దేశరాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ – ఆప్ ., ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిన్నటి వరకు పార్టీకి గొంతుకగా, అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా.. నేడు అదే పార్టీలో ‘ఒంటరి’ పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి ఆయన్ని తప్పించడం కేవలం పదవి కోత మాత్రమే కాదు, పార్టీలో ఆయన ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించే వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది.

ఈ పరిణామాలపై రాఘవ్ చడ్డా తనదైన శైలిలో స్పందించారు. "నన్ను మౌనంగా ఉండేలా చేశారు (I have been silenced), కానీ నేను ఓడిపోలేదు" అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూనే, "ప్రజల గొంతును వినిపించడం నేరమా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభలో తాను మాట్లాడకుండా పార్టీ నాయకత్వమే లేఖ రాయడంపై ఆయన తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు.

మరోవైపు రాఘవ్ చడ్డా చేసిన ఈ వ్యాఖ్యలపై ఆప్ అగ్రనేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పార్టీ పట్ల ఆయన నిబద్ధతను ప్రశ్నిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ, "అరవింద్ కేజ్రీవాల్ సైనికులకు భయం తెలియదు. ఎవరైతే భయపడతారో వారు చచ్చినట్లే లెక్క" అంటూ పరోక్షంగా చడ్డా కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

పార్టీ నేతలు లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరాలు పరిశిలిస్తే ముఖ్యమైన అంశాల్లో ప్రధాని మోదీ లేదా కేంద్ర ప్రభుత్వంపై రాఘవ్ చడ్డా నేరుగా విమర్శలు చేయడం లేదని పార్టీ ఆరోపిస్తోంది. పార్టీ జారీ చేసిన విప్ కు వ్యతిరేకంగా వ్యవహరించడం, పార్టీ సామూహిక నిర్ణయాలకు విరుద్ధంగా ఉండటం వల్లనే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ప్రధాన బిల్లులపై ఓటింగ్ లేదా నిరసనల సమయంలో ఆయన సభ నుంచి వాకౌట్ చేయకుండా ఉండటం, ఇతర ప్రతిపక్ష నేతలతో కలిసి రాకపోవడం పార్టీకి ఆగ్రహం కలిగించింది.

చడ్డా తన వాదనలో తాను విమానాశ్రయాల్లో ఆహార ధరల పెరుగుదల, టోల్ గేట్ల వద్ద దోపిడీ, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం వంటి ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. అయితే, దీనికి సౌరభ్ భరద్వాజ్ కౌంటర్ ఇస్తూ, "ఎయిర్‌పోర్ట్ క్యాంటీన్‌లో సమోసాల ధరలు తగ్గించడం కంటే, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలపై మాట్లాడటం ముఖ్యం" అని ఎద్దేవా చేశారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ నియామక బిల్లు వంటి కీలక అంశాలపై చడ్డా సంతకం చేయకపోవడాన్ని కూడా పార్టీ తప్పుబట్టింది.

దూరం ఇప్పటిది కాదు.. లోక్‌సభ ఎన్నికల నాటి నుంచే!

రాఘవ్ చడ్డా మరియు ఆప్ నాయకత్వం మధ్య దూరం ఒక్కరోజులో పెరిగింది కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు రాఘవ్ చడ్డా సుదీర్ఘకాలం విదేశాల్లో ఉండటం పార్టీ శ్రేణుల్లో అసహనాన్ని కలిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పార్టీ నేతలంతా పోరాడుతుంటే, చడ్డా మాత్రం మౌనంగా ఉండిపోయారని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి జంకుతున్నారని పార్టీ అంతర్గత వర్గాలు చర్చించుకుంటున్నాయి.

పంజాబ్ సమీకరణాలు - అశోక్ మిట్టల్ రాక

రాఘవ్ చడ్డాను తొలగించి ఆయన స్థానంలో పంజాబ్‌కు చెందిన ఎంపీ అశోక్ మిట్టల్‌ను రాజ్యసభ ఉపనేతగా నియమించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీ పట్ల విధేయతగా ఉండే నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించే ఎవరినైనా ఉపేక్షించబోమని ఈ మార్పు ద్వారా గట్టి సంకేతాలు పంపారు.

ప్రస్తుతానికి రాఘవ్ చడ్డా తాను ఒక ‘నది’ వంటివాడినని, సమయం వచ్చినప్పుడు ‘ఉప్పెన’లా మారుతానని హెచ్చరించారు. ఆయన తిరుగుబాటు ధోరణి ఆప్ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీయవచ్చు. ఒకప్పుడు కేజ్రీవాల్‌కు కుడిభుజంగా ఉన్న వ్యక్తి, నేడు పార్టీలోనే అంటరానివాడిగా మారడం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడిని మరోసారి గుర్తు చేస్తోంది. కేజ్రీవాల్ కంచుకోటలో చడ్డా మున్ముందు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో వేచి చూడాలి.