రజనీకాంత్ వివాదం పై విజయ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అంటే తమిళనాట అవుననే సమాధానం వినిపిస్తుంది. అగ్గి రాజుకుంటే అది కారుచిచ్చు కాకముందే అర్పాలి కాని దానితో చలి కాచుకుంటూ కూర్చుంటే ఆమంటల సెగ తగలక తప్పదు. తమిళగ వెట్రి కజగం – టి వి కె పార్టీకి చెందిన నాయకుడు ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యల రజనికాంత్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. అలాగే ఆ వ్యాఖ్యలపై నటుడు, నూతన రాజకీయ నాయకుడు విజయ్ మౌనం పాటించడం ఇపుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే మదురైలో రజనీ అభిమానులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఆదవ్ అర్జునకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. "యుద్ధ క్షేత్రంలో కలుద్దాం" వంటి హెచ్చరికలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక గతంలో కూడా రజనీ సినిమా రిలీజ్ సమయంలో విజయ్ అభిమానులు నెగటివ్ ప్రచారం చేశారన్న ఆరోపణలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దీంతో తమిళనాడు లో విజయ్ వర్సెస్ రజని ఫ్యాన్ వార్ నడుస్తుంది. వివాదాలకు దూరంగా ఉండే రజనికాంత్ ప్రకటన విడుదల చేయటం ద్వారా ఆయన ఆయన సైతం విషయాన్ని తేలికగా తీసుకోలేదని చెప్పకనే చెప్పినట్లు అయింది. మరో వైపు ఈ వివాదం వెంటనే రాజకీయ రంగు పులుముకుంది. బి జె పి కి చెందిననైనార్ నాగేంద్రన్ "రజనీకాంత్ వంటి మహానుభావుడిని విమర్శించడం తగదు"., "విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? క్షమాపణ చెప్పాలి" అని డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ "అనుభవం లేని వ్యక్తి రజనీ గురించి మాట్లాడటం ఆమోదయోగ్యం కాదు" అని కామెంట్ చేయగా , తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ "రజనీకాంత్ దేశానికి గర్వకారణం… ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు తిరస్కరిస్తారు" అంటూ తీవ్రంగా స్పందించారు. అలాగే ఎడప్పాడి పళనిస్వామి, ఓ. పన్నీర్ సెల్వం వంటి నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు.
ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు :
చెన్నైలో జరిగిన టి వి కె నిరసన కార్యక్రమం ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఇందులో ఆదవ్ అర్జున మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి డీఎంకే నేతల బెదిరింపులే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన రెడ్ జెయింట్ మూవీస్‌తో సినిమాలు చేస్తూ ఉన్నారని, తమ నాయకుడు విజయ్ మాత్రం ఎలాంటి ఒత్తిడులకు లొంగరని కామెంట్స్ చేసారు. ఈ వ్యాఖ్యలు రజనీ అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేశాయి.
రజనీకాంత్ కౌంటర్: "కాలమే సమాధానం చెబుతుంది"
ఈ వ్యాఖ్యలపై స్పందించిన రజనీకాంత్, పరోక్షంగా ఘాటైన హెచ్చరిక చేశారు. తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. "కాలం మాట్లాడదు… కాలమే సమాధానం చెబుతుంది" అని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇది రాజకీయంగా కూడా గంభీర సంకేతంగా భావిస్తున్నారు విశ్లేషకులు.
విజయ్ మౌనం ఎందుకు?
సినిమా హీరోలు లోపల ఏమి ఉన్నా పైకి మాత్రం తామంతా ఒక్కటే అనే సంకేతాన్ని వ్యక్తం చేస్తుంటారు. సిని రంగం నుంచి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి , పార్టీ పెట్టి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేయబోతున్న టి వి కే పార్టి అద్యక్షుడు అత్యంత ప్రేక్షకాదరణ , ప్రజాభిమానం ఉన్న హీరో రజనీకాంత్ విషయంలో మౌనం పాటిస్తుండటం ఇపుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తమిళ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం విజయ్ ఫ్యాన్స్ బ్యాలెన్స్ స్ట్రాటజీ ని పాటిస్తున్నారని చెబుతున్నారు. రజనీ అభిమానులు మరియు విజయ్ అభిమానులు రెండు భారీ వర్గాలు. వీరిలో ఎవరినీ దూరం చేసుకోకుండా ఉండటానికి విజయ్ మౌనం పాటిస్తున్నారని భావిస్తున్నారు. మరో వైపు రాబోయే 2026 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రజనీ అభిమానుల మద్దతు కోల్పోకూడదనే ఆలోచన కూడా ఆయనలో ఉందనే వాడన్ వినిపిస్తుంది. ఫైనల్ గా పార్టీ లో అంతర్గత విషయంగా వివాదానికి చూస్తున్నారని చెబుతున్నారు.
తమిళనాడులో సినిమా – రాజకీయాల మధ్య సంబంధం ఇంకా బలంగా ఉంది. రజనీకాంత్ ప్రభావం ఇప్పటికీ అక్కడ రాజకీయంగా కీలకం. ఆయన ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టినా, తనపై వచ్చే రాజకీయ విమర్శలను తేలికగా తీసుకోవడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు విజయ్ రాజకీయ ప్రయాణం ప్రతి అంశాన్ని సున్నితంగా రజని గమనిస్తున్నారనే మాట చెక్కర్లు కొడుతుంది. ఇదే సందర్భంలో రాజకీయనేతలు ప్రసంగించేటపుడు నోరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఇక దీనిపై ఎపుడు ఎలా ఎక్కడ స్పందిస్తారనే విషయం ఆసక్తిని రేపుతుంది.




