లోని మోయినాబాద్లో ఉన్న ఫార్మ్‌హౌస్ లో పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. డ్రగ్స్ పార్టీ లో కోకైన్, యండి యం ఏ మెత్ వాడినట్టు గుర్తించిన పోలీసులు దానికి అనుగుణంగా చర్యలు చేపట్టారు. అయితే ప్రధానంగా ఎపి , తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశం ఇపుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎపిలోతెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం , ఆ పార్టీ కి చెందిన ఏం పి పుట్టా మహేష్ కేసులో పట్టుబడటంతో విపక్ష వై సి పి నేతలు పుట్టా మహేష్ రాజీనామాకు బలంగా డిమాండ్ చేస్తున్నారు. దేశంలో తొలిసారి ఒక ఏం పి డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడని ఇది ఎపి ఇమేజ్ ను దెబ్బ తిసిందంటూ పొలిటికల్గా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు వై సి పి నేతలు సాద్యమైనంతగా తమ స్వరాలు పెంచి ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణాకు చెందిన బీఆర్ఎస్ నేత,మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం తో అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది. మరోవైపు ఈ ఘటన పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఘాటుగానే స్పందించింది. కేసు విషయం తేలేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇక తగిన వివరణ ఇవ్వాలని నోటిసు జారి చేసింది. అదేసమయంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఘటనలు ఆసక్తిని రేపుతున్నాయి. యెన్ డి పి ఎస్ ఆక్ట్ – 1985 ప్రకారం డ్రగ్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.
బెంగళూరు డ్రగ్ పార్టీ కేసు (2020):
2020లో బెంగళూరులో జరిగిన డ్రగ్ పార్టీ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసులో సినీ పరిశ్రమతో పాటు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు విచారణలో ప్రస్తావనకు వచ్చాయి. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేసింది.
పంజాబ్ డ్రగ్ స్కాం (సింథటిక్ డ్రగ్ రాకెట్)
పంజాబ్‌లో 2013–2017 మధ్య భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఈ కేసులో అప్పటి అకాలీదళ్ నేత, మాజీ మంత్రిబిక్రమ్ సింగ్ మజీథియా పేరు విచారణలో ప్రస్తావనకు వచ్చింది. పంజాబ్ పోలీసులు మరియు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఈ కేసును పరిశీలించాయి.
ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసు (2021) :
2021లో ముంబై సముద్రంలో క్రూయిజ్ షిప్‌లో జరిగిన డ్రగ్ పార్టీపై యెన్ సి బి దాడి చేసింది. ఈ కేసులో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల పిల్లలు విచారణకు లోనయ్యారు. ఈ కేసు సమయంలో మహారాష్ట్రలో రాజకీయ నాయకుల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రతి విమర్శలు వినిపించాయి.
ఇవి కాకుండా 2025 లో లింగరాజ్ కన్నీ మహారాష్ట్రలో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు అయ్యారు. ఈయన కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. అప్పట్లో అతని వద్ద నుంచి నిషేధిత కోడిన్ సిరప్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అదే ఏడాదిలో పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు బీజేపీ నేతలు దిన్హాటా ప్రాంతంలో యాబా టాబ్లెట్లు (సింథటిక్ డ్రగ్స్) కేసులో అరెస్టు అయ్యారు.