దక్షిణ భారత సినీ యవనికపై తనదైన ముద్ర వేసిన నటి అనుష్క శెట్టి. ‘బాహుబలి’లో దేవసేనగా యావత్ భారత దేశాన్ని మెప్పించిన ఈ ‘జెజెమ్మ’ ఇప్పుడు మరో అద్భుత దృశ్యకావ్యంతో మన ముందుకు రాబోతోంది. అదే ‘కథనార్‌ - ది వైల్డ్ సోర్సరర్’. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇటు మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారత సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కేవలం ఒక సినిమాగా కాకుండా, ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచాన్ని కళ్లకు కడుతూ ఈ చిత్రం రాబోతుందనే సంచారంతో రోజురోజుకి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న అనుష్క శెట్టి, ఈ చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ఆమె ఎంచుకుంటున్న కథల్లో వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఆస్కారమున్న భారీ ప్రాజెక్టులను ఆమె ఎంచుకుంటున్నారు. ‘కథనార్‌’లో ఆమె పాత్ర అత్యంత నిగూఢంగా, శక్తిమంతంగా ఉండబోతోందని ఇప్పటికే ట్రైలర్ చూసిన అర్థమవుతోంది.

మలయాళలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో నటించిన యాక్టర్ జయసూర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఆహార్యం, గడ్డం పెంచిన రూపం ఒక మాయావిని తలపిస్తోంది. కేరళ జానపద కథల్లో ప్రసిద్ధి చెందిన ‘కదమత్త్తతు కథనార్‌’ అనే మాంత్రికుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. జయసూర్య , అనుష్కల మధ్య సాగే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీరితో పాటు భారతీయ సినీ దిగ్గజం ప్రభుదేవా కూడా కీలక పాత్రలో మెరవనుండటం విశేషం.

విజువల్స్ లో ‘కాంతార’కు గట్టి పోటీ

ఇటీవల కాలంలో ‘కాంతార’ వంటి చిత్రాలు ప్రాచీన సంస్కృతిని, దైవిక శక్తులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాయి. అయితే ‘కథనార్‌’ ట్రైలర్ చూస్తుంటే, ఇది విజువల్ పరంగా మరో మెట్టు పైనే ఉందనిపిస్తోంది. ట్రైలర్‌లో చూపించిన గ్రాఫిక్స్, కలర్ గ్రేడింగ్ మరియు సెట్టింగ్స్ హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కథ ప్రేక్షకులను సైతం నాటి కాలానికి మనిషిని తీసుకెళ్తుంది. కేవలం మంత్ర తంత్రాలే కాకుండా, ఆ కాలంలోని సైన్స్, జ్ఞానం మరియు మానవాతీత శక్తుల మధ్య జరిగే సంఘర్షణను దర్శకుడు రోజిన్ థామస్ అద్భుతంగా తెరకెక్కించారు. ట్రైలర్‌లో కనిపించే అడవులు, ప్రాచీన కట్టడాలు మరియు అతీంద్రియ శక్తుల విన్యాసాలు ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి.

సాంకేతిక విలువల విందు - 15 భాషల్లో భారీ విడుదల

సుమారు 2 నిమిషాల 58 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్, సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. రాహుల్ సుబ్రమణియన్ అందించిన నేపథ్య సంగీతం వెన్నులో వణుకు పుట్టించేలా, ఉత్కంఠభరితంగా ఉంది. నీల్ డికున్హా విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపిస్తోంది. ‘హోమ్’ వంటి సున్నితమైన చిత్రాన్ని తీసిన రోజిన్ థామస్, ఇప్పుడు ఇంతటి భారీ ఫాంటసీ థ్రిల్లర్‌ను ఎలా హ్యాండిల్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఈ చిత్రంలో భారీగా వినియోగించినట్లు సమాచారం.

‘కథనార్‌’ కేవలం మలయాళానికి మాత్రమే పరిమితం కాకుండా, పాన్-వరల్డ్ చిత్రంగా రాబోతోంది. హిందీ, ఇంగ్లీష్‌తో సహా మొత్తం 15 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దక్షిణాది సినిమాలు ఇప్పుడు సరిహద్దులు చెరిపేస్తున్నాయి. ‘బాహుబలి’ ఎలాగైతే తెలుగు సినిమా స్థాయిని పెంచిందో, ‘కథనార్‌’ మలయాళ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రగాళ్లు, ఆత్మలు, దైవిక శక్తులు వంటి కథాంశాలకు అధునాతన సాంకేతికత తోడైతే ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ చిత్రం నిరూపించబోతోంది. అనుష్క శెట్టి ఉనికి ఈ చిత్రానికి ఇతర భాషల్లోనూ విపరీతమైన క్రేజ్‌ను తీసుకువచ్చింది.

మొత్తానికి ‘కథనార్‌’ ఒక విజువల్ వండర్‌గా, ప్రేక్షకులను ఒక మాయా లోకంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమైంది. అగ్ర తారల నటన, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!