లక్నో, ఏప్రియల్ 18: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పౌరసత్వ సెగ తగిలింది. గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఆయన 'ద్వంద్వ పౌరసత్వ' వ్యవహారం ఇప్పుడు న్యాయపరంగా కీలక మలుపు తిరిగింది. రాహుల్ గాంధీపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, లోతైన విచారణ చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని నిరాకరిస్తున్న నేపథ్యంలో, ఈ పరిణామం అటు కాంగ్రెస్ పార్టీలోనూ, ఇటు దేశవ్యాప్త రాజకీయాల్లోనూ పెను సంచలనాన్ని సృష్టించింది.

కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త, బిజెపి నేత ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాయబరేలీ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ, భారత పౌరసత్వంతో పాటు బ్రిటన్ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నారని, ఇది భారతీయ చట్టాలను మరియు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రాయబరేలీలోని ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఈ ఫిర్యాదును సాంకేతిక కారణాలతో కొట్టివేయగా, శిశిర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణ జరిపిన ధర్మాసనం, ప్రాథమికంగా ఆరోపణల్లో తీవ్రత ఉందని భావించి, రాయబరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది.

విచారణ ఏజెన్సీపై స్పష్టత

రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలు కేవలం పౌరసత్వానికే పరిమితం కాకుండా, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడి ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఈ కేసు దర్యాప్తును కేవలం స్థానిక పోలీసులకే పరిమితం చేయకుండా, అవసరమైతే ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిపించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. భారతీయ న్యాయ సంహిత , విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం మరియు ప్రభుత్వ గోప్యతా చట్టం కింద రాహుల్ గాంధీపై వచ్చిన అభియోగాలను నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపై ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

పిటిషనర్ వాదనలు - రాజకీయ పరిణామాలు

ఈ వివాదంలో పిటిషనర్ విఘ్నేష్ శిశిర్ సమర్పించిన ఆధారాలు కీలకంగా మారాయి. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడిగా నమోదైనట్లు తెలిపే పత్రాలు మరియు బ్రిటిష్ ప్రభుత్వం నుండి వచ్చిన కొన్ని 'రహస్య ఇమెయిల్‌లు' తన వద్ద ఉన్నాయని ఆయన వాదించారు. ఈ తీర్పు వెలువడిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇది ఒక మైలురాయి లాంటి తీర్పు అని, జాతీయ భద్రత దృష్ట్యా నిజం బయటకు రావడం అత్యవసరమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఈ కేసు తీవ్రత దృష్ట్యా తనకు దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయి భద్రతను (CRPF) కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం, ఏ భారతీయ పౌరుడైనా స్వచ్ఛందంగా మరో దేశ పౌరసత్వాన్ని పొందితే, అతని భారత పౌరసత్వం రద్దవుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని రుజువైతే, ఆయన ఎంపీ పదవితో పాటు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు కేసులతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీపై ఈ తరహా ఆదేశాలు రావడం పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.