భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, అవి దేశంలోని అతిపెద్ద సామాజిక సంక్షేమ వ్యవస్థలుగా అవతరించాయి. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి తిరిగి సమాజ సేవకు ఎలా మళ్లుతోంది? ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి షిరిడీ సాయి సంస్థాన్ వరకు ప్రస్తుత సేవా బడ్జెట్‌లు మరియు ప్రాజెక్టుల లోతైన విశ్లేషణ మీ కోసం.

1. తిరుమల తిరుపతి దేవస్థానం : వైద్య రంగంలో మహా విప్లవం

ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా ఉన్న టి టి డి తన విరాళాలను ప్రధానంగా వైద్యం మరియు విద్య రంగాలకు మళ్లిస్తోంది. టి టి డి దీనికోసం దేవస్థానం బడ్జెట్ లో హెల్త్ కింద రూ. 155 కోట్లు ఖర్చుచేసింది. టి టి డి కేవలం ఆసుపత్రుల నిర్వహణకే కాకుండా, అత్యాధునిక వైద్య పరికరాల కోసం భారీగా ఖర్చు చేస్తోంది.

బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ – బి ఐ ఆర్ ఆర్ డి ఇది దేశంలోనే అతిపెద్ద ఎముకల ఆసుపత్రి.సాధారణంగా వాడుకలో దీనిని బర్డ్ ఆసుపత్రి అని పిలుస్తారు. ఇక్కడ రోజుకు 2,000 మందికి పైగా ఓపీడీ సేవలు అందుతున్నాయి. ఆర్థోపెడిక్ సర్జరీలు ఇక్కడ పూర్తిగా ఉచితం లేదా చాలా తక్కువ ధరకే జరుగుతాయి.

చిన్నపిల్లల గుండె చికిత్స కోసం టి టి డి ఏర్పాటు చేసిన మరో వైద్య కేంద్రం శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్. వందలాది మంది పేద పిల్లలకు ఇక్కడ ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

అదేవిధంగా ప్రతిరోజూ సుమారు 1 లక్ష మంది భక్తులకు ఉచితంగా అన్నదానం జరుగుతోంది. దీని కోసం ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

2. షిరిడీ సాయి సంస్థాన్:

గ్రామీణ అభివృద్ధికి చిరునామాగా ఉంది. మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయం విరాళాలను మౌలిక సదుపాయాల కల్పనకు వాడుతోంది. షిరిడీ చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రామాల్లో మంచినీటి ఎద్దడిని తీర్చడానికి సాయి సంస్థాన్ భారీ పైప్‌లైన్ ప్రాజెక్టులను చేపట్టింది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ సేవలు ముక్యంగా గుండె, మెదడు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధుల కోసం షిరిడీలో అత్యాధునిక ఆసుపత్రిని నడుపుతున్నారు. ఇక్కడ పేదలకు డయాలసిస్ వంటి సేవలు ఉచితంగా అందుతాయి. గ్రామాల్లో జూనియర్, సీనియర్ కాలేజీలతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు మరియు ఐటిఐ సెంటర్లను నడుపుతూ గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తోంది.

౩. వైష్ణో దేవి ఆలయం (జమ్మూ కాశ్మీర్): భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తారు.

శ్రీ మాతా వైష్ణో దేవి ష్రైన్ బోర్డ్ (SMVDSB) కేవలం ఆధ్యాత్మిక సేవలకు పరిమితం కాకుండా, భక్తుల ప్రాణాలకు మరియు వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోంది. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి బోర్డు ఉచితంగారూ. 10 లక్షలగ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది. యాత్ర సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి ఈ బీమా మొత్తం అందుతుంది. ఇది దేశంలోనే ఏ ఇతర ఆలయం చేయని అరుదైన సామాజిక భద్రత. ఆలయానికి వచ్చే ఆదాయంలో ఏటా సుమారు రూ. 121 కోట్లను విద్యాసంస్థల కోసం కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ మాతా వైష్ణో దేవి గురుకుల్లో సంప్రదాయ వేద విద్యను ఆధునిక విద్యతో కలిపి ఉచితంగా అందిస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధి కోసం అధునాతన వైద్య కళాశాలలను మరియు నర్సింగ్ కళాశాలలను బోర్డు స్వయంగా నిర్వహిస్తోంది. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి అత్యాధునిక క్రీడా సముదాయాన్ని కూడా ఏర్పాటు చేసింది.

4. జగన్నాథ పూరీ (ఒడిశా):

పూరీ జగన్నాథ ఆలయ యంత్రాంగం 'ఆలయ సేవకులు' మరియు వారి కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో భారీ గురుకులాన్ని నిర్మించారు. దీని కోసం ఏటా రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ కేవలం పూజారుల పిల్లలకే కాకుండా, అర్హులైన పేద విద్యార్థులకు కూడా ఉచిత వసతి, భోజనం మరియు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఆలయంలో పనిచేసే వేలాది మంది సేవకులకు మరియు వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా, పిల్లల చదువుల కోసం స్కాలర్‌షిప్‌లు మరియు సొంత ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయాన్ని ఆలయ నిధి నుంచి అందిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న మహాప్రసాదం వంటశాల పూర్తిగా మట్టి పాత్రలనే ఉపయోగిస్తుంది. ఈ సాంప్రదాయ వంటశాల నిర్వహణ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, పర్యావరణ హితమైన పద్ధతులను పాటిస్తోంది.

ఆలయాల గోల్డ్ మానిటైజేషన్: బంగారం వడ్డీతోనే సేవ!

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఆలయాలకు వచ్చే బంగారాన్ని నిల్వ ఉంచకుండా ప్రభుత్వ రక్షణలో ఉంచుతారు. విరాళంగా వచ్చిన బంగారాన్ని ప్రభుత్వ మింట్ కి పంపిస్తారు. అక్కడ మలినాలను తొలగించి 99.9% స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లుగా మారుస్తారు. ఈ బంగారాన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' కింద డిపాజిట్ చేస్తారు. దీనిపై బ్యాంకులే 2.25% నుంచి 2.50% వరకు వార్షిక వడ్డీని చెల్లిస్తాయి. ఈ వడ్డీ రూపంలో వచ్చే కోట్లాది రూపాయలను ఆలయాలు తమ సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాయి.

గతంతో పోలిస్తే ఇప్పుడు దేవాలయాలు మరింత పారదర్శకంగా ఉంటున్నాయి. భక్తులు ఇచ్చే విరాళం కేవలం హుండీకి మాత్రమే పరిమితం కాకుండా, ఒక నిరుపేద చిన్నారి గుండె ఆపరేషన్‌కో లేదా ఒక గ్రామీణ విద్యార్థి చదువుకో ఉపయోగపడుతోంది. ఇది భారతీయ ఆధ్యాత్మికత మరియు సామాజిక బాధ్యతకు ఒక గొప్ప నిదర్శనం.