ఆలయంలో దొరికే భగవంతుడి ప్రసాదం పవిత్రమైనదిగా భావించి భక్తులు స్వీకరిస్తారు. ప్రపంచంలో చాలా ఆలయాల్లో ప్రసాదాలు ఉన్నప్పటికీ, జి ఐ – జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన ఆలయ ప్రసాదాలు చాలా తక్కువ. భారత్‌లో కొన్ని ఆలయ ప్రసాదాలకు మాత్రమె ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆలయ ప్రసాదాలు భక్తి, సాంప్రదాయానికి, ఆచారాలకు ప్రతీకలు. ప్రతి గుడిలోనూ భక్తులకు ప్రసాదం పెట్టె ఆనవాయితి ఉంది. పులిహోర , చెక్కర పొంగలి , పప్పు బెల్లం , లేదంటే కొబ్బరి ముక్క , అరటి పండు ఇలా దేవుడికి నైవేద్యం పెట్టిన వాటిని భక్తులు తమప్రసాడంగా స్వీకరిస్తారు. అయితే అలాంటి వాటిలో కొన్ని మాత్రమే తమ ప్రత్యేకత, చరిత్ర, తయారీ విధానం వల్ల జి ఐ ట్యాగ్ వంటి అంతర్జాతీయ గుర్తింపును పొందాయి.
ప్రపంచంలో జి ఐ ట్యాగ్ పొందిన మొదటి ఆలయ ప్రసాదం :ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం చాల ప్రత్యేకమైనది. దీనికి 2009లో జి ఐ ట్యాగ్ ఇచ్చారు. ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఈ ప్రసాదం కోసం భక్తులు ఎదురు చూస్తారు. దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడి దర్సనం తరువాత ప్రసాదం స్వీకరించే ముందు దానిని కళ్ళకు హత్తుకుంటారు. ఈ లడ్డూ తయారు చేసే హక్కు అధికారికంగా టి టి డి కి మాత్రమే ఉంది. ఇతరులు“తిరుపతి లడ్డూ” పేరుతో ఎక్కడా విక్రయించకూడదు.లడ్డు తయారీ కోసం తిరుమలలో ప్రత్యేకంగా పోటు అంటే ఆలయ వంటశాల ఉంటుంది. లడ్డు తయారీలో శనగపిండి, నెయ్యి, చక్కెర, జీడిపప్పు, కిస్మిస్ , యాలుకల పొడి వినియోగిస్తారు. సాధారణ రోజుల్లో సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తారు. ఇక పండుగలు, బ్రహ్మోత్సవాల సమయంలో 7 లక్షల వరకు కూడా తయారు చేస్తారు. తిరుపతి లడ్డూ మరెక్కడా దొరకని ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. ఆలయలో కలియుగ వెంకటేశ్వరుడికి నైవేద్యం చేసిన తరువాత మాత్రమే భక్తులకు ఇస్తారు. తిరుమలలో లడ్డూ తయారీ సంప్రదాయం 1715 ప్రాంతం నుంచి ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది.
పలనీ పంచామృతం : భారత దేశంలోని తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని పలని ఆలయం చాలప్రసిద్ది చెందిన మురుగన్ ఆలయం. సముద్రమట్టం నుంచి సుమారు 493 అడుగుల ఎత్తులో ఆలయం ఉంది. ఇక్కడ కొలువు తీరిన సుబ్రహ్మణ్యస్వామి దండాయుధపాణి. చేతిలో దండం అంటే కర్ర పట్టుకున్నవాడు. ఆయన రూపాన్ని త్యాగం, వైరాగ్య సూచికలుగా భక్తులు కొలుస్తారు. సిద్ధులలో ప్రసిద్ధుడైన భోగర్, ఆలయంలోని విగ్రహాన్ని నవపాషాణాల మిశ్రమంతో రూపొందించారని స్థలపురాణం. అందువల్ల ఈ ఆలయానికి వైద్యపరమైన పవిత్రత కూడా ఉందని భక్తులు నమ్ముతారు. ఇకఅరుల్మిగు దండాయుధపాణి స్వామి ఆలయం ఆరు ప్రముఖ మురుగన్ క్షేత్రాలలో ఒకటి భక్తులచే పూజలు అందుకోబడుతుంది. ఈ ఆలయంలో ప్రసిద్ధ ప్రసాదం పంచామృతం. దీనిని అరటిపండ్లు, బెల్లం, నెయ్యి, తేనె, యాలుకలు వినియోగించి తయారు చేస్తారు. 2019 లో పళని పంచామృత ప్రసాదానికి జి ఐ గుర్తింపు లభించింది. చాలా గాఢంగా ఉండే మిశ్రమం. ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. మురుగన్ స్వామికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులకు ఇస్తారు.
