భారతీయ రాజకీయాల్లో వారసత్వం ఒక బలమైన ఆయుధం. ముఖ్యంగా దక్షిణాదిలో కరుణానిధి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వంటి దిగ్గజ నేతల వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన మహిళా నాయకులు తమ సొంత గుర్తింపు కోసం తీవ్రంగా ప్రస్తుతం పోరాడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత, కనిమొళి ముగ్గురూ రాజకీయంగా భిన్న మార్గాల్లో ప్రయాణిస్తున్నా, ఒకే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు: “తండ్రి వారసత్వాన్ని నిలబెట్టగలరా? లేక తమకంటూ కొత్త గుర్తింపును సృష్టించుకుంటారా?”
వైఎస్ షర్మిల: విశ్వాసం నుండి తిరుగుబాటు వరకు సాగిందని, కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అసలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఒక డ్రామాటిక్ టర్న్‌లతో నిండింది. తన సోదరుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో “మరో ప్రస్థానం” పాదయాత్రతో వైఎస్సార్సీపీకి ఊపిరి పోసిన ఆమెకు, అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదు. తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల పేరుతో తెలంగాణలో పార్టీ స్థాపించినా విఫలమయ్యారు. ఆ తరువాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం సాహసమే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆమె తన సొంత అన్నపై రాజకీయ యుద్ధం ప్రకటించడం , నిత్య విమర్శలు కొనసాగిస్తుండటం కేవలం రాజకీయ పోటీ గా మాత్రమె కాకుండా వైఎస్సార్ వారసత్వంపై అస్తిత్వ పోరాటంగా కూడా భావించాల్సి ఉంటుంది. అయితే, క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడం, కాంగ్రెస్‌లో అంతర్గత పోటీలు ఆమెకు సవాల్ గా మారాయి .
కల్వకుంట్ల కవిత: ఉద్యమం నుండి ఆమె ప్రయాణం వివాదాల దాకా చేరుకుంది. కవిత రాజకీయ ప్రయాణం “ఉద్యమ నాయకత్వం” నుండి “న్యాయపోరాటం” వరకు వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తండ్రి కె . చంద్రశేఖర్ రావు పక్కన నిలబడి మహిళలను ఏకం చేసిన కవిత, బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఢిల్లీ లిక్కర్ కేసు ఆమె రాజకీయ భవిష్యత్తుపై ముద్ర వేసింది. జైలు జీవితం తర్వాత ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న ఆమె, రాజకీయంగా కొంత మౌనం పాటిస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేసీఆర్ కు సీబీఐ నోటీసుపై ఆమె 2025 సెప్టెంబర్ 1నఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్టారెడ్డిలు చేసిన అవినీతి కారణంగా తన తండ్రి కేసీఆర్‌కు చెడ్డ పేరు వచ్చిందని ఆరోపణలు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆమెను సెప్టెంబర్ 2న పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. త్వరలో ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. తన తండ్రి స్థాపించిన పార్టి నుంచి ఆమె సస్పెండ్ కు గురికావటం , కేసుల ఒత్తిడి ఆమె కెరీర్‌ను సంక్లిష్ట దశలోకి నెట్టాయి. అయితే ఆమె వాక్చాతుర్యం, ఉద్యమ అనుభవం ఆమె అదనపు బలాలుగా కనిపిస్తున్నాయి.
కనిమొళి: వివాదాలపై విజయం సాధించిన వ్యూహకర్తగా ఈమెను రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. కనిమొళి కరుణానిధి రాజకీయంగా అత్యంత స్థిరంగా ఉన్న నాయకురాలిగా కనిపిస్తున్నారు. తన తండ్రి ఏం . కరుణానిధి వారసురాలిగా మాత్రమే కాకుండా, కవయిత్రిగా, జర్నలిస్టుగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2జి కేసులో వచ్చిన ఆరోపణలు, జైలు జీవితం ఆమె ఇమేజ్‌ను దెబ్బతీశాయి. కానీ తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించి తిరిగి బలంగా ఎదిగారు. తన సోదరుడు ఏం కే స్టాలిన్ తో సమన్వయం కొనసాగిస్తూ, పార్టీలో తన స్థానం బలపర్చుకున్నారు. లోక్‌సభలో డీఎంకే గళాన్ని బలంగా వినిపిస్తూ జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు. అయితే, భవిష్యత్తులో స్టాలిన్ వారసుడు , తన మేనల్లుడు ఉదయనిది స్టాలిన్ వారసత్వ రాజకీయాల్లోకి రావడం కనిమొళి స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉందనే వాడన్ తమిళనాట వినిపిస్తుంది.
వారసత్వం: వరమా? శాపమా?
ఈ ముగ్గురు నాయకులకు తమ తండ్రుల పేర్లు ఒక బలమైన పునాది ఇచ్చాయి. కానీ అదే సమయంలో భారీ అంచనాలను కూడా మోపాయి. వీరిలో ఒకరైన షర్మిల కుటుంబ రాజకీయాల్లోనే పోరాటం చేస్తూ అందులోనుంచి బయటకు రాలేక పోతున్నారు. దిన్ని ఆమె నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు సైతం మింగుడు పడటం లేదు. ఇక కవిత న్యాయపరమైన సంక్షోభం తొలుత బయట పడాల్సిన అవసరం ఉంది. ఇక కనిమొళికి తన స్థానాన్ని కాపాడుకునే వ్యూహం , ప్రయత్నం తప్పనిసరిగా మారింది. ఇక్కడ ముగ్గురి ప్రయాణాలు భిన్నమైనా, వారి లక్ష్యం ఒక్కటే - “సొంత గుర్తింపుతో రాజకీయాల్లో నిలదొక్కుకోవడం”. పురుషాధిపత్యం ఉన్న సమాజంలో వీరు ముగ్గురూ భవిష్యత్తులో ఎలా రానిస్తారో వేచి చూడాల్సిందే ..అవరోధాలను అధిగమించి సరికొత్తగా ముఖ్యమంత్రి కుర్చి వరకు చేరుకుంటారారాబోయే కాలమే నిర్ణయిస్తుంది.




