హైదరాబాద్, మే1 : ప్రపంచ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన, ఆకర్షణీయమైన 'కోహినూర్' వజ్రం అంశం మరోసారి అంతర్జాతీయ దౌత్య ముఖచిత్రంపై సంచలనంగా మారింది. దశాబ్దాలుగా భారత్ చేస్తున్న డిమాండ్‌కు ఇప్పుడు అనూహ్యంగా అమెరికా గడ్డపై నుంచి మద్దతు లభించడం తో ఈ విషయం పై మరోసారి చర్చకు తెరలేచింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III అమెరికా పర్యటనలో ఉండగా, భారతీయ మూలాలున్న న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని (Zohran Mamdani) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దాదాపు 105.6 క్యారెట్ల బరువున్న ఈ అమూల్య రత్నాన్ని తిరిగి దాని జన్మస్థానమైన భారత్‌కు అప్పగించాలని ఆయన చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యతను సంతరించుకుంది.

చరిత్ర పుటల్లో కోహినూర్ ప్రస్థానం: కాకతీయుల గనుల నుండి బ్రిటన్ కిరీటం వరకు

కోహినూర్ అంటే పర్షియన్ భాషలో ‘కాంతి పర్వతం’ అని అర్థం. ఈ వజ్రం కేవలం ఒక అలంకార వస్తువు మాత్రమే కాదు, అది రాజ్యాల ఉత్థాన పతనాలకు సాక్ష్యంగా నిలిచిన ఒక చారిత్రక చిహ్నం. చరిత్రకారుల కథనం ప్రకారం, 13వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరు గనులలో ఈ అరుదైన వజ్రం లభించింది. అప్పట్లో వరంగల్ భద్రకాళి అమ్మవారి కన్నుగా వెలిగిన ఈ రత్నం, కాలక్రమేణా మాలిక్ కాఫుర్ దాడితో ఢిల్లీ సుల్తానుల చేతికి చిక్కింది. అక్కడి నుండి మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన నెమలి సింహాసనంలో అంతర్భాగమైంది. 1739లో నాదిర్ షా దండయాత్రతో పర్షియాకు, ఆపై ఆఫ్ఘనిస్తాన్ పాలకుల వద్దకు చేరి, చివరకు 1813లో మహారాజా రంజిత్ సింగ్ ద్వారా తిరిగి సిక్కు సామ్రాజ్యానికి, అంటే భారత గడ్డపైకి వచ్చింది. అయితే, 1849లో రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం అనంతరం, కేవలం పదేళ్ల వయసున్న మహారాజా దులీప్ సింగ్ నుండి ‘లాహోర్ ఒప్పందం’ పేరుతో బ్రిటీష్ వారు దీన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి ఈ వజ్రం బ్రిటన్ రాజకుటుంబం వద్దే ఉంటూ, నేడు లండన్ టవర్‌లో పర్యాటకుల ఆకర్షణగా నిలుస్తోంది.

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని వ్యాఖ్యల వెనుక దౌత్య వ్యూహం

బ్రిటన్ రాజు చార్లెస్-III మరియు రాణి కెమిల్లా న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శిస్తున్న తరుణంలో, మేయర్ మమ్దాని తన గళాన్ని వినిపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, రాజుతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా కోహినూర్ భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని కోరతానని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఇది కేవలం ఒక విజ్ఞప్తి మాత్రమే కాదు, వలస పాలనలో దోపిడీకి గురైన దేశాల ఆత్మగౌరవ ప్రతీకగా ఆయన దీన్ని అభివర్ణించారు. ఈ పరిణామంపై అటు బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి. రాజు పర్యటనలో ఇలాంటి రాజకీయ లేదా దౌత్యపరమైన అంశాలపై స్పందించడం తమ ఆనవాయితీ కాదని వారు దాటవేస్తున్నప్పటికీ, అంతర్జాతీయ వేదికపై ఈ అంశం ప్రస్తావనకు రావడం భారత్‌కు నైతిక విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుత దౌత్య పరిస్థితి: 'షేర్డ్ యాక్సెస్' ప్రతిపాదనలు

భారత ప్రభుత్వం ఈ విషయంలో తన ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తుంది. కేవలం కోహినూర్ మాత్రమే కాకుండా, బ్రిటీష్ కాలంలో తరలిపోయిన అనేక కళాఖండాలను తిరిగి తెచ్చేందుకు నిరంతరం దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే, బ్రిటన్ మాత్రం 'లాహోర్ ఒప్పందాన్ని' సాకుగా చూపుతూ ఆ వజ్రం తమకు చట్టబద్ధంగా దక్కిందని వాదిస్తోంది. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి 2025లో 'షేర్డ్ యాక్సెస్' (Shared Access) అనే కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని ప్రకారం, వజ్రంపై యాజమాన్య హక్కులను మార్చకుండానే, ఉమ్మడి సాంస్కృతిక ప్రదర్శనల కింద భారత్‌లో దీనిని ప్రదర్శనకు ఉంచడం లేదా నిర్ణీత కాలం పాటు భారత్‌కు పంపడం వంటి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇది శాశ్వత పరిష్కారం కాకపోయినప్పటికీ, దశాబ్దాల స్తబ్దతలో ఒక కదలికగా పరిగణించవచ్చు.

న్యాయపరమైన చిక్కులు మరియు అంతర్జాతీయ ఒత్తిడి

వజ్రాన్ని తిరిగి తీసుకురావడంలో ప్రధానంగా బ్రిటీష్ మ్యూజియం చట్టం (1963) ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. ఈ చట్టం ప్రకారం మ్యూజియంలోని వస్తువులను ఇతర దేశాలకు శాశ్వతంగా ఇచ్చే అధికారం అక్కడి అధికారులకు లేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే బ్రిటన్ పార్లమెంట్ ప్రత్యేకంగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. మరోవైపు, 1970 నాటి యునెస్కో ఒప్పందం కూడా కేవలం ఆ సంవత్సరం తర్వాత తరలిపోయిన వస్తువులకే వర్తిస్తుంది, అంతకుముందు జరిగిన వాటిపై స్పష్టత లేదు. అయితే, ప్రస్తుతం గ్రీస్, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా తమ చారిత్రక సంపద కోసం బ్రిటన్‌పై ఒత్తిడి పెంచుతుండటం ప్రస్తుతం భారత్‌కు కలిసివచ్చే అంశం. ఏది ఏమైనా, 105.6 క్యారెట్ల ఈ వజ్రం కేవలం ఒక రాయి కాదు, అది కోట్ల మంది భారతీయుల భావోద్వేగం. న్యూయార్క్ మేయర్ చేసిన ఈ తాజా విజ్ఞప్తి, భవిష్యత్తులో కోహినూర్ మళ్ళీ భారత్ రావాలని కోరుకుంటున్న కోట్లాది మండి ప్రజల ఆశకు జీవం పోసింది.