అమరావతి, ఏప్రిల్ 10:మూడు దశాబ్దాల క్రితం హైటెక్ సిటీ పునాదులతో ఐటీ విప్లవానికి నాంది పలికిన దార్శనికత.. ఇప్పుడు క్వాంటం యుగంలోకి అడుగుపెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ రంగానికి దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ క్వాంటం మ్యాప్‌లో అజేయ శక్తిగా నిలబెట్టేందుకు సిద్ధమయ్యారు. కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకుండా, అత్యంత సంక్లిష్టమైన 'డీప్ టెక్' రంగంలో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చే బృహత్తర యజ్ఞానికి అమరావతి వేదిక కాబోతోంది. ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా అమరావతిలో దేశంలోనే తొలి 'క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీ'ని ప్రారంభించనుండటం ఒక చారిత్రాత్మక ఘట్టం.

భారతదేశ సాంకేతిక చరిత్రలో సరికొత్త అధ్యాయం ఏప్రిల్ 14న ప్రారంభం కానుంది. గన్నవరంలోని మేధా టవర్స్, రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఇప్పుడు క్వాంటం పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతున్నాయి. 'అమరావతి 1Q' మరియు 'అమరావతి 1S' పేరిట ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్ బెడ్లు కేవలం యంత్రాలు మాత్రమే కావు, అవి దేశీయ మేధస్సుకు నిదర్శనాలు. ముఖ్యంగా మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన మినీ క్వాంటం కంప్యూటింగ్ టెస్టింగ్ ఫెసిలిటీ హార్డ్‌వేర్ తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. మరోవైపు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 'ఓపెన్ యాక్సెస్' ప్రాతిపదికన ఏర్పాటు చేసిన కేంద్రం విద్యార్థులు, పరిశోధకులకు క్వాంటం కంప్యూటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించేలా, ప్రయోగాలు చేసేలా వెసులుబాటు కల్పిస్తోంది. క్వాంటం కంప్యూటర్లు అత్యంత క్లిష్టమైన మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేసే వాతావరణాన్ని ఇక్కడ కల్పించడం విశేషం.

హార్డ్‌వేర్ తయారీలో స్వయం సమృద్ధి: సర్టిఫికేషన్ హబ్‌గా అమరావతి

భారత్ ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, హార్డ్‌వేర్ విషయంలో విదేశాలపై ఆధారపడుతోంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు చంద్రబాబు నాయుడు సర్కారు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. క్వాంటం హార్డ్‌వేర్ నెట్‌వర్క్‌కు అమరావతిని ఒక 'యాంకర్ నోడ్'గా మార్చడమే లక్ష్యంగా ఈ టెస్టింగ్ ఫెసిలిటీలు పనిచేయనున్నాయి. క్రయోజెనిక్స్, ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ మరియు క్వాంటం గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ రంగాల్లో తయారయ్యే పరికరాలను ఇక్కడ పరీక్షించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫికేషన్ ఇస్తారు. ఇటీవలే 30కి పైగా అంతర్జాతీయ హార్డ్‌వేర్ తయారీ సంస్థలతో నిర్వహించిన సమావేశం, అమరావతిని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే దిశగా వేసిన బలమైన అడుగు. దీనివల్ల విదేశీ సంస్థలు తమ పరికరాల నాణ్యతను పరీక్షించుకోవడానికి అమరావతి వైపు చూసే అవకాశం ఏర్పడింది.

క్వాంటం వ్యాలీ: ఐదు అగ్రశ్రేణి హబ్‌లలో ఒకటిగా లక్ష్యం

అమరావతిని ప్రపంచంలోని మొదటి ఐదు క్వాంటం హబ్‌లలో ఒకటిగా నిలపాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం ఇప్పటికే 'క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025-30'ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. రాజధానిలోని ఉద్దండరాయుని పాలెం వద్ద 50 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఏక్యూఏసీ (AQAC) కేంద్రం ఈ క్వాంటం వ్యాలీకి గుండెకాయ వంటిది. ఐబీఎం భాగస్వామ్యంతో ఇక్కడ అత్యంత శక్తివంతమైన 133 క్యూబిట్, 5కే గేట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుంది. ఐబీఎంతో పాటు టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి స్వదేశీ దిగ్గజాలు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వంటి విద్యాసంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావడం దీని ప్రాముఖ్యతను చాటిచెబుతోంది. ఈ వ్యాలీ కేవలం ఒక భవన సముదాయం కాదు, ఇది భవిష్యత్తు తరాల మేధో సంపత్తికి నిలయం.

పరిశోధనల అనంత ఫలాలు: ఔషధాల నుంచి రక్షణ రంగం వరకు

క్వాంటం టెక్నాలజీ వల్ల సామాన్యుడి జీవితంలో రాబోయే మార్పులు ఊహకందనివి. అమరావతి క్వాంటం కేంద్రం ద్వారా నూతన ఔషధాల ఆవిష్కరణ ప్రక్రియలో వేగం పెరగనుంది. గతంలో పదేళ్లు పట్టే పరిశోధనలు, ఈ కంప్యూటర్ల సాయంతో కేవలం నెలల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే సంక్లిష్ట వ్యాధులకు వ్యాక్సిన్ల తయారీ, వాతావరణ మార్పుల ముందస్తు అంచనా, సెమీ కండక్టర్ల డిజైనింగ్, రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాల్లో ఈ టెక్నాలజీ కీలకం కానుంది. డేటా అనలటిక్స్ ద్వారా పాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు ఇక్కడ జరిగే ఆవిష్కరణలు ఉపయోగపడతాయి. ఇప్పటికే 80కి పైగా అంతర్జాతీయ సంస్థలు అమరావతి కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇక్కడి సామర్థ్యానికి నిదర్శనం.

లక్షలాది మందికి శిక్షణ: మానవ వనరుల విప్లవం

సాంకేతికత ఎంత ఉన్నా, దానిని నడిపే నిపుణులు ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. ఐఐటీ చెన్నై, వైసర్ వంటి అగ్రశ్రేణి సంస్థల భాగస్వామ్యంతో క్వాంటం అల్గారిథమ్స్‌లో నిపుణులను తీర్చిదిద్దే ప్రక్రియ ఇప్పటికే ఊపందుకుంది. ప్రస్తుతం 60 వేల మందికి పైగా శిక్షణ పొందుతుండగా, వచ్చే ఐదేళ్లలో ఏకంగా 45 లక్షల మందిని క్వాంటం నిపుణులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచానికి అవసరమైన 'క్వాంటం వర్క్‌ఫోర్స్'ను సరఫరా చేసే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 14న ప్రారంభం కానున్న ఈ ప్రస్థానం, నవ్యాంధ్రను గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా నిలబెట్టడంలో మైలురాయిగా నిలిచిపోనుంది.