భారతదేశ రాజకీయాల్లో కీలక మార్పులకు వేదికగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఇప్పటికే 8,931 రోజులు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాలు దేశ రాజకీయ దిశనే ప్రభావితం చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మోదీ భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. ప్రజల్ని ఆకట్టుకునేలా ప్రవర్తించడం, వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడం, భావోద్వేగాలతో కనెక్ట్ అవ్వడం వంటి అంశాలు ఆయనలోని అదనపు ఆకర్షణకు కారణంగా చెప్పవచ్చు.
నరేంద్ర మోడీపేరిట ఉన్న ప్రధాన రికార్డులు:
నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైన మూడవ నాయకుడు మోదీ. అలాగే, కాంగ్రెసేతర ప్రధానులలో అత్యధిక కాలం పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. గుజరాత్ సీఎంగా 2001 నుండి 2014 వరకు సుమారు 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న రికార్డును కలిగి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ సాధించి పెట్టడమే కాకుండా, 2024లో మిత్రపక్షాలతో కలిసి యెన్ డి ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భూటాన్, ఫ్రాన్స్, యూఏఈ వంటి అనేక దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న ఏకైక భారత ప్రధానిగా మోడీ ఖ్యాతి గడించారు.
భారతదేశంలో ఆయన వారసులుగా ఎవరున్నారు?
మోదీ తర్వాత బిజెపిలో లేదా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోయే నాయకుల జాబితాలో ప్రధానంగా వినిపించే పేర్లలో మొదటి పేరు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. పార్టీలో మోదీకి అత్యంత సన్నిహితుడు మరియు వ్యూహకర్త. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు సాటిలేరనే పేరుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రస్తావిస్తే హిందుత్వ వాదం, కఠినమైన పాలనతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభివృద్ధి పనుల విషయంలో ముఖ్యంగా రోడ్లు, హైవేల నిర్మాణంలో పార్టీలకతీతంగా ప్రశంసలు అందుకుంటున్న నాయకుడు. మధ్యప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం దాదాపు 17 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు, క్షేత్రస్థాయిలో ప్రజలతో, ముఖ్యంగా మహిళలు మరియు రైతులతో బలమైన అనుబంధం ఉంది. అందుకే ఆయనను అందరూ ప్రేమగా 'మామాజీ' అని పిలుచుకుంటారు.బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఆయనకు పార్టీ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర ఉంది.
ప్రపంచ నాయకుల పరిస్థితి - మోదీ ఎక్కడ ఉన్నారు?
ప్రపంచ వేదికపై మోదీ స్థానం ప్రస్తుతం అత్యున్నతంగా ఉంది.'మార్నింగ్ కన్సల్ట్' వంటి అంతర్జాతీయ సర్వేల ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులలో మోదీ వరుసగా మొదటి స్థానంలో నిలుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన జనవరి 20, 2025న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా నరేంద్ర మోదీకి "అప్రూవల్ రేటింగ్" ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందిన నాయకుల్లో మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
అదేవిధంగా బ్రిటన్ రాజకీయాల్లో గత రెండేళ్లుగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్‌లో ఇప్పుడు కియర్ స్టార్మర్ ప్రధానిగా ఉన్నారు. 2024 జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించడంతో రిషి సునక్ పదవి నుంచి తప్పుకున్నారు. స్టార్మర్ ప్రభుత్వం ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఆరోగ్య వ్యవస్థ , సంస్కరణలు మరియు వలసదారుల సమస్యలపై దృష్టి పెట్టింది.
చైనాలో అధికారం షీ జిన్‌పింగ్ చేతిలోనే ఉన్నప్పటికీ, అంతర్గతంగా మరియు అంతర్జాతీయంగా పరిస్థితులు మారాయి. షీ జిన్‌పింగ్ చైనాలో తిరుగులేని నాయకుడిగా మూడవసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, చైనా ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే నెమ్మదించింది. రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలు ఆ దేశాన్ని వేధిస్తున్నాయి. భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ, విశ్వసనీయత లోటు ఇంకా ఉంది. గ్లోబల్ సప్లై చైన్ విషయంలో భారత్ ఇప్పుడు చైనాకు గట్టి పోటీనిస్తోంది. అంతర్జాతీయంగా తైవాన్ అంశం మరియు అమెరికా తో ఉన్న వాణిజ్య యుద్ధం కారణంగా చైనా రక్షణ రంగంపై ఎక్కువ ఖర్చు చేస్తోంది.
గ్లోబల్ సౌత్ నాయకుడిగా:
అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా మోదీ ఇప్పుడు ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నారు. G20 సదస్సు నిర్వహణతో భారత్ యొక్క దౌత్య శక్తి మరింత పెరిగింది. మొత్తం మీద, మోదీ ఒక వైపు అభివృద్ధిని, మరోవైపు రాజకీయ వ్యూహాలను సమతూకం చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన తర్వాత వారసత్వం కోసం బలమైన నాయకులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి మోదీ ఇమేజ్ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉంది.




