ప్రపంచంలోని టాప్ 10 ధనికుల జాబితా ఎప్పుడూ మారుతూ ఉంటుంది, ఎందుకంటే వారి సంపద ఎక్కువగా స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. మార్చి 2026 నాటికి ఉన్న తాజా గణాంకాల ప్రకారం ఫోర్బ్స్ మరియు బ్లూమ్‌బెర్గ్ నివేదికల ఆధారంగా ప్రపంచంలోని టాప్ 10 ధనికులలో వరుసగా ఇలాన్ మస్క్, లారీ పేజ్ , జెఫ్ బెజోస్ , సెర్గీ బ్రిన్ , మార్క్ జుకర్‌బర్గ్ , లారీ ఎల్లిసన్ , బెర్నార్డ్ ఆర్నాల్డ్ , జెన్సన్ హువాంగ్ , వారెన్ బఫెట్ , అమాన్సియో ఒర్టెగా ఉన్నారు. ఇదే సందర్భంలో దేశంలో ప్రముఖ దేవాలయాల ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఎందుకంటే బంగారం ధర పెరగడం ప్రధాన కారణం అంటున్నారు అధికారులు. ప్రస్తుతం భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల సంపద మొత్తం కలిపితే అక్షరాల 9 లక్షల కోట్ల వరకు ఉంటుందంటే ఆశ్చర్యమే ! భక్తుల విశ్వాసం, విరాళాలు, పురాతన నిధులు మొత్తం కలిపి పలు ఆలయాలను ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాయి. మొత్తం సంపద గత మార్చి 2024 తర్వాత నుండి ఇప్పటి వరకు చాలా పెరిగింది. దీనికి పెద్ద కారణం ఆ సమయంలో బంగారం 10 గ్రాములకు రూ.65 వేల రూపాయలు ఉండగా, ప్రస్తుతం రూ 1.50 లక్షల రూపాయలుకు చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే నంబర్-1 ధనిక ఆలయం. ఇక్కడ సాధారణ రోజుల్లోనే రూ. 4 నుంచి రూ 6 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుంది. ఈ ఏడాది మార్చి 17న ఒక్కరోజే రూ 4.88 కోట్లు వచ్చాయి. ఆలయంలో 11 టన్నులకుపైగా బంగారం నిల్వలు ఉన్నాయి. ఇక బ్యాంకుల్లో పెట్టుబడులపై వచ్చే వడ్డీ కూడా భారీగా ఉంది. తిరుమల కేవలం ఆలయం మాత్రమే కాదు., ఒక భారీ ఆధ్యాత్మిక ఆర్థిక వ్యవస్థ!

కేరళలోని పద్మనాభస్వామి ఆలయం మాత్రం సంపద విషయంలో ప్రపంచాన్నే షాక్‌కు గురి చేస్తుంది. ఆలయం మొత్తం సంపద రూ 2 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా, ఇక్కడ బంగారు విగ్రహాలు, వజ్రాలు, పురాతన నాణేలు, ఇంకా తెరవని రహస్య గదులు ఉన్నాయని చెబుతారు. ఇక్కడి నిధి ఎంత ఉందో ఇప్పటికీ పూర్తి సమాచారం లేదు… ఇదే మిస్టరీ.

టాప్ టెన్ లో వున్నా ఆలయాల గణాంకాలను పరిశిలిస్తే తిరుమలలో రోజుకు రూ. 5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. పద్మనాభస్వామి ఆలయానికి రూ. 2 లక్షల కోట్లు ఆస్తులు ఉండగా ఇకా బోలెడు గుప్తనిధి ఉందని ప్రచారం జరుగుతుంది. పూరి లో ని జగన్నాథ స్వామి కి 60 వేల ఎకరాల భూమి ఉంది. అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ను బంగారంతో నిర్మించారు. శిర్డీ సాయి బాబా ఆలయానికి రోజుకు రూ. 1 కోటి పైగా ఆదాయం వస్తుందట. తరువాత ఆదాయం , ఆస్తుల్లో వరుసగా వైష్ణో దేవి , కాశీ విశ్వనాథ్ , ముంబైలోని సిద్ధివినాయక ఆలయాలు ఉన్నాయి.

ఆశ్చర్యపరిచే నిజాలు:

దేశంలోని ఈ దేవాలయాల్లో బంగారం విలువే రూ4.5 లక్షల కోట్లు ఉంటుందట. నగదు, ఫిక్సేడ్ డిపాజిట్లు రూ 1.4 లక్షల కోట్లు ఉంటే భూములు, భవనాలు విలువ 3.7 లక్షల కోట్లుగా ఉంది. బంగారం ధర పెరగడంతో గత 2 ఏళ్లలోనే సంపద భారీగా పెరిగిందని సంభందిత ఆలయ వర్గాలు చెబుతున్నాయి. తిరుమల ఆదాయం లో 35% పెరుగుదల కనిపిస్తే , పద్మనాభస్వామి టెంపుల్ ఆస్తుల విలువ దాదాపు రెట్టింపు అయింది. ఇక పూరి జగన్నాథ స్వామి ఆలయ ఆదాయం లో 50% పెరుగుదల కనిపిస్తుంది. దేవాలయ సంపద , ఈ ఆలయాల ఆదాయం అన్నదానం, విద్య, వైద్య సేవలు, దాతృత్వ కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు.

దేవాలయాల ఆదాయంపై ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుందా? అసలు నిజం ఇదీ!

దేవాలయాల ఆదాయంపై ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోంది, కానీ ఇతర మతపరమైన సంస్థల నుంచి వసూలు చేయడం లేదు" అని ఇటివల కాలంలో చాల పెద్ద చర్చ జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? భారత ఆదాయపు పన్ను చట్టాలు ఏం చెబుతున్నాయి? ఒకసారి వివరంగా చూద్దాం.

ఆదాయపు పన్ను చట్టం ఏమంటోంది?

భారత ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 11 , 12 ప్రకారం, దేవాలయాలు, మసీదులు, చర్చీలు లేదా గురుద్వారాలు వంటి ఏ మతపరమైన సంస్థలైనా సరే, అవి "పబ్లిక్ రిలీజియస్ ట్రస్ట్" గా నమోదైతే వాటికి ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. అయితే ఆ సంస్థకు వచ్చిన ఆదాయంలో కనీసం 85% మొత్తాన్ని అదే మతపరమైన కార్యక్రమాలకు లేదా సామాజిక సేవలకు అంటే స్కూళ్లు, ఆసుపత్రులు వంటి వాటి కోసం ఖర్చు చేయాలి. మిగిలిన 15% మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవచ్చు. దీనికి ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు.

విరాళాలపై మినహాయింపు ఉంటుందా?

ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది. ఒకవేళ దేవాలయానికి భారీ మొత్తంలో గుప్త విరాళాలు అంటే - ఎవరు ఇచ్చారో పేరు, అడ్రస్ తెలియని కానుకలు - వస్తే, వాటిపై కొన్ని సందర్భాల్లో 30% పన్ను విధిస్తారు. అయితే, కేవలం మతపరమైన పనులకే అంకితమైన ట్రస్టులకు ఈ 30% పన్ను నుంచి కూడా మినహాయింపు ఉంటుంది.

ప్రభుత్వం డబ్బులు తీసుకుంటుందన్నది నిజమేనా?

చాలా మంది కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను రూపంలో దేవాలయాల డబ్బు తీసుకుంటుందని భావిస్తారు. కానీ,ఆదాయపు పన్ను శాఖ నేరుగా హుండీ ఆదాయాన్ని తీసుకోదు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో దేవాదాయ శాఖ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పెద్ద దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఆలయాల నిర్వహణ, ఆడిటింగ్ మరియు అధికారుల జీతభత్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయ ఆదాయం నుండి దాదాపు 5% నుండి 15% వరకు వసూలు చేస్తాయి. ఈ డబ్బును ప్రభుత్వం తన సొంత అవసరాలకు కాకుండా, మళ్ళీ దేవాలయాల పరిపాలన కోసమే ఉపయోగిస్తుంది.

వ్యాపార ఆదాయంపై పన్ను ఉంటుందా?

దేవాలయ ప్రాంగణంలో దుకాణాలను అద్దెకు ఇవ్వడం, కళ్యాణ మండపాలను వాణిజ్య పరంగా నడపడం ద్వారా లాభాలు పొందుతుంటే, ఆ ఆదాయంపై పన్ను వర్తించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఆ ఆదాయం ధార్మిక పనులకు కాకుండా కేవలం లాభాపేక్షతో ఉంటే అది పన్ను పరిధిలోకి వస్తుంది. నిబంధనలు పాటిస్తే కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను రూపంలో దేవాలయాల ఆదాయాన్ని వసూలు చేయదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయాల నిర్వహణ కోసం కొంత మొత్తాన్ని సర్వీస్ ఛార్జీల రూపంలో తీసుకుంటాయి. ఇది కేవలం హిందూ దేవాలయాలకే కాదు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ మతపరమైన సంస్థకైనా వర్తిస్తుంది.

నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియా వార్తలను నమ్మకండి. చట్టపరంగా అన్ని మతపరమైన ట్రస్టులకు సమానమైన మినహాయింపులు ఉన్నాయి.

ఇంత భారీ సంపదను సమాజ అభివృద్ధికి ఇంకా ఎక్కువగా వినియోగించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Disclaimer : ఈ కథనంలో పేర్కొన్న దేవాలయాల సంపద, ఆదాయానికి సంబంధించిన గణాంకాలు వివిధ వార్తా సంస్థలు, ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ మరియు దేవాలయాల వార్షిక నివేదికల ద్వారా సేకరించిన ప్రాథమిక అంచనాలు మాత్రమే. బంగారం ధరలు మరియు మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ఈ విలువలు ఎప్పటికప్పుడు మారవచ్చు. పన్ను నిబంధనలకు సంబంధించిన సమాచారం భారత ఆదాయపు పన్ను చట్టం మరియు వివిధ రాష్ట్రాల దేవాదాయ శాఖల నిబంధనల విశ్లేషణపై ఆధారపడి ఉంది. పాఠకులు ఏదైనా ఆర్థిక లేదా చట్టపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత అధికారిక వర్గాలను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.