చెన్నై బ్యూరో: తమిళనాడు రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక అపూర్వమైన సామాజిక పరిణామానికి వేదికవుతోంది. దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను, పాలనా యంత్రాంగాన్ని శాసించిన ఒక సామాజిక వర్గం, నేడు ఎన్నికల బరిలో కనీస ప్రాతినిధ్యం కోసం అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల పోరులో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ బ్రాహ్మణ అభ్యర్థులకు టిక్కెట్లు నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది. ‘సామాజిక న్యాయం’ ముసుగులో జరుగుతున్న ఈ రాజకీయ ఏకీకరణ, ద్రావిడ గడ్డపై ఒక కొత్త శకానికి సంకేతమా లేక ఒక వర్గాన్ని వ్యూహాత్మకంగా విస్మరించడమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అంతరించిన జయలలిత మార్క్ రాజకీయం

తమిళ రాజకీయ చరిత్రలో ఎం.జి. రామచంద్రన్, జయలలిత హయాం ఒక ప్రత్యేక అధ్యాయం. ద్రావిడ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూనే, పాలనలోనూ, పార్టీలోనూ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించడంలో ఏఐఏడీఎంకే అప్పట్లో సమతూకాన్ని ప్రదర్శించేది. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో ఈ సమీకరణం వేగంగా మారిపోయింది. గత 35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏఐఏడీఎంకే ఒక్క బ్రాహ్మణ అభ్యర్థిని కూడా బరిలోకి దింపకపోవడం గమనార్హం. 2021లో మాజీ డీజీపీ ఆర్. నటరాజ్ వంటి వారికి అవకాశం ఇచ్చిన పళనిస్వామి వర్గం, ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకుపైనే ఆధారపడింది. అటు అధికార డీఎంకే తన పుట్టుకతోనే ఉన్న బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతానికి కట్టుబడి, ఈ వర్గాన్ని ఎన్నికల ప్రక్రియకు దూరంగానే ఉంచింది.

బీజేపీ ‘యు టర్న్’: ముద్ర చెరిపేసే ప్రయత్నమా?

ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణ-బనియా పార్టీగా ముద్రపడిన భారతీయ జనతా పార్టీ, తమిళనాడులో మాత్రం ఆ ముద్రను వదిలించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో బ్రాహ్మణుల మద్దతు ఎక్కువగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బలపడాలంటే గౌండర్లు, నాయకార్లు వంటి బలమైన సామాజిక వర్గాలను చేరదీయక తప్పదని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఫలితంగా, అగ్రవర్ణాల పార్టీ అనే విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో బీజేపీ కూడా బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇవ్వడానికి వెనుకాడింది. తమిళనాడు బ్రాహ్మణ సంఘం (THAMBRAAS) బహిరంగంగానే మద్దతు ప్రకటించినప్పటికీ, కనీసం మైలాపూర్ , శ్రీరంగం వంటి స్థానాల్లో కూడా వారికి చోటు దక్కకపోవడం ఆ వర్గంలో తీవ్ర అసంతృప్తిని నింపింది.

ద్రావిడ రాజకీయాల పునరుద్ధరణ

తమిళనాడులో ప్రస్తుతం సాగుతున్న రాజకీయాలను విశ్లేషిస్తే, ఇది ‘తీవ్ర ద్రావిడ రాజకీయాల పునరుద్ధరణ’గా కనిపిస్తోంది. పెరియార్ ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న బహుజన వర్గాలకు అధికారం దక్కాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. జనాభాలో కేవలం 3 శాతంగా ఉన్న బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల మెజారిటీ ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రధాన పార్టీలు భయపడుతున్నాయి. గెలిచే అవకాశం అనే సూత్రం ముందు ప్రాతినిధ్యం వెనకబడిపోయింది. రాజకీయాల్లో ఆర్థిక బలం, కుల బలమే గెలుపు గుర్రాలుగా మారిన ప్రస్తుత తరుణంలో, సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న వర్గాలు సహజంగానే పక్కకు నెట్టబడుతున్నాయి.

కొత్త శక్తుల ప్రయోగాలు: విజయ్, సీమాన్ భిన్న గొంతుక

ప్రధాన స్రవంతి పార్టీలు ముఖం చాటేసిన వేళ, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే, అలాగే తమిళ జాతీయవాదాన్ని వినిపించే సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే పార్టీలు మాత్రం కొంత ఉదారత చాటాయి. తాము కులాలకు అతీతమని నిరూపించుకోవడానికి సీమాన్ ఏకంగా ఆరుగురు బ్రాహ్మణ అభ్యర్థులను బరిలోకి దింపడం విశేషం. అలాగే విజయ్ కూడా తన పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ప్రధాన పార్టీల వ్యూహాలకు భిన్నంగా సాగుతున్న ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

మేధోవలస - రాజకీయ శూన్యత

రాజకీయాల్లో ప్రాధాన్యత తగ్గడంతో బ్రాహ్మణ వర్గంలోని యువత ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటోంది. గత రెండు దశాబ్దాలుగా ఈ వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. విద్యా, ఐటీ రంగాల్లో రాణించడం, విదేశాలకు తరలిపోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీల కోసం పనిచేసే కార్యకర్తల బలం ఆ వర్గంలో క్షీణించింది. ఇది కూడా రాజకీయ పార్టీలు వారిని విస్మరించడానికి ఒక కారణంగా మారింది.

మొత్తానికి, తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. సంఖ్యాబలమే పరమావధిగా సాగుతున్న ఈ ఎన్నికల సమరంలో, ఒకప్పుడు రాజకీయాలను ప్రభావితం చేసిన మేధో వర్గం నేడు కేవలం ఓటర్లుగా మాత్రమే మిగిలిపోవాల్సి రావడం ద్రావిడ రాజకీయాల్లో వచ్చిన అతిపెద్ద మార్పు. ‘అందరికీ అధికారం’ అనే నినాదం ఎంతవరకు సామాజిక న్యాయం చేకూరుస్తుందో ఈ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. సంఖ్యాబలమే రాజకీయ పునాదికి అవకాశంగా భావిస్తూ ఇతర రాష్ట్రాలు ఇదే పంధాలో ప్రయాణం చేస్తే తమ పరిస్థితి ఎంటనే ఆందోళన బ్రాహ్మణ వర్గంలో వ్యక్తమవుతుంది.