బెంగళూరు మల్లేశ్వరంలో 1997లో బయటపడిన 400 ఏళ్ల నాటి దక్షిణ ముఖ నంది తీర్థం విశేషాలు. నంది నోటి నుండి నిరంతరం పడే నీటి ధార వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యం ఏమిటి? పూర్తి కథనం ఇక్కడ చదవండి.
(బెంగళూరు- కోడికూత )
గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో ఆధునిక భవనాలు, ఐటీ కంపెనీల కోలాహలం మధ్య ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. అదే మల్లేశ్వరంలోని 'శ్రీ దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం'. రద్దీగా ఉండే నగర జీవనంలో పక్కనే పాతకాలపు ఆలయాలు ఉండటం సహజమే కానీ, భూగర్భంలో కొన్ని వందల ఏళ్లు మరుగున పడిన ఈ ఆలయం అకస్మాత్తుగా బయటపడింది. ఆ క్షేత్రం పర్యాటకులను, చరిత్రకారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక నిర్మాణ పనుల సమయంలో బయటపడిన ఈ పురాతన శివాలయం, సైన్స్ కు అందని కొన్ని మిస్టరీలతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఈ ఆలయ పునర్వైభవం ఒక సినిమాటిక్ మలుపును తలపిస్తుంది. 1997 వరకు ఈ ప్రాంతం కేవలం ఒక ఖాళీ స్థలంగానే అందరికీ తెలుసు. మల్లేశ్వరంలోని కడు మల్లేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ స్థలంలో ఒక రాజకీయ నాయకుడు భవన నిర్మాణాన్ని చేపట్టాలని భావించి తవ్వకాలు ప్రారంభించారు. అయితే, మట్టిని తొలగిస్తున్న కొద్దీ శిల్పకళతో కూడిన స్తంభాలు, రాతి కట్టడాలు బయటపడ్డాయి. స్థానికుల జోక్యంతో భారత పురాతత్వ శాఖ రంగంలోకి దిగి శాస్త్రీయంగా తవ్వకాలు జరపగా, అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిలో ఉన్న ఒక సంపూర్ణ శివాలయం దర్శనమిచ్చింది. దాదాపు నాలుగు శతాబ్దాల పాటు భూమిపొరల్లో కూరుకుపోయిన ఈ ఆలయం, కాలక్రమేణా పైనున్న మట్టి పేరుకుపోవడం వల్లే కనుమరుగైందని పరిశోధకులు నిర్ధారించారు.
నంది నోటి నుండి అమృత ధార: ఒక మర్మం
ఈ క్షేత్రంలోని అత్యంత ప్రధాన ఆకర్షణ 'నంది తీర్థం'. సాధారణంగా శివాలయాల్లో నంది శివలింగానికి ఎదురుగా ఉంటుంది. కానీ ఇక్కడ నంది విగ్రహం శివలింగానికి పైన, ఒక ప్రత్యేక వేదికపై దక్షిణ ముఖంగా కొలువై ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నంది నోటి నుండి నిరంతరం స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ కింద ఉన్న శివలింగాన్ని అభిషేకిస్తుంది. ఈ అభిషేకం నిరంతరాయంగా, ఏ కాలంలోనైనా సాగుతూనే ఉంటుంది. నంది నోటి నుంచి వచ్చే ఈ నీరు నేరుగా కింద ఉన్న 'కళ్యాణి' (కోనేరు) లోకి చేరుతుంది. అయితే, ఈ నీటి మూలం ఎక్కడుంది? కొండలు లేని ఈ మైదాన ప్రాంతంలో, భూగర్భంలో ఉన్న నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుండి వస్తోంది? అన్నది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. వృషభావతి నదికి ఇదే జన్మస్థానమని కొందరు భావిస్తుంటారు.
శతాబ్దాల చరిత్ర.. వేల ఏళ్ల విశ్వాసం
ఈ ఆలయ కాలమానంపై భిన్నమైన వాదనలు ప్రచారంలో ఉన్నాయి. పురావస్తు శాఖ కార్బన్ డేటింగ్ ఆధారంగా ఇది సుమారు 400 ఏళ్ల నాటిదని, బహుశా మరాఠా పాలకుల కాలంలో లేదా స్థానిక పాళెగార్ల కాలంలో నిర్మించి ఉండవచ్చని పేర్కొంది. కానీ, స్థానిక భక్తులు, కొందరు పరిశోధకులు ఈ క్షేత్రం కొన్ని వేల ఏళ్ల క్రితమే ఉనికిలో ఉందని, కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమిలో కలిసిపోయిందని నమ్ముతారు. ఆలయ గోపురం లేకపోవడం, భూగర్భంలో నిర్మించినట్లుగా ఉండటం ఈ ఆలయ శైలిలోని ప్రత్యేకత. గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసిన స్తంభాల మండపాలు విజయనగర సామ్రాజ్య నిర్మాణ రీతిని పోలి ఉంటాయి.
ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయం
మల్లేశ్వరం 2వ టెంపుల్ స్ట్రీట్‌లో, గంగమ్మ దేవాలయం సమీపంలో ఉన్న ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే నగర శబ్ద కాలుష్యం మటుమాయమవుతుంది. భూగర్భంలో ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. శివలింగానికి ఎడమవైపున చిన్న గణపతి విగ్రహం, ప్రాంగణంలో నవగ్రహ మండపం కొలువై ఉన్నాయి. శివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. నంది నోటి నుండి వచ్చే తీర్థాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
మట్టి పొరల్లో దాగి ఉన్న ఈ 'దక్షిణాముఖ నంది తీర్థం' మన ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి, ఆధ్యాత్మిక వారసత్వానికి నిలువెత్తు సాక్ష్యం. ఎన్ని ఆధునిక పరిశోధనలు చేసినా జలదారమర్మం ఇప్పటివరకు వీడలేదు. బెంగళూరు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ఈ క్షేత్రం, కేవలం ఒక గుడి మాత్రమే కాదు.. ప్రకృతి, దైవత్వం మరియు చరిత్రల అద్భుత సంగమం.