రాజస్థాన్‌, మే 2 : వ్యాపారంలో లాభాలు రావాలంటే పక్కా ప్రణాళిక, పెట్టుబడితో పాటు అదృష్టం కూడా ఉండాలని చాలామంది నమ్ముతారు. కానీ, ఆ దేవుడినే తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుంటే? లాభాల్లో ఆయనకూ వాటా ఇస్తామని ఏకంగా స్టాంపు పేపర్ల మీద అగ్రిమెంట్లు రాసుకుంటే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లాలో కొలువైన శ్రీ సాన్వాలియా సేథ్ ఆలయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆలయానికి 2025-26 సంవత్సరంలో ఏకంగా రూ.337 కోట్ల రికార్డు స్థాయి విరాళాలు వచ్చాయి. గత 34 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయిలో ఆదాయం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

దేవుడితో ‘పార్టనర్‌షిప్ డీడ్’.. వినూత్న సంప్రదాయానికి కేరాఫ్ సాన్వాలియా సేథ్

చిత్తోడ్‌గఢ్‌లోని మండఫియాలో ఉన్న ఈ ప్రధాన ఆలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు.. భక్తుల అపార విశ్వాసాలకు, వినూత్న మొక్కులకు సజీవ సాక్ష్యం. ఇక్కడికి వచ్చే భక్తులు శ్రీకృష్ణుడిని (ఠాకూర్ జీ) 'సేథ్ జీ' అంటే ఒక యజమానిగా, గొప్ప వ్యాపారవేత్తగా కొలుస్తారు. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడు లేదా ఉన్న వ్యాపారం నిరంతరం వృద్ధి చెందాలని కోరుకునేవారు నేరుగా సాన్వాలియా సేథ్‌ను తమ బిజినెస్ పార్టనర్‌గా చేసుకుంటారు. ఇందుకోసం భక్తులు ఏకంగా స్టాంపు పేపర్లపై 'పార్టనర్‌షిప్ డీడ్' రాసి, లాభాల్లో దేవుడికి 2 శాతం నుంచి 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని హుండీలో వేస్తారు. వ్యాపారంలో లాభాలు వచ్చిన తర్వాత, ఆ మొక్కును తీర్చుకుంటూ లక్షల రూపాయల వాటాను తమ సంస్థ లెటర్ హెడ్ల మీద రాసి మరీ స్వామివారికి సమర్పించడం ఇక్కడి ప్రధాన ఆచారం. ఈ విలక్షణమైన భాగస్వామ్యం వల్లే ఆలయానికి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది.

వెండి పెట్రోల్ బంక్ నుంచి కార్ల వరకు.. ఆకట్టుకుంటున్న భక్తుల కానుకలు

కేవలం డబ్బులు, లాభాల్లో వాటాలు మాత్రమే కాదు.. భక్తులు సమర్పించే కానుకలు కూడా ఎంతో విలక్షణంగా ఉంటాయి. తమ కోరికలు నెరవేరిన తర్వాత దేవుడికి కృతజ్ఞతగా వెండితో చేసిన మొబైల్ కవర్లు, కార్లు, బైక్‌ల నమూనాలను ఇక్కడ కానుకలుగా ఇస్తుంటారు. ఒక భక్తుడైతే తన వ్యాపారం లాభాల బాట పట్టడంతో, స్వామివారికి వెండితో చేసిన 'పెట్రోల్ పంపు' నమూనాను సమర్పించడం విశేషం. ఇలాంటి అరుదైన, వింతైన కానుకలు నిత్యం వస్తుండటంతో.. ఆలయ పరిసరాల్లో వీటికి సంబంధించిన వెండి నమూనాలను విక్రయించే దుకాణాలు ఎప్పుడూ రద్దీగా, వ్యాపారంతో కళకళలాడుతుంటాయి.

చారిత్రక నేపథ్యం: కలలో కనిపించిన మీరాబాయి ఆరాధ్య దైవం

దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1849వ సంవత్సరంలో భద్సోరా గ్రామానికి చెందిన భోలారామ్ గుర్జర్ అనే వ్యక్తికి స్వామివారు కలలో కనిపించి, భూమిలో తన విగ్రహాలు ఉన్నాయని చెప్పినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆయన చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు జరపగా.. అత్యంత సుందరమైన శ్రీకృష్ణుడి మూడు నల్లని పాలరాతి విగ్రహాలు బయటపడ్డాయి. అందులో అతిపెద్ద విగ్రహాన్ని మండఫియా గ్రామంలో ప్రతిష్టించగా, మిగిలిన రెండు విగ్రహాలను భద్సోరా, చాపర్ గ్రామాల్లో ప్రతిష్టించారు. ఈ విగ్రహాలను సాక్షాత్తూ భక్త మీరాబాయి పూజించారని, ముస్లిం రాజుల దండయాత్రల సమయంలో వాటిని రక్షించేందుకు ఇలా భూమిలో భద్రపరిచారని స్థానిక భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

నగారా శైలిలో అద్భుత నిర్మాణం.. రాజభోగాలతో సేవాకార్యక్రమాలు

దేవుడిని సాక్షాత్తూ 'సేథ్' (యజమాని)గా భావించే ఇక్కడి సంప్రదాయం ప్రకారం, స్వామివారికి నిత్యం 'రాజభోగం' (రాజరికపు మర్యాదలతో కూడిన అత్యుత్తమ నైవేద్యం) సమర్పిస్తారు. అద్భుతమైన 'నగారా' వాస్తుశిల్ప శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉదయపూర్ నగరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రం అటు భక్తికి, ఇటు వినూత్న సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. కేవలం రాజస్థాన్ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, ముఖ్యంగా వ్యాపారవేత్తలు స్వామివారిని దర్శించుకుని తమ వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తుంటారు. ఏది ఏమైనా.. భక్తికి, వ్యాపారానికి మధ్య ఉన్న ఈ విలక్షణమైన అనుబంధం సాన్వాలియా సేథ్ ఆలయాన్ని దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయంగా మారుస్తోంది.