"మహిళల రాజకీయ ప్రస్థానంపై బీహార్ ఎంపీ పప్పూ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మహిళా కమిషన్ నోటీసులు, అనంత్ సింగ్ విమర్శలు మరియు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో పప్పూ యాదవ్ చుట్టూ ముదురుతున్న వివాదంపై పూర్తి కథనం ఇక్కడ చదవండి."
హైదరాబాద్ , ఏప్రియల్ 23 : బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం పూర్ణియా స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మహిళల రాజకీయ ఎదుగుదల, వారి వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పప్పూ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజకీయాల్లో మహిళల ప్రవేశం - పప్పు యాదవ్
బిహార్‌లోని పూర్ణియా లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పప్పూ యాదవ్, ఇటీవల ఒక ఫేస్‌బుక్ లైవ్ వేదికగా మహిళల రాజకీయ ప్రస్థానంపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలు తీవ్రమైన వేధింపులకు, దోపిడీకి గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, "రాజకీయాల్లో చురుగ్గా ఉండాలనుకునే మహిళలు ఎవరో ఒక నేతతో పడక గదిని పంచుకోవాల్సి వస్తోంది" అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. కేవలం రాజకీయాలే కాకుండా విద్యా సంస్థలు, కార్పొరేట్ రంగాలు, చివరకు పోలీస్ వ్యవస్థలోనూ మహిళలపై కన్నేసి ఉంచారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పాట్నాలోని హాస్టల్ అమ్మాయిలను రాజకీయ నాయకులకు 'వడ్డిస్తున్నారు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
పప్పు యాదవ్‌కు మహిళా కమిషన్ నోటీసులు
పప్పూ యాదవ్ వ్యాఖ్యలను బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై వివరణ కోరుతూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, సమాజంలో వారి ప్రతిష్టను మంటగలిపేలా ఎంపీ మాట్లాడటం క్షమించరాని నేరమని కమిషన్ అధ్యక్షురాలు అప్సరా మిశ్రా స్పష్టం చేశారు. స్వయంగా ఎంపీ కుటుంబంలోనే మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత అభ్యంతరకరమని ఆమె మండిపడ్డారు. కమిషన్ కోరిన వివరణకు పప్పూ యాదవ్ నుండి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే, ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ఓం బిర్లాకు సిఫారసు చేస్తామని ఆమె హెచ్చరించారు.
పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళా కమిషన్ నోటీసులపై పప్పూ యాదవ్ ఏమాత్రం తగ్గకుండా మరింత ఘాటుగా స్పందించారు. అటువంటి నోటీసులను తాను 'చెత్తబుట్టలో వేస్తానని' తెగేసి చెప్పారు. దేశంలోని 70 నుండి 80 శాతం మంది రాజకీయ నాయకులు పోర్నోగ్రఫీ చూస్తారని, తన ఫోన్‌తో సహా అందరి మొబైల్ ఫోన్లను తనిఖీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను మహిళల పక్షాన పోరాడుతున్నానని చెప్పుకుంటూనే, మహిళా కమిషన్ సభ్యురాలు సజల్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా 755 మంది నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయని, అందులో 155 మందిపై చార్జ్‌షీట్లు కూడా దాఖలయ్యాయని ఆయన గణంకాలతో సహా విరుచుకుపడ్డారు. నాయకులు మహిళలను దోపిడీ చేస్తూనే మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడటం ద్వంద్వ నీతి అని ఆయన విమర్శించారు.
మహిళా రాజకీయ నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు
చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోయిన తరుణంలో పప్పూ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలమవడంతో ఈ బిల్లు ఆగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో మహిళల రాజకీయ జీవితాలు 'మగాళ్ల పడక గదిలోనే మొదలవుతాయి' అని ఎంపీ అనడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ వ్యాఖ్యలను ఆయనకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, జెడియూ నేతలు తీవ్రంగా ఖండించారు. మోకామా నియోజకవర్గ జెడియూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ సైతం పప్పూ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఇతరుల గురించి మాట్లాడే ముందు తన గతాన్ని ఒకసారి చూసుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం ఈ వివాదం బిహార్ రాజకీయాల్లో పప్పూ యాదవ్‌ను ఏకాకిని చేయడమే కాకుండా, ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
పప్పుయాదవ్ తాజాగా ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలకు సంభందిన లింక్ కోసం క్లిక్ చేయండి: