మధురై, ఏప్రియల్ 22 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో మధురై సెంట్రల్ నియోజకవర్గం రాజకీయంగా అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈనెల 24 , గురువారం జరగబోయే ఓటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు సిద్ధమవుతుండగా, క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూటమిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న దర్శకుడు సుందర్ సి విజయం కోసం అన్నీ సిద్ధం చేసుకున్నప్పటికీ ఏర్పాట్లు, చివరి నిమిషంలో వ్యూహరచనలో ఎదురవుతున్న అవరోధాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఓటింగ్‌కు ముందు కూటమిలో అంతర్గత సమరం

ఎన్నికలకు కేవలం గంటల వ్యవధి ఉండటంతో, నియోజకవర్గంలో కూటమి గెలుపుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి పొత్తులో భాగంగా మధురై సెంట్రల్ నియోజకవర్గాన్ని 'పుతియ నీది కచ్చి'కి కేటాయించారు. పుతియ నీది కచ్చి తరపున సినీనటి ఖుష్బూ భర్త, సినిమా దర్శకుడు సుందర్ సి బరిలోకి దిగారు. ఏఐఏడీఎంకే యొక్క 'రెండాకుల' (ఇరట్టై ఇలై) గుర్తుపై సుందర్ సి పోటీ చేస్తున్నారు. భర్త విజయం కోసం నటి ఖుష్బూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ, ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి ఫోన్ చేసి, పార్టీ శ్రేణుల తీరుపై తన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయటం తమిళనాడు రాజకీయాల్లో చర్చనియామ్సంగా మారింది. స్థానిక నేతలు వర్గాలుగా విడిపోయి ప్రచారాన్ని పక్కదారి పట్టించడం ఖుష్బూను కలవరపెడుతోంది. ఒక వర్గం ఇచ్చిన సమయానికి వెళితే, మరొక వర్గం తమకు సహకరించ లేదని ఈ అంతర్గత విభేదాలు పోలింగ్ రోజున డీఎంకేకు అనుకూలంగా మారుతాయేమోనన్న భయం ఆమెను వెంటాడుతోంది.ఇదే విషయాన్ని ఆమె పళనిస్వామి ముందు ఉంచారు. పరిస్థితిని గమనించిన పళనిస్వామి, వెంటనే మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్‌ను రంగంలోకి దించి, ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించడంతో పాటు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

పోలింగ్ వేళ డీఎంకేపై ఖుష్బూ 'రిజర్వేషన్' అస్త్రం

రేపు ఓటరు దేవుళ్లు తీర్పు ఇవ్వనున్న తరుణంలో, డీఎంకే-కాంగ్రెస్ కూటమిని లక్ష్యంగా చేసుకుని ఖుష్బూ తన వాగ్ధాటిని పెంచారు. ముఖ్యంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చి, మహిళా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కేంద్రం మహిళా సాధికారతకు బాటలు వేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటూ మహిళలకు తీరని అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు. "స్టాలిన్, రాహుల్ గాంధీల ద్వంద్వ వైఖరిని తమిళనాడు ప్రజలు రేపటి ఎన్నికల్లో ఓటు రూపంలో బదులిస్తారు" అని ఆమె స్పష్టం చేశారు. ఒకవైపు నియోజకవర్గంలో కూటమిలోని నేతలను సమన్వయం చేసుకుంటూనే, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఖుష్బూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మొత్తానికి, ఎన్నికల ముందు రోజున చోటుచేసుకున్న ఈ పరిణామాలు మధురై సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపోటములను ఎటువైపు తిప్పుతాయో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. రేపటి పోలింగ్ సరళి, కూటమిలోని అంతర్గత సమస్యలు ప్రభావం ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున తేలనుంది.