అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తికావడమే ఒక అద్భుతమైతే, ఆ ఆలయ శిఖరాగ్రాన రెపరెపలాడే 'ధర్మ ధ్వజం' వెనుక ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. అసలు ఆ ధ్వజాన్ని ఎప్పుడు మారుస్తారో మీకు తెలుసా? ఆకాశాన్ని తాకే ఆ శిఖరంపై జెండాను మార్చడం వెనుక ఉన్న సాహసం ఏమిటి? ప్రధాని మోదీ ఆవిష్కరించిన ఈ ధ్వజం ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం.

ఏడాదికి రెండుసార్లు ధ్వజ మార్పిడి: ఒక నూతన సంప్రదాయం

రామమందిర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. హిందూ నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ ధ్వజాన్ని తొలిసారిగా మార్చారు. ఇకపై ప్రతి ఏటా చైత్ర నవరాత్రులు, శారదీయ నవరాత్రుల ప్రారంభంలో, అంటే ఏడాదికి రెండుసార్లు ఈ 'ధర్మ ధ్వజాన్ని' మార్చాలనిశ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఈప్రక్రియ కేవలం జెండా మార్పిడి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తిని పునరుద్ధరించడానికి, విశ్వాసం యొక్క కొనసాగింపుకు ఇది ఒక చిహ్నం.

ఆర్మీ సిబ్బంది సాహసం.. భద్రతే ప్రాణం!

161 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ శిఖరాన్ని అధిరోహించి జెండాను మార్చడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఈ బాధ్యతను భారత సైన్యానికి చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందికి అప్పగించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, అత్యంత ఖచ్చితత్వంతో, ఆలయ కట్టడానికి చిన్నపాటి నష్టం కూడా వాటిల్లకుండా ఆర్మీ జవాన్లు ఈ 'ఆపరేషన్ ధ్వజం'ను విజయవంతంగా పూర్తి చేశారు.

సాంకేతికతతో కూడిన 'హైటెక్' ధ్వజం

ప్రధాని మోదీ నవంబర్ 2025లో ఆవిష్కరించిన ఈ ధ్వజం వెనుక అద్భుతమైన ఇంజనీరింగ్ ఉంది. గాలివేగాన్ని తట్టుకునేలా ఈ ధ్వజస్తంభాన్ని 360 డిగ్రీలు తిరిగేలా అమర్చారు. దీనివల్ల గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులనైనా ఇది సునాయాసంగా తట్టుకోగలదు. దీనికోసం ప్రత్యేక వస్త్రం వినియోగించారు. ఎండకు రంగు వెలవకుండా, వర్షానికి తడవకుండా ఉండేలా పారాచూట్ ఫాబ్రిక్ వాడి పట్టు దారాలతో దీనిని తయారు చేశారు. మొదట 11 కిలోల బరువున్న ఈ ధ్వజాన్ని, సైనిక నిపుణుల సూచన మేరకు 4 కిలోలకు తగ్గించారు.

ధ్వజంపై ఉన్న గుర్తుల అర్థం తెలుసా?

ఈ పతాకంపై కేవలం రంగు మాత్రమే కాదు, రాముడి వంశానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయి. ధ్వజంపై సూర్యుడు, పవిత్ర 'ఓం'కారం, 'కోవిదార' వృక్షం చిత్రాలు ఉన్నాయి. ఇవి రాముని తేజస్సును, ధర్మాన్ని మరియు ప్రాచీన ఇక్ష్వాకు వంశ వైభవాన్ని చాటిచెబుతాయి.

భక్తులకు ఇకపై రాజ దర్శనం!

కేవలం ధ్వజం మాత్రమే కాదు 2026 మార్చి 19 నుండి భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. . ఆలయం చుట్టూ ఉండే ప్రహరీ మార్గం తెరవడం వల్ల భక్తులు సముదాయంలోని సప్త మందిరాలను , వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి మాత వంటి ఉప-ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. అలాగే మొదటి అంతస్తులో కొలువైన రామ్ దర్బార్‌ను దర్శించుకోవడానికి త్వరలో ప్రత్యేక క్యూ లైన్ల ను ఏర్పాటు చేస్తున్నారు.

అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కావడమనేది కేవలం ఒక భవన నిర్మాణం కాదు; అది భారతదేశ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక. ఇప్పుడు ఆకాశమంత ఎత్తున ఎగిరే ధర్మ ధ్వజం, రాబోయే తరాలకు మన ధర్మ గమ్యాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది.