తమిళనాడు ఎన్నికల్లో వీరప్పన్ కుటుంబం సంచలనం సృష్టిస్తోంది. కుమార్తె విద్యారాణి NTK తరపున, భార్య ముత్తులక్ష్మి TVK తరపున బరిలోకి దిగారు. స్మగ్లర్ ఇమేజ్ నుండి తమిళ జాతీయవాదిగా వీరప్పన్ కథను మార్చే ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుంది? పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
చెన్నై: దశాబ్దాల పాటు సత్యమంగళం అడవులను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, వేటగాడు వీరప్పన్ పేరు మళ్ళీ తమిళ రాజకీయాల్లో మార్మోగుతోంది. తుపాకీ పట్టిన వీరప్పన్ కథ ముగిసి రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఆయన కుటుంబం ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమైంది. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి, పెద్ద కుమార్తె విద్యారాణి వేర్వేరు పార్టీల తరపున బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. వీరప్పన్‌ను ఒక నేరస్థుడిగా కాకుండా, 'తమిళ జాతీయవాదిగా', 'అడవుల రక్షకుడిగా' చిత్రించే ప్రయత్నం ఈ ఎన్నికల వేళ స్పష్టంగా కనిపిస్తోంది.
రాజకీయ అరంగేట్రం: మెట్టూరులో విద్యారాణి జోరు
వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీరప్పన్ కుమార్తె విద్యారాణి (35), రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిళర్ కట్చి' – యెన్ టి కె తరపున సేలం జిల్లాలోని మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. నిజానికి విద్యారాణికి రాజకీయాలు కొత్తేమీ కాదు. 2020లో బీజేపీలో చేరిన ఆమె, ఆ తర్వాత ఆ పార్టీని వీడి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణగిరి నుండి యెన్ టి కె అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె సుమారు 1,07,000 ఓట్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2019తో పోలిస్తే ఆ పార్టీకి అక్కడ గణనీయమైన ఓట్ల శాతం పెరగడానికి విద్యారాణి చరిష్మానే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మెట్టూరు స్థానాన్ని ఎంచుకోవడం వెనుక బలమైన సామాజిక సమీకరణాలు ఉన్నాయి. పశ్చిమ తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన 'వన్నియర్' సామాజిక వర్గానికి వీరప్పన్ ప్రతినిధిగా గుర్తింపు పొందడం, అదే సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ కీలకం కావడం ఆమెకు కలిసివచ్చే అంశం.
ఎన్నికల ప్రచారంలో విద్యారాణి తన తండ్రి పట్ల ఉన్న పాత అభిప్రాయాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. "మా నాన్నను వ్యవస్థ ఒక నేరస్థుడిగా చిత్రించింది, కానీ ఆయన దోపిడీకి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఆయన జీవించి ఉంటే కచ్చితంగా ప్రజాస్వామ్య మార్గంలోనే పోరాడేవారు" అంటూ ఆమె భావోద్వేగపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. యెన్ టి కె అధినేత సీమాన్ సైతం వీరప్పన్‌ను ఎల్టీటీఈ ప్రభాకరన్‌తో పోల్చుతూ, "ప్రభాకరన్ జాతిని రక్షిస్తే, వీరప్పన్ అడవులను రక్షించారు" అని వ్యాఖ్యానించడం ద్వారా తమిళ జాతీయవాద ఓటర్లను ఆకర్షించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వీరప్పన్ పేరు మీద ఉన్న 'నెగటివ్' ఇమేజ్‌ను 'హీరోయిజం'గా మార్చి ఓట్లుగా మలచుకోవడమే లక్ష్యంగా వీరి ప్రచారం సాగుతోంది.
కృష్ణగిరి బరిలో ముత్తులక్ష్మి: తల్లి వర్సెస్ కూతురు కాదా?
మరోవైపు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కూడా ఎన్నికల రంగంలో చురుగ్గా ఉన్నారు. ఆమె కృష్ణగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 'తమిళగ వాల్వ్రుమై కట్చి' – టి వి కె అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో 2006లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆమె, ఇప్పుడు వ్యవస్థీకృత పార్టీ అండతో బరిలోకి దిగారు. గతంలో లోక్‌సభ ఎన్నికల్లో తన కుమార్తె కోసం పోటీ నుండి తప్పుకున్న ముత్తులక్ష్మి, ఇప్పుడు తాను కూడా అసెంబ్లీకి వెళ్లాలని పట్టుదలతో ఉన్నారు. తల్లి, కుమార్తె వేర్వేరు పార్టీల నుండి పోటీ చేయడంపై స్పందిస్తూ.. తమ మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటేనని, అది తమిళ జాతీయవాదం మరియు పేదల సంక్షేమమని ఆమె పేర్కొంటున్నారు. ముత్తులక్ష్మి ప్రధానంగా గ్రామీణ సమస్యలు, సాగునీటి ఎద్దడి మరియు వన్నియర్ సామాజిక వర్గ సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
కూటముల సమీకరణాలు - ప్రభావం
ముత్తులక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న టి వి కె పార్టీ గతంలో అధికార డీఎంకే కూటమిలో ఉండేది. అయితే సీట్ల సర్దుబాటులో డీఎంకే వ్యవహరించిన తీరుపై అసంతృప్తితో ఆ పార్టీ వ్యవస్థాపకుడు వేల్మురుగన్ కూటమి నుండి బయటకు వచ్చారు. ఇది ముత్తులక్ష్మికి కొత్త సవాలుగా మారింది. అటు కుమార్తె విద్యారాణి పోటీ చేస్తున్న యెన్ టి కె ఎప్పుడూ ఒంటరి పోరుకే మొగ్గు చూపుతుంది. దీనివల్ల ఓట్లు చీలి అధికార, ప్రతిపక్ష పార్టీలకు లాభం జరుగుతుందా లేక వీరప్పన్ కుటుంబం తనదైన 'ఓటు బ్యాంకు'ను సృష్టించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఒకప్పుడు అటవీ ప్రాంతాల్లో తుపాకుల మోతతో వినిపించిన వీరప్పన్ పేరు, ఇప్పుడు మైకుల ద్వారా ఓటర్ల దరికి చేరుతోంది. అక్రమ రవాణా, హత్యలు వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, స్థానిక ప్రజల్లో ఆయన పట్ల ఉన్న సానుభూతిని ఓట్లుగా మార్చుకోవాలని ఆయన కుటుంబం గట్టి ప్రయత్నం చేస్తోంది. చట్టం దృష్టిలో నేరగాడైనా, రాజకీయ క్షేత్రంలో తమ తండ్రిని 'బహుజన నాయకుడిగా' నిలబెట్టాలన్న వారి ఆరాటం తమిళనాడు ఎన్నికల్లో ఒక విలక్షణమైన అంశంగా నిలుస్తోంది. మే నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడతాయి ., అదేసమయంలో వీరప్పన్ వారసత్వానికి ప్రజలు ఏ మేరకు పట్టం కట్టారో అనేది కూడా తేలిపోతుంది.
గమనిక : తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం TVKఅనే సంక్షిప్త నామంతో రెండు వేర్వేరు పార్టీలు కనిపిస్తున్నాయి:
1. తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vettri Kazhagam - TVK):ఇది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన పార్టీ. 2024 ఫిబ్రవరిలో ఆయన దీనిని ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులో అత్యంత క్రేజ్ ఉన్న కొత్త రాజకీయ శక్తి ఇది. పేరులో 'వెట్రి' (విజయం) ఉంది.
వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పోటీ చేస్తున్నది ఈ పార్టీ తరపున. దీని వ్యవస్థాపకుడు టి. వేల్మురుగన్. ఈ పార్టీ విజయ్ పార్టీ కంటే చాలా కాలం ముందు నుంచే ఉనికిలో ఉంది. గతంలో వీరు డీఎంకే (DMK) కూటమిలో ఉండేవారు. ఈ పార్టీ పేరులో 'వాల్వ్రుమై' (జీవనోపాధి/హక్కులు) ఉంది. ఇది ప్రధానంగా ఉత్తర తమిళనాడులోని 'వన్నియర్' సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తుంది. వేల్మురుగన్ నేతృత్వంలోని TVK తరపున ముత్తులక్ష్మి వీరప్పన్ పోటీ చేస్తున్నారు.