చార్ ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే కేదార్‌నాథ్-బద్రీనాథ్ మరియు గంగోత్రి ఆలయ కమిటీల మధ్య హిందూయేతరుల ప్రవేశ నిబంధనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బద్రీనాథ్-కేదార్‌నాథ్ కమిటీ (బి కె టి సి) ఈ ఆలయాల్లోకి ప్రవేశించాలనుకునే హిందూయేతరులు ఖచ్చితంగా ఒక అఫిడవిట్ సమర్పించాలని కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది ప్రకటించారు. ఆ అఫిడవిట్‌లో వారు సనాతన ధర్మంపై తమకు నమ్మకం ఉందని ప్రకటించాల్సి ఉంటుంది. అయితే బి కె టి సి నిర్ణయాన్ని గంగోత్రి ఆలయ కమిటీ వ్యక్తిగత అభిప్రాయంగా కొట్టిపారేసింది. గంగోత్రి ధామ్‌లో దర్శనం కోసం ఎలాంటి అఫిడవిట్ అవసరం లేదని కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ స్పష్టం చేశారు. సాధారణంగా ఈ అఫిడవిట్ నిబంధన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు దేవభూమిగా పిలవబడే ఉత్తరాఖండ్ లో కూడా దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని చూడటం, అది కూడా యాత్ర ప్రారంభానికి ముందే ప్రకటించడం వల్ల ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఎవరైనా హిందూయేతరులు 'పంచగవ్యం' స్వీకరిస్తే, శాస్త్రాల ప్రకారం వారు శుద్ధి చేయబడినట్లుగా భావించి, వారిని ఆలయ దర్శనానికి అనుమతించవచ్చని సెమ్వాల్ పేర్కొన్నారు. జైన, సిక్కు మరియు బౌద్ధ మతస్థులను సనాతన సంప్రదాయంలో భాగంగానే చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, గోమాంసం తినే వారి ప్రవేశాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అదే సందర్భంలో రాజ్యాంగ హక్కులు అనుసారంగా ఈ విషయంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు గంగోత్రి కమిటీ తెలిపింది. ఈ కమిటీ భారత రాజ్యాంగంలోని అధికరణలు 25, 26 ప్రకారం పౌరుల మత స్వేచ్ఛకు భంగం కలగకుండా, అదే సమయంలో ఆలయ సంప్రదాయాలు దెబ్బతినకుండా చూస్తుంది.

సవాలుగా మారిన యాత్ర నిర్వహణ:

ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 19 నుండి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. అయితే యాత్రకు ముందే ఆలయ కమిటీల మధ్య తలెత్తిన ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు అటు ప్రభుత్వానికి, ఇటు యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారాయి. మతపరమైన సంప్రదాయాలు, రాజ్యాంగ హక్కుల మధ్య సమతుల్యతను కాపాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

భారతదేశంలోని కొన్ని ప్రముఖ దేవాలయాల్లో హిందూయేతరుల ప్రవేశంపై దశాబ్దాలుగా ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. కేవలం కేదార్‌నాథ్-బద్రీనాథ్ మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రసిద్ధ ఆలయాల్లో కూడా ఈ "అఫిడవిట్" లేదా "డిక్లరేషన్" పద్ధతి ఉంది.

తిరుమల తిరుపతి దేవస్థానం :

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం లో డిక్లరేషన్ విధానం అనేది ముఖ్యంగా హిందూమతేతర భక్తులకు వర్తిస్తుంది. డిక్లరేషన్ అంటే ఒక ప్రకటన, హిందూమతానికి చెందని వారు కూడా స్వామివారిని దర్శించాలనుకుంటే, వారు “నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నాను” అని ఒక ఫారమ్‌లో సంతకం చేయాలి.హిందువులకు ఇది అవసరం లేదు.కాని హిందూమతేతరులు, విదేశీయులు, ఇతర మతాలకు చెందిన భక్తులు డిక్లరేషన్ సాధారణంగా ఆలయం ప్రవేశ ద్వారం దగ్గర లేదా దర్శనం క్యూలోకి వెళ్లే ముందు కౌంటర్ వద్ద దీనికి సంభందించి టి టి డి అధికారులు ఇచ్చే ఫారమ్ పై సంతకం చేయాల్సి ఉంటుంది.ఫారమ్‌లో సాధారణంగా నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నాను, ఆలయ నియమాలు పాటిస్తాను, సంప్రదాయాలను గౌరవిస్తాను అని ఉంటుంది. ఎందుకంటే ఆలయం హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది. భక్తి, ఆచారాలు, పవిత్రతను కాపాడటంతో పాటు ఇతర మతాల వారికి కూడా దర్శనం అవకాశం ఉందని చెబుతూ నమ్మకంతో , గౌరవంతో వస్తున్నారని నిర్ధారించడానికి డిక్లరేషన్ విధానం అమలు చేస్తున్నారు. గతంలో అబ్దుల్ కలాం, సోనియా గాంధీ వంటి ప్రముఖులు కూడా ఇలా డిక్లరేషన్ ఇచ్చే దర్శనం చేసుకున్నారు. అయితే వై సి పి అద్యక్షుడు జగున్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామిని దర్సనం చేసుకుంటున్నారని ప్రస్తుతం అధికారం లో ఉన్న తెలుగు దేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయటం తో పెద్ద దుమారం రేగింది.

గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం :

కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ఆలయం పారంపర్య హిందూ ఆచారాలను కట్టుదిట్టంగా పాటిస్తుంది. హిందువులకు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇతర మతాల వారికి ఆలయంలోకి ప్రవేశం లేదు, తిరుమలలాగా ఎటువంటి డిక్లరేషన్ సిస్టమ్ ఇక్కడ లేదు. ఇక్కడ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఎవరైనా అన్యమతస్థులు దర్శనం చేసుకోవాలంటే, వారు హిందూ మతంలోకి మారినట్లు ధృవీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. డ్రెస్సు కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పురుషులు ధోతి తప్పనిసరి, షర్ట్, టీ-షర్ట్ తొలగించాలి , సాధారణంగా బనియన్ ను కూడా అనుమతించరు. మహిళలు చీర, సల్వార్ కమీజ్ కు అనుమతి ఉంది. జీన్స్, షార్ట్ డ్రెస్సులకు అనుమతి లేదు. చిన్న పిల్లలకు కొంత సడలింపు ఉంటుంది. అలాగే మొబైల్ ఫోన్లు లోపలకి అనుమతించరు. కెమెరాలు , ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు బయట కౌంటర్‌లో డిపాజిట్ చేయాలి. దక్షిణ భారతదేశంలోని చాలా ఆలయాల్లో ముఖ్యంగా కేరళలో 'ఆగమ శాస్త్రం' ప్రకారం ఆచారాలను చాలా కఠినంగా పాటిస్తారు. హిందూయేతరుల ప్రవేశం జరిగితే ఆలయ శక్తి తగ్గుతుందని అక్కడి పూజారులు - తంత్రి నమ్ముతారు. అందుకే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే శుద్ధీకరణ పూజలు చేస్తారు.

పూరీ జగన్నాథ ఆలయం :

భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటి. ఒడిశాలోని ఈ ఆలయంలో కూడా కఠినమైన సంప్రదాయ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ కేవలం 'సనాతన హిందువులకు' మాత్రమే ప్రవేశం ఉంటుంది. బౌద్ధులు, జైనులు కూడా అనుమతించబడతారు, కానీ విదేశీయులు హిందూ మతంలోకి మారినా కూడా లోపలికి వెళ్లడానికి అనుమతి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి.

పద్మనాభస్వామి ఆలయం :

కేరళలోని మరో ప్రముఖ ఆలయం ., ఇక్కడ కూడా హిందూయేతరులు తమ విశ్వాసాన్ని తెలుపుతూ ఫారమ్ నింపాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డ్రెస్ కోడ్ ఖచ్చితంగా పాటించాలి.

దేవాలయ కమిటీలు మరియు ధర్మకర్తలు ఇటువంటి నిబంధనలు పెట్టడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతుంటారు:

1. ఆలయ పవిత్రత : ఆలయం అనేది కేవలం పర్యాటక ప్రాంతం కాదు, అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. కేవలం చూసి వెళ్ళడానికి వచ్చేవారి కంటే, దైవంపై నమ్మకంతో వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీలు భావిస్తాయి.

2. ఆచార వ్యవహారాల రక్షణ: ప్రతి ఆలయానికి కొన్ని 'ఆగమ శాస్త్ర' నియమాలు ఉంటాయి. విగ్రహారాధనపై నమ్మకం లేని వారు లోపలికి రావడం వల్ల ఆ ఆలయ పరిసరాల్లో భక్తుల్లో ప్రశాంత వాతావరణం , పోజిటివ్ వైబ్రేషన్స్ కు భగం కలుగుతుంది. అక్కడి నియమాలు , ఆచారాలు దెబ్బ తింటాయని పూజారులు నమ్ముతారు.

3. భద్రత మరియు క్రమశిక్షణ: చార్ ధామ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో రద్దీని నియంత్రించడానికి మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి భక్తుల వివరాలను సేకరించడం ఒక మార్గంగా చూస్తారు.