కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల రుసుము నియమాలు-2026ను సవరించింది. ఓవర్‌లోడింగ్ వాహనాలపై 4 రెట్ల వరకు అదనపు టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు, వాహన్ పోర్టల్‌లో నమోదు వంటి పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి.
విజయవాడ , ఏప్రియల్ 14 : దేశవ్యాప్త రవాణా వ్యవస్థలో కీలకమైన జాతీయ రహదారుల నిర్వహణ, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వాహనాలు పరిమితికి మించి భారంతో (ఓవర్‌లోడింగ్) ప్రయాణిస్తూ రహదారులను ధ్వంసం చేయడమే కాకుండా, ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 'నేషనల్ హైవేస్ ఫీ (రేట్ల నిర్ధారణ మరియు వసూలు) నాల్గవ సవరణ నియమాలు, 2026' పేరుతో తెచ్చిన ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఓవర్‌లోడింగ్ రుసుములను హేతుబద్ధీకరించింది. ఏప్రిల్ 15, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
జాతీయ రహదారుల మన్నికను పెంచడంతో పాటు ప్రయాణికుల భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ సవరణలు చేపట్టారు. సాధారణంగా అనుమతించిన దానికంటే ఎక్కువ బరువుతో ప్రయాణించే వాహనాల వల్ల రహదారుల పైపొర త్వరగా దెబ్బతినడమే కాకుండా, వంతెనల పటుత్వం కూడా తగ్గుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు ‘సైంటిఫిక్ వెయిట్ మెజర్మెంట్’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పాత పద్ధతులకు భిన్నంగా, టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన సర్టిఫైడ్ వెయింగ్ మెషీన్ల ద్వారా మాత్రమే వాహనాల బరువును నిర్ధారిస్తారు. ఒకవేళ ఏ టోల్ ప్లాజా వద్దనైనా బరువు కొలిచే పరికరాలు అందుబాటులో లేకపోతే, సదరు వాహనంపై ఎటువంటి ఓవర్‌లోడ్ రుసుము విధించకూడదని నిబంధనల్లో స్పష్టం చేయడం గమనార్హం. ఇది వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
భారం పెరిగితే బాదుడే.. సవరించిన రుసుముల వివరాలు
కొత్త నిబంధనల ప్రకారం ఓవర్‌లోడింగ్ శాతాన్ని బట్టి జరిమానా తరహాలో అదనపు రుసుమును వసూలు చేస్తారు. వాహనానికి అనుమతించిన స్థూల బరువు (GVW) కంటే 10 శాతం వరకు అదనపు బరువు ఉంటే, ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది చిన్నపాటి హెచ్చుతగ్గులకు మినహాయింపునిస్తూ రవాణాదారులకు ఇచ్చిన వెసులుబాటు. అయితే, 10 శాతం నుంచి 40 శాతం వరకు అదనపు బరువు ఉంటే, సాధారణ టోల్ రుసుము కంటే రెండు రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఇక బరువు 40 శాతానికి మించితే, ఏకంగా నాలుగు రెట్ల రుసుమును వసూలు చేస్తారు. ఈ భారీ పెంపు ద్వారా ఓవర్‌లోడింగ్‌ను ఆర్థికంగా భారంగా మార్చి, రవాణాదారులు నిబంధనలు పాటించేలా ఒత్తిడి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశ్యం.
నగదు రహిత చెల్లింపులు.. పారదర్శక పర్యవేక్షణ
ఈ నూతన వ్యవస్థలో అవినీతికి తావులేకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపింది. ఓవర్‌లోడింగ్ రుసుములను కేవలం ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేయాలని ఆదేశించింది. దీనివల్ల ప్రతి పైసా రికార్డు కావడమే కాకుండా, అధికారుల ప్రమేయం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, నిబంధనలు ఉల్లంఘించి ఓవర్‌లోడ్‌తో పట్టుబడిన వాహనాల వివరాలను నేరుగా జాతీయ వాహన రిజిస్టర్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. దీనివల్ల సదరు వాహన యజమాని చరిత్రలో ఆ ఉల్లంఘన శాశ్వతంగా ఉండిపోతుంది, ఇది భవిష్యత్తులో వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు , పర్మిట్ల జారీ సమయంలో కీలకం కానుంది.
మౌలిక సదుపాయాల రక్షణే ధ్యేయం
దేశ ఆర్థిక వ్యవస్థకు జాతీయ రహదారులు వెన్నెముక వంటివి. వందల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ఈ రహదారులు ఓవర్‌లోడింగ్ కారణంగా నిర్దేశిత కాలం కంటే ముందే పాడవుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ‘వే-ఇన్-మోషన్’ (WIM) టెక్నాలజీ ద్వారా వాహనం వేగంగా వెళ్తున్నప్పుడే బరువును లెక్కించే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తోంది. అయితే, ప్రైవేటు పెట్టుబడులతో పి పి పి విధానంలో గతంలోనే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. సదరు కన్సెషనీర్లు అంగీకరిస్తేనే అక్కడ కొత్త నిబంధనలు అమలవుతాయి. మొత్తానికి, మోర్త్ (MoRTH) తెచ్చిన ఈ మార్పులు రవాణా రంగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలను తగ్గించి, రహదారుల ఆయుష్షును పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రవాణాదారులు తమ వాహనాల బరువుపై స్వయంగా నియంత్రణ పాటించడం ద్వారా ఈ అదనపు భారం నుంచి తప్పించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.