భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అచంచల భక్తికి, అప్రతిహత శక్తికి నిలువెత్తు రూపం ఆంజనేయుడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి సేవ కోసం అవతరించిన రుద్రాంశ సంభూతుడు. నేటికీ కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ ఏడాది హనుమాన్ జయంతి అత్యంత విశిష్టమైనదిగా జ్యోతిష్య శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. అరుదైన గ్రహ గతులు, పవిత్రమైన యోగాల కలయిక మధ్య మారుతి జన్మోత్సవం వైభవోపేతంగా జరగనుంది.
ఖగోళ అద్భుతం: గ్రహాల గతి.. భక్తులకు సిరిసంపదలు
సాధారణంగా ప్రతి ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడి జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. అయితే, ఈసారి తిథి నిర్ణయంలో కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ, 'నిర్ణయ సింధు' గ్రంథోక్త ప్రకారం ఏప్రిల్ 2, గురువారం నాడు ఈ వేడుకలను జరుపుకోవడం శాస్త్రసమ్మతమని విద్వత్ సభలు తేల్చాయి.
ఈ ఏడాది వేడుకల్లో శివ వాసం, ధ్రువ యోగం వంటి అరుదైన యోగాలతో పాటు హస్త, చిత్ర నక్షత్రాల కలయిక ఏర్పడటం విశేషం. దీనికి తోడు గురువారం నాడు పూర్ణిమ రావడం వల్ల హనుమంతుడితో పాటు ఆయన ఆరాధ్య దైవమైన శ్రీమహావిష్ణువు అనుగ్రహం కూడా భక్తులకు లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ శుభ ఘడియల్లో స్వామిని దర్శించుకోవడం వల్ల జాతకంలోని శని దోషాలు తొలగిపోవడమే కాకుండా, మానసిక ధైర్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కిష్కింధ నుండి కాశీ వరకు.. దేశమంతా మారుతి స్మరణే!
భారతదేశం విభిన్న సంస్కృతుల నిలయం. హనుమ జయంతి వేడుకలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉన్నప్పటికీ, భక్తిలో మాత్రం ఏకరూపత కనిపిస్తుంది.
- అయోధ్య వైభవం: రామజన్మభూమి అయోధ్యలోని 'హనుమాన్ గర్హి'లో వేడుకలు అంబరాన్నంటుతాయి. రాముడి దర్శనానికి ముందే హనుమంతుడి అనుమతి తీసుకోవాలనే సంప్రదాయం ఇక్కడ అనాదిగా వస్తోంది.
- వారణాసి సంగీతార్చన: కాశీలోని 'సంకట మోచన' ఆలయంలో జయంతి సందర్భంగా నిర్వహించే శాస్త్రీయ సంగీత ఉత్సవాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతాయి.
- దక్షిణాది విశిష్టత: తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు రెండుసార్లు జరుగుతాయి. చైత్ర పూర్ణిమతో మొదలై 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేసే భక్తులు, వైశాఖ బహుళ దశమి నాడు 'హనుమాన్ దీక్ష' విరమిస్తారు. కొండగట్టు అంజన్న క్షేత్రం ఈ సందర్భంగా జనసంద్రంగా మారుతుంది.
- కర్ణాటకలోని కిష్కింధ: హంపి సమీపంలోని అంజనాద్రి కొండను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తారు. ఈ పవిత్ర పర్వతంపై వేడుకలు చూడటం ఒక మధురానుభూతి.
జననం వెనుక జగన్మాత సంకల్పం
హనుమంతుని జననం వెనుక అద్భుతమైన కథాక్రమం ఉంది. అంజనాదేవి సంతానం కోసం చేసిన ఘోర తపస్సు, వాయుదేవుడు తెచ్చిన పుత్రకామేష్ఠి ప్రసాదం, శివుని రుద్రాంశ.. ఇవన్నీ కలిసి ఒక మహాశక్తికి ప్రాణం పోశాయి. అందుకే ఆయన వాయుపుత్రుడయ్యాడు, అంజనీసుతుడయ్యాడు, శివాంశ సంభూతుడయ్యాడు.
హనుమంతుడు కేవలం ఒక వానర వీరుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప మేధావి, వ్యాకరణవేత్త, మరియు సంగీత కోవిదుడు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు ఇప్పటికీ భూమిపై సంచరిస్తున్నారని, ఎక్కడ రామనామం వినిపించినా అక్కడ ఆయన ప్రత్యక్షమవుతారని పురాణవచనం. హిమాలయాల్లోని గంధమాదన పర్వతం ఆయన నివాసమని చెబుతారు. వాల్మీకి కంటే ముందే హనుమంతుడు రామకథను రాశారన్నది ఒక చారిత్రక రహస్యం. తన రచన వాల్మీకి రచన కంటే గొప్పగా ఉందన్న అహంకారం రాకూడదని, ఆయన దానిని సముద్రార్పణం చేసిన గొప్ప త్యాగమూర్తిగా చెబుతారు.
హనుమంతుడికి ఉన్న 'అష్ట సిద్ధులు'
అష్ట సిద్ధులు అంటే ఎనిమిది రకాల అసాధారణ శక్తులు. యోగ సాధన ద్వారా లభించే ఈ శక్తులు హనుమంతుడికి పుట్టుకతోనే లభించాయి. వీటి వల్లే ఆయన అసాధ్యమైన పనులను సుసాధ్యం చేయగలిగారు.
* అణిమ అంటే తన శరీరాన్ని ఒక అణువంత చిన్నగా మార్చుకోగల శక్తి. లంకలోకి ప్రవేశించేటప్పుడు అక్కడి రక్షక భటుల కంట పడకుండా ఉండటానికి, హనుమంతుడు తన రూపాన్ని ఒక చిన్న దోమ అంత పరిమాణంలోకి మార్చుకున్నారు.
* శరీరాన్ని పర్వతమంత భారీగా, అనంతంగా పెంచుకోగల శక్తి ఉన్న మహిమా గల వాడు. సముద్రాన్ని దాటేటప్పుడు 'సురస' అనే రాక్షసిని ఎదుర్కొన్నప్పుడు, అలాగే లంకా దహనం సమయంలో హనుమంతుడు ఆకాశమంత ఎత్తుకు పెరిగారు.
* గరిమ : శరీర బరువును అపరిమితంగా పెంచుకోగల శక్తి. ఎంతటి బలవంతుడైనా సరే ఆయనను కదల్చలేనంత బరువుగా మారిపోతారు. మహాభారతంలో భీముడి గర్వాన్ని అణచడానికి, హనుమంతుడు తన తోకను భీముడు కదల్చలేనంత బరువుగా మార్చేశారు.
* లఘిమ: శరీరాన్ని దూది కంటే తేలికగా మార్చుకోగల శక్తి. దీనివల్ల గాలిలో తేలడం, ఎంత దూరమైనా వేగంగా ఎగరడం సాధ్యమవుతుంది. సముద్రంపై వంద యోజనాల దూరం ఎగిరి వెళ్లడానికి ఈ 'లఘిమ' సిద్ధే కారణం.
* ప్రాప్తి : ఎక్కడికైనా క్షణాల్లో చేరుకోగలగడం లేదా ఏ వస్తువునైనా పొందగలగడం. ప్రకృతిలోని శక్తులను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం.లంకలో సీతమ్మ వారు ఎక్కడున్నారో వెతకడానికి, అడ్డంకులను అధిగమించడానికి ఈ శక్తి తోడ్పడింది.
* ప్రాకామ్యం:సంకల్ప బలం. తాను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడం. నీటిపై నడవడం, భూమిలోకి దూరిపోవడం వంటివి దీని కిందకు వస్తాయి. పాతాళ లంకలోకి వెళ్లి అహిరావణ, మహిరావణులను అంతం చేయడానికి ఈ శక్తి ఉపయోగపడింది.
* ఈశిత్వం: దైవ సమానమైన శక్తి. ప్రకృతిని, పంచభూతాలను (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) శాసించే అధికారం.లంకా దహనం చేస్తున్నప్పుడు అగ్ని దేవుడు హనుమంతుడికి ఏ హానీ చేయకపోవడం, వాయుదేవుడు సహకరించడం ఈ శక్తికి నిదర్శనం.
* వశిత్వం: ఎవరినైనా తన వశం (ఆధీనం) చేసుకోవడం. జంతువులను, మనుషులను, దేవతలను కూడా తన మాట వినేలా చేసుకోగల శక్తి. తన శాంత స్వభావంతో, భక్తితో అందరినీ ముగ్ధులను చేయడం ఈ శక్తి విశిష్టత.
హనుమంతుడు ఈ శక్తులను ఎప్పుడూ తన స్వార్థం కోసం ఉపయోగించలేదు. కేవలం ధర్మ రక్షణ కోసం, శ్రీరాముడి సేవ కోసం మాత్రమే వీటిని ప్రయోగించారు. అందుకే ఆయన 'మహావీరుడు' అయ్యారు.
నేటి యాంత్రిక జీవనంలో మానసిక ఒత్తిడికి గురవుతున్న యువతకు హనుమంతుడు ఒక స్ఫూర్తిప్రదాత. క్రమశిక్షణ, బ్రహ్మచర్యం, సేవాభావం మరియు అంకితభావానికి ఆయన మారుపేరు. హనుమాన్ జయంతి కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆయనలోని సద్గుణాలను అలవరచుకోవడానికి ఒక వేదిక కావాలి. సింధూర లేపనం, తమలపాకుల పూజ, వడమాల సమర్పణలతో పాటు ఆయన నామస్మరణ చేస్తే చాలు.. కొండంత అండ దొరుకుతుందని భక్తుల నమ్మకం.
వాయుపుత్రుని దీవెనలతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. జై శ్రీరామ్! జై హనుమాన్!




