హైదరాబాద్ , ఏప్రియల్ 23 : ఢిల్లీలో చోటుచేసుకున్న ఓ దారుణ హత్యోదంతం దేశ రాజధానిని ఉలిక్కిపడేలా చేసింది. అమర్ కాలనీలో నివసించే ఒక ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై జరిగిన ఈ అమానుష ఘటన, భద్రతా వలయాలను దాటుకుని మరీ నేరస్థులు ఎంతటి ఘాతుకానికి ఒడిగట్టగలరో చాటిచెబుతోంది. 22 ఏళ్ల వయసున్న ఆ యువతి, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత ఆశయాలతో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే, ఆ ఆశయాలను, ఆమె నిండు ప్రాణాన్ని ఒక కిరాతకుడు మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో చిదిమేశాడు. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన 19 ఏళ్ల రాహుల్ మీనాను పోలీసులు అరెస్ట్ చేయగా, దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

ఢిల్లీ అమర్ కాలనీలో ఐఆర్ఎస్ అధికారి కూతురి హత్య

ఆగ్నేయ ఢిల్లీలోని అత్యంత భద్రత కలిగిన అమర్ కాలనీలో ఈ ఘోరం జరిగింది. బుధవారం ఉదయం యువతి తల్లిదండ్రులు దినచర్యలో భాగంగా జిమ్‌కు వెళ్లిన సమయంలో, నిందితుడు రాహుల్ మీనా ఇంట్లోకి చొరబడ్డాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో నిందితుడు భవనం వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డయ్యింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని లొంగదీసుకునే క్రమంలో ఆమె తలపై బరువైన వస్తువుతో దాడి చేసిన నిందితుడు, ఆపై ఆమెను తీవ్రంగా హింసించి హత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. చివరకు మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌ను ఆమె గొంతుకు బిగించి ఊపిరి ఆగిపోయే వరకు వదల్లేదు. తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

పనిమనిషి చేతిలో ఐఆర్ఎస్ అధికారి కూతురు మృతి

ఈ హత్య వెనుక నిందితుడి ప్రణాళికాబద్ధమైన కుట్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాహుల్ మీనా గత ఏడెనిమిది నెలలుగా అదే ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పనిచేసేవాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల దినచర్య, ఇంటి భద్రతా ఏర్పాట్లపై అతనికి పూర్తి అవగాహన ఏర్పడింది. సదరు భవనానికి అత్యున్నత స్థాయి భద్రత ఉంది. లిఫ్ట్ నుంచి ఇంటి లోపలికి వెళ్లాలంటే కనీసం నాలుగు లాకులు దాటాలి. అందులో మూడు డిజిటల్ పాస్‌కోడ్‌లు, ఒకటి కీ ద్వారా పనిచేస్తాయి. నిందితుడు గతంలో అక్కడ పనిచేయడం వల్ల ఆ పాస్‌కోడ్‌ల పై అతనికి అవగాహన ఉంది. అందుకే అతను ఇంట్లోకి సులభంగా, సునాయాసంగా ఇంట్లోకి ప్రవేశించగలిగాడు. నెల క్రితం ఇంట్లో డబ్బులు దొంగలిస్తూ పట్టుబడటంతో అతడిని పనిలో నుంచి తొలగించారు. ఆ కక్షతో పాటు, ఆన్‌లైన్ గేమింగ్‌ వ్యసనం వల్ల పెరిగిన అప్పులు తీర్చుకోవడానికి దోపిడీ చేయాలనే ఉద్దేశంతోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ద్వారకలో అరెస్ట్: దొరికిన కీలక ఆధారాలు

హత్య అనంతరం నిందితుడు ఇంటిని లూటీ చేసి పరారయ్యాడు. నేరం జరిగిన సమయంలో అతడి దుస్తులపై రక్తపు మరకలు అంటడంతో, వాటిని అక్కడే వదిలేసి ఇంట్లో ఉన్న బాధితురాలి తండ్రికి సంబంధించిన బట్టలు, బూట్లు వేసుకుని తెలివిగా తప్పించుకున్నాడు. అయితే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ కెమెరాల సాయంతో గాలించి ద్వారకలోని ఒక హోటల్‌లో తలదాచుకున్న రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఆన్‌లైన్ లూడో వంటి గేమ్‌లు ఆడే అలవాటు ఉందని, అందులో భారీగా డబ్బులు పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయాడని విచారణలో తేలింది.

అల్వార్‌లో ఘాతుకం: ఆన్‌లైన్ లూడో పరిచయమే శాపమై..

ఈ కేసులో అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఢిల్లీలో హత్య చేయడానికి కేవలం కొన్ని గంటల ముందే నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో మరో వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాహుల్ మీనా స్వగ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఆన్‌లైన్ లూడో ఆడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయంతోనే సదరు వ్యక్తి ఇంట్లో లేని సమయం చూసి, అతడి భార్యపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో అల్వార్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజస్థాన్‌లో నేరం చేసి నేరుగా ఢిల్లీకి వచ్చి ఈ ఐఆర్ఎస్ అధికారి కుమార్తెను బలితీసుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ, అల్వార్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి సహకరించిన వారెవరైనా ఉన్నారా అనే కోణంలో అతడి తండ్రిని, స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒక యువ ఇంజనీర్, సివిల్ సర్వెంట్ కావాలన్న కలలతో ఉన్న యువతి ఇలా ఒక కిరాతకుడి చేతిలో బలికావడం ఆందోళన కలిగిస్తోంది.