దేశంలో ఓటింగ్‌ను తప్పనిసరి చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుడి ఇష్టమని, బలవంతం చేయడం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చదవండి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17:భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఒక పవిత్రమైన హక్కు మరియు రాజ్యాంగబద్ధమైన బాధ్యత. అయితే, ఆ హక్కును వినియోగించుకోవాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా పౌరుడి విచక్షణకే వదిలేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో నిర్భంద ఓటు వినియోగం అమలు చేయాలని, ఓటు వేయని వారిపై కఠిన ఆంక్షలు, శిక్షలు విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రజాస్వామ్యం అనేది చైతన్యంతో వికసించాలే తప్ప, చట్టబద్ధమైన ఒత్తిడితో కాదని కోర్టు పేర్కొనడం విశేషం.
అజయ్ గోయల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ మరియు జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తన వాదనలో.. దేశంలో ఓటింగ్ శాతం పెరగాలంటే ఓటు వేయని వారికి ప్రభుత్వ సదుపాయాలు నిలిపివేయాలని, జరిమానాలు విధించాలని కోరారు. అయితే, దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఓటింగ్‌ను తప్పనిసరి చేయడం అనేది పూర్తిగా 'విధానపరమైన అంశం' అని, ఇది ప్రభుత్వాలు, పార్లమెంటు పరిధిలోకి వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానాలు అటువంటి మార్గదర్శకాలు జారీ చేయడం సాధ్యం కాదని, శాసన వ్యవస్థే దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
తప్పనిసరి చేయటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం
ఓటు వేయడం అనేది పౌరుడి ప్రాథమిక బాధ్యత అయినప్పటికీ, దానిని దండనీయమైన చర్యలతో అమలు చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. "ప్రతి పౌరుడు ఓటు వేయాలని మేము ఆశిస్తాం, కానీ ప్రభుత్వం వారిని బలవంతం చేయకూడదు" అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఓటు వేయకపోతే మనం వారిని అరెస్టు చేయాలని ఆదేశించగలమా? అని ఆయన ప్రశ్నించారు. ఓటు వేయని వారిని నేరస్తులుగా పరిగణించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని కోర్టు భావించింది. ప్రజల్లో ఓటు విలువపై అవగాహన కల్పించడం, ఎన్నికల ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయడం ద్వారా మాత్రమే మార్పు సాధ్యమవుతుందని, అంతే తప్ప శిక్షాత్మక చర్యలు పరిష్కారం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని ఆసక్తికరమైన మరియు కీలకమైన అంశాలను ప్రస్తావించింది. మన దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కోర్టు కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఉదాహరణకు, ఒక నిరుపేద కూలీ తన దైనందిన జీవనోపాధి కోసం పనులకు వెళ్తేనే పూట గడుస్తుందని భావించినప్పుడు, అతడిని పని మానుకుని ఓటు వేయమని ఎలా బలవంతం చేయగలమని కోర్టు ప్రశ్నించింది. అలాగే, విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, అత్యవసర సేవల్లో ఉన్నవారు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉంటే, వారిని శిక్షించడం ఎంతవరకు సమంజసమని ధర్మాసనం నిలదీసింది.
కోర్టులో సరదా సంభాషణ
విచారణా సమయంలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఒకవేళ ఓటింగ్ తప్పనిసరి అనే పిటిషన్‌ను తాము అంగీకరిస్తే, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తన సహచర న్యాయమూర్తి జస్టిస్ బాగ్చీ, పని దినం అయినప్పటికీ ఓటు వేయడానికి తన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుందని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. దీనికి జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ.. వ్యక్తిగత హక్కుతో పాటు న్యాయపరమైన విధి నిర్వహణ కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. ఓటింగ్‌ను నిర్బంధం చేస్తే తలెత్తే పరిపాలనాపరమైన, వృత్తిపరమైన ఇబ్బందులు వీరి వ్యాఖ్యల ద్వారా వ్యక్తమయ్యాయి.
చివరగా, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రచార కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. బలవంతపు ఓటింగ్ అనేది ఒక కృత్రిమ పెరుగుదలకు దారితీస్తుందే తప్ప, నిజమైన ప్రజాస్వామ్య బలానికి సంకేతం కాదని కోర్టు అభిప్రాయం. ఓటు వేయడం అనేది పౌరుడి 'స్వేచ్ఛ'లో ఒక భాగమని, ఆ స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో దేశంలో 'నిర్బంధ ఓటింగ్' చర్చకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.