"అన్నాడీఎంకే మాజీ నేత సెంగోట్టయన్ సంచలన ఆరోపణలు! జయలలిత మరణం తర్వాత జరిగిన చీకటి ఒప్పందాలు, పళనిస్వామి అధికారం కోసం చేసిన కుతంత్రాలను బయటపెట్టారు. టీవీకే అభ్యర్థిగా గోబిచెట్టిపాళయం బరిలో ఆయన చేస్తున్న ప్రచారంపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి."
చెన్నై , ఏప్రియల్ 18 : తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిణామాలు, అప్పటి రాజకీయ చదరంగం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత సెంగోట్టయన్ చేస్తున్న సంచలన ఆరోపణలు ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వానికి పెద్ద సవాలుగా మారాయి. గోబిచెట్టిపాళయం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న సెంగోట్టయన్, తన ప్రచార సభల్లో పాత గాయాలను కదుపుతూ అధికార పీఠం కోసం జరిగిన కుతంత్రాలను ప్రజల ముందు ఉంచుతున్నారు.
ఈరోడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సెంగోట్టయన్, జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న చీకటి ఒప్పందాలను బహిర్గతం చేశారు. “అమ్మ మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాల్సింది నేను, కానీ దురదృష్టవశాత్తూ ఆ పదవిని కోల్పోయాను” అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఆ రాత్రి వరకు పరిస్థితులు తనకు అనుకూలంగానే ఉన్నాయని, కానీ మరుసటి ఉదయానికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఎడప్పాడి పళనిస్వామి వద్ద అప్పట్లో ఉన్న ‘డబ్బు సంచుల’ ప్రతాపమే తనను పదవికి దూరం చేసిందని, ఆ రాత్రి జరిగిన రాజకీయ కుతంత్రం వల్లే ఈపీఎస్ ముఖ్యమంత్రి అయ్యారని సెంగోట్టయన్ ఘాటుగా విమర్శించారు. శశికళతో తనకు జరిగిన సంభాషణలను ప్రస్తావిస్తూ, పార్టీ విచ్ఛిన్నం కాకుండా ఉండాలనే తాను వెనక్కి తగ్గానని, కానీ పళనిస్వామి మాత్రం అధికారం కోసం శశికళ కాళ్లపై పడి పదవిని సొంతం చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు.
నమ్మకద్రోహంపై శశికళ, ఓపీఎస్ సైతం..
కేవలం సెంగోట్టయన్ మాత్రమే కాదు, శశికళ, ఓ. పన్నీర్‌సెల్వం కూడా ఎడప్పాడి పళనిస్వామిని లక్ష్యంగా చేసుకుని విమర్శల జడివాన కురిపిస్తున్నారు. తన కాళ్లపై పడి పదవిని పొంది, ఆ తర్వాత తననే పార్టీ నుంచి బయటకు పంపిన పళనిస్వామి కృతజ్ఞత లేని వ్యక్తి అని శశికళ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు జీవితంలో ఉన్న సమయంలో తనపై పన్నాగం పన్ని కరోనాను వ్యాప్తి చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు, రాజకీయాల్లో ద్రోహానికి కేరాఫ్ అడ్రస్‌గా పళనిస్వామి మారిపోయారని ఓపీఎస్ మండిపడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలను, తనను నమ్ముకున్న వారిని పక్కన పెట్టి, స్వార్థ రాజకీయాలకు తెరలేపారని వీరంతా ముక్తకంఠంతో విమర్శిస్తున్నారు.
పొత్తుల పేరిట మోసం: సెంగోట్టయన్ ఆరోపణలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంగోట్టయన్, ఎడప్పాడి పళనిస్వామిపై వరుస విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నాడీఎంకేను పూర్తిగా పక్కన పెట్టాలని పిలుపునిస్తూ, ‘రెండాకుల గుర్తు’కు ఓటు వేయొద్దని, తమ అభ్యర్థులకు మద్దతుగా ‘విజిల్’ గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలోనూ ఈపీఎస్ వ్యవహారశైలిని, అలాగే ప్రేమలత విజయకాంత్‌కు రాజ్యసభ సీటు ఇస్తామని నమ్మించి చేసిన మోసాన్ని ఆయన బయటపెట్టారు. దశాబ్ద కాలంగా అన్నాడీఎంకేలో కొనసాగిన సెంగోట్టయన్ ఇప్పుడు ఆ పార్టీ లోగుట్టును బయటపెడుతుండటంతో, రానున్న ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయం ఏ వైపు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలు మారినా, పాత వైరం మాత్రం చల్లారలేదు సరే కదా, ఎన్నికల వేళ మరింత భగ్గుమంటోంది.
నవంబర్ 26, 2025న, ఏఐఏడీఎంకే (AIADMK) నుండి బహిష్కరణకు గురైన తర్వాత, ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
నవంబర్ 27, 2025న, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో చేరారు.
ఆయన పార్టీలో 'హై-లెవల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ'కి చీఫ్ కోఆర్డినేటర్‌గా మరియు కోయంబత్తూర్, ఈరోడ్, తిరుప్పూర్, నీలగిరి అనే నాలుగు పశ్చిమ జిల్లాలకు ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమితులయ్యారు.
ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆయన గోబిచెట్టిపాళయం నియోజకవర్గం నుండి టీవీకే అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేసి, 'వయశిల' (విజిల్ గుర్తుపై ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు.