తమిళనాడు రాజకీయాల్లో ఆయనొక అన్-స్టాపబుల్ ఎంటర్టైనర్. సీరియస్ పాలిటిక్స్‌లోనూ సెటైర్ల తూటాలు పేల్చాలన్నా.. 'థర్మాకోల్'వంటి ప్రయోగాలతో సోషల్ మీడియాను షేక్ చేయాలన్నా అది ఒక్క సెల్లూరు రాజు గారికే సాధ్యం. ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల వేడిలో, తన సొంత గడ్డ మధురై వెస్ట్ నుంచి నాలుగోసారి విజయకేతనం ఎగురవేయాలని చూస్తున్న ఆయన, తాజాగా మధురై వేదికగా జరిగిన ఎన్డీయే సభలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు పెను సంచలనమే సృష్టిస్తోంది.

సభలో అందరూ రాజకీయ లెక్కల గురించి మాట్లాడుతుంటే, సెల్లూరు రాజు మాత్రం రూటు మార్చారు. వేదికపై ఉన్న స్టార్ దంపతులు సుందర్ సి - ఖుష్బూలను చూడగానే ఆయనలోని కవిత్వం పడగవిప్పింది. "ఈ జంటను చూస్తుంటే నాకు మనుషులు కనిపించడం లేదు.. సాక్షాత్తు ఆ మధురైని ఏలే మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుడు దిగివచ్చినట్లు ఉంది. ఖుష్బూ గారు ఇక్కడ కేవలం నాయకురాలు కాదు, తమిళ తంబిలు గుడి కట్టి కొలిచిన దేవత. ఇక సుందర్ సి పేరులోనే శివుడున్నాడు.. ఆ పౌరుషం ఆయన రూపంలో కనిపిస్తోంది!" అంటూ ఆయన వేసిన ఆధ్యాత్మిక పోలికలు సభను ఒక్కసారిగా భక్తి-రాజకీయ పారవశ్యంలో ముంచెత్తాయి.

అయితే, అసలు సిసలు డ్రామా మొదలైంది. రజనీకాంత్ ప్రస్తావన వచ్చినప్పుడే. ప్రసంగం పీక్స్‌లో ఉన్నప్పుడు సెల్లూరు రాజు విసిరిన బాంబు లాంటి డైలాగ్ కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. "రజనీకాంత్‌ను పెట్టి సినిమాలు తీసి, ఆయనను నేటికీ సూపర్ స్టార్‌గా నిలబెట్టింది మా మధురై బిడ్డ సుందర్ సి గారే" అనటం తో రజని అభిమానులు రగిలిపోతున్నారు. 1997లో రజనీకాంత్ - సుందర్ సి కాంబినేషన్‌లో వచ్చిన 'అరుణాచలం' బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాట నిజమే కానీ, అంతకు ముందే 'బాషా'తో రజనీ గ్లోబల్ డాన్ అయిపోయారు. సుందర్ సి ని ఆకాశానికెత్తే క్రమంలో 'సూపర్ స్టార్' ఇమేజ్‌ను కూడా ఆయన ఖాతాలో వేసేయడం సెల్లూరు రాజు గారికే చెల్లిందని నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. "మరీ ఇంత అతిశయోక్తా రాజు గారూ?" అంటూ రజనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

సెల్లూరు రాజు ఊరికే ఏదీ మాట్లాడరు. సుందర్ సిని "మధురై మట్టి బిడ్డ" అని పదే పదే నొక్కి చెప్పడం వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ముఖ్యంగా ప్రాంతీయ సెంటిమెంట్ ఆయన రేపారని భావిస్తున్నారు. మధురై పౌరుషం, కష్టం సుందర్ సిలో ఉన్నాయని చెప్పడం ద్వారా లోకల్ ఓటర్ల కనెక్టివిటీని పెంచడం అదే సమయంలో మధురై వాళ్ళు ప్రేమను మాత్రమే కోరుకుంటారు, లాభాన్ని కాదు అని చెప్పి సుందర్ సి ఇమేజ్‌ను రాజకీయంగా వాడుకోవడం అయన మాటల వెనుక వ్యూహంగా చెబుతున్నారు.

ఒకప్పుడు 'మురై మామన్' సెట్స్‌లో మొదలైన సుందర్ సి - ఖుష్బూ ప్రేమకథ, ఇప్పుడు రాజకీయ వేదికలపై 'పవర్ కపుల్'గా దర్శనమిస్తోంది. ఖుష్బూ వాక్పటిమకు, సుందర్ సి క్రేజ్ తోడైతే మధురై కోటను కైవసం చేసుకోవచ్చని సెల్లూరు రాజు లెక్క.

గతంలో థర్మాకోల్ ప్రయోగంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సెల్లూరు రాజు, ఇప్పుడు "రజనీని నిలబెట్టింది సుందర్ సి" అనే డైలాగ్‌తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఇది రాజకీయ వ్యూహమో లేక అతిశయోక్తో గానీ.. తమిళ రాజకీయాల వెండితెరపై ఈ 'మధురై డ్రామా' మాత్రం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు..!

ఒకే ఇల్లు.. రెండు వేర్వేరు పార్టీలు!

సుందర్ సి, ఖుష్బూ దంపతులు రాజకీయంగా వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఎన్డీయే కూటమిలో భాగంగా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఏ.సి. షణ్ముగం నేతృత్వంలోని పుదియ నీది కట్చి (PNK) పార్టీ తరపున సుందర్ సి బరిలోకి దిగారు. అయితే, కూటమి ఒప్పందం ప్రకారం ఆయన అన్నాడీఎంకే యొక్క 'రెండాకుల' గుర్తుపై మధురై సెంట్రల్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయన భార్య ఖుష్బూ మొదటి నుంచీ బీజేపీ లోనే ఉన్నారు. ఇప్పుడు తన భర్త గెలుపు కోసం మరియు కూటమి విజయం కోసం ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

మధురై సెంట్రల్ లో పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడానికి కారణం ప్రత్యర్థి పళనివేల్ త్యాగరాజన్ . పీటీఆర్ అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక నిపుణుడిగా పేరున్న వ్యక్తి, డీఎంకేలో కీలక మంత్రి. ఆయనకున్న "మేధావి" అనే ఇమేజ్‌ను దెబ్బకొట్టడానికే, సెల్లూరు రాజు గారు తెలివిగా "మధురై మట్టి బిడ్డ" అనే సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు.

మధురై సెంట్రల్‌లో సుందర్ సి విజయం సాధిస్తే, అది పక్కనే ఉన్న మధురై వెస్ట్‌లో సెల్లూరు రాజు గారికి కూడా ప్లస్ అవుతుంది. అందుకే ఆయన సుందర్ సి ని "మధురై వాసి"గా ప్రొజెక్ట్ చేస్తున్నారు (PTR ని అప్పుడప్పుడు అవుట్ సైడర్ అని విమర్శించే క్రమంలో) ఖుష్బూకున్న గ్లామర్‌ను, సుందర్ సి దర్శకత్వ ఇమేజ్‌ను ఓట్లుగా మార్చాలని చూస్తున్నారు.

"సుందర్ సి తన సొంత పార్టీ తరపున 'రెండాకుల' గుర్తుపై పోటీ చేస్తుండగా, ఆయన భార్య ఖుష్బూ బీజేపీ నేతగా ఆయనకు అండగా నిలుస్తున్నారు. వీరికి అన్నాడీఎంకే దిగ్గజం సెల్లూరు రాజు అండగా నిలవడంతో మధురై సెంట్రల్ పోరు ఇప్పుడు 'స్టార్ వార్'గా మారిపోయింది."