అయోధ్యలోని రామమందిర రెండో అంతస్తులోని గర్భగుడిలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున 'శ్రీరామయంత్రం' ప్రతిష్ఠించబడింది. ఈ చర్యతో ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న సంబంధం మరింత దృఢపడింది. ఈ యంత్రం, కాంచీ కామకోటి పీఠంలో ఉన్న అసలు శ్రీరామయంత్రాన్ని పోలిన యంత్రాన్ని ఐదు రకాల ప్రత్యేక పూజా పద్ధతులు అనంతరం, రామమందిరంలో ప్రతిష్ఠించారు. ఎన్నో విశిష్టతలతో కూడిన ఈ యంత్రం, రామజన్మభూమి ప్రాంగణం అంతటా ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేస్తుంది . ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు ప్రధాన పీఠాలలో ఒకటైన కాంచీ కామకోటి పీఠానికి చెందిన స్వామి విజయేంద్ర సరస్వతి, ఒక ప్రత్యేక అనుష్ఠానం ద్వారా ఈ యంత్రాన్ని సిద్ధం చేశారు. దీనిని డిసెంబర్ 2024 తిరుపతి దేవస్థానం నుండి రథయాత్ర ద్వారా అయోధ్యకు తీసుకువచ్చారు.
శ్రీరామయంత్రం విశేషాలు: ఇది 150 కిలోల మిశ్రమ లోహంతో తయారు చేయబడింది. మూడు అడుగుల వెడల్పు, మూడు అడుగుల పొడవు ఉన్న ప్లేట్‌పై రూపొందించారు. బంగారు పూతతో మెరిసిపోతోన్న యత్రాన్ని ఒక చెక్క ఫ్రేమ్‌లో అమర్చారు. ఈ యంత్రంపై శ్రీరాముడితో పాటు ఇతర దేవతలకు చెందిన 121 వైదిక, బీజ మంత్రాలు చెక్కబడ్డాయి. నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు చేసి , మంత్రాల శక్తిని ఆ యంత్రంలోకి ప్రవేశపెట్టారు. శ్రీరామయంత్ర ప్రతిష్ఠాపనతో రామమందిరం మూడు అంతస్తులకు పూర్ణత్వం చేకూరినట్లయింది. "రామమందిరం మూడు అంతస్తులు మన శరీరంలోని మూడు స్థితులను అంటే జాగ్రత్ - మెలకువ స్థితి , స్వప్న - కలల స్థితి, సుషుప్తి - గాఢ నిద్ర స్థితి) ) సూచిస్తాయి. రెండో అంతస్తులో ఈ యంత్రాన్ని ఉంచడం ద్వారా భక్తుల మనసులో ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందని పండితుల అభిప్రాయం." ఇక భగవాన్ శ్రీరాముడు, శివుడు (వైష్ణవ , శైవ సాంప్రదాయాల) ఇద్దరూ ఒక్కటే అనికూడ ఈ యంత్రం చాటి చెబుతోంది. ఈ యంత్రాన్ని లోక కళ్యాణం, సాత్విక శక్తుల పెంపుదలకు అత్యంత శుభప్రదంగా పండితులు భావిస్తున్నారు.
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, జన్మకుండలిలో గ్రహ నక్షత్రాల స్థితిగతులను తెలిపే త్రికోణీయ రేఖాచిత్రం ఎలా ఉంటుందో, ఈ యంత్రం కూడా అలాగే వైదిక గణన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో ముడిపడి ఉందని వివరించారు. అర్చకులు ప్రతిరోజూ ఈ శ్రీరామయంత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, అయితే భక్తులు దీనిని నేరుగా దర్శించుకునే అవకాశం ఉండదు.
శ్రీరామ యంత్రం: విశేషాలు, మహత్యం
శ్రీరామ యంత్రం అనేది కేవలం ఒక రేఖాచిత్రం కాదు, ఇది శ్రీరాముడి సూక్ష్మ స్వరూపం, అపారమైన మంత్ర శక్తికి ఇది నిలయం. శ్రీరాముడి అనుగ్రహాన్ని, శక్తిని పొందేందుకు ఉపయోగించే ఒక పవిత్రమైన రేఖాచిత్రం. బిందువు, త్రికోణం, షట్కోణం అంటే ఆరు కోణాల నక్షత్రం, వృత్తం మరియు పద్మ దళాలతో కూడి ఉంటుంది. దీని మధ్యలో ఉన్న 'బిందువు' పరమాత్మకు సంకేతం.
యంత్రం విశేషాలు :
యంత్రంలోని ప్రతి రేఖ, ప్రతి కోణం మరియు ప్రతి అక్షరం నిర్దిష్ట మంత్రాలను మరియు శక్తులను సూచిస్తాయి. శ్రీరాముడికి సంబంధించిన బీజ మంత్రాలు ముఖ్యంగా 'రాం' ఇందులో దాగి ఉన్నాయి. అయోధ్యలోని యంత్రంపై 121 మంత్రాలు చెక్కబడటం దీని అసాధారణ శక్తికి నిదర్శనం. సాధారణంగా యంత్రాలను రాగి, వెండి, బంగారం లేదా పంచలోహాలతో తయారు చేస్తారు. అయోధ్యలో ప్రతిష్ఠించినది 150 కిలోల మిశ్రమ లోహంతో చేసి, స్వర్ణతాపడం చేశారు. ఇది అత్యంత శుభప్రదం. ఇది వైష్ణవ (రాముడు) , శైవ (శివుడు) తత్వాల ఐక్యతకు ప్రతీక. హనుమంతుడు (శివాంశ సంభూతుడు) రాముడికి అత్యంత ప్రియమైన భక్తుడు, ఈ విధంగా కూడా ఈ యంత్రం శివ-కేశవ ఐక్యతను చాటుతుంది.
మహత్యం మరియు ప్రయోజనాలు:
సాధకులు ఈ యంత్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పొందుతారు. శ్రీరామ యంత్రం ఉన్న ప్రదేశంలో దుష్ట శక్తులు, వాస్తు దోషాలు మరియు ప్రతికూల తరంగాలు తొలగిపోతాయని నమ్మకం. ఇది ఇంటిని లేదా దేవాలయాన్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. భక్తితో ఈ యంత్రాన్ని పూజించడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు, విజయం మరియు సుఖశాంతులు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా 'రామ నామం' జపం చేస్తూ ఈ యంత్రాన్ని అర్చిస్తే ఫలితం అనంతం. ఇది సాధకుడిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిల్చి, మోక్ష మార్గంలో పయనించేలా చేస్తుంది.
ఈ యంత్రం ఏ ఏ ఆలయాలలో ఉంది?
శ్రీరామ యంత్రం కొన్ని ముఖ్యమైన, ప్రాచీన ఆలయాలలో మాత్రమె ఉంటుంది. శంకరాచార్య పీఠాలలో దీనికి విశేష స్థానం ఉంది. తమిళనాడులోని కంచి కామకోటి పీఠంలో ఆది శంకరాచార్యులు ఇక్కడ స్వయంగా శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఇది అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. అయోధ్యలోని యంత్రం దీని నమూనాగా చెబుతున్నారు. ఆ తరువాతఉత్తర ప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలో అత్యంత వైభవంగా శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని పాత రామాలయాలలో, ముఖ్యంగా మంత్ర శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చే దేవాలయాలలో మూలవిరాట్టు పక్కన లేదా కింద యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజిస్తారు. శంకరాచార్య పీఠాలలో శ్రీచక్రంతో పాటు శ్రీరామ యంత్రాన్ని కూడా ఆరాధించే సంప్రదాయం ఉంది.
శ్రీరామ యంత్రం అనేది రామ భక్తికి, మంత్ర శక్తికి మరియు భారతీయ ఆధ్యాత్మికతకు అత్యున్నత ప్రతీక. దీని ప్రతిష్ఠాపన అయోధ్య రామమందిరానికి పూర్ణత్వాన్ని, భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. "ఈ యంత్రాన్ని మనం నేరుగా చూడలేకపోయినా, దాని నుండి వచ్చే శక్తి మాత్రం ఆ రామజన్మభూమి అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ అద్భుతమైన సమాచారం మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి .




