బెంగుళూరు బైడరహళ్లిలో దారుణ ఘటన. తనను పట్టించుకోవడం లేదన్న కారణంతో ప్రియుడికి కళ్లకు గంతలు కట్టి, కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన ప్రేయసి. ఈ షాకింగ్ ఉదంతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బెంగుళూరు, ఏప్రియల్ 21 : ప్రేమలో గెలుపు కోసం ప్రాణాలివ్వడమో, ప్రాణాలు తీయడమో చూస్తుంటాం. కానీ, అదే ప్రేమలో కలిగిన అపనమ్మకం, భాగస్వామి తనను పట్టించుకోవట్లేదనే చిన్నపాటి అసహనం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బెంగుళూరులోని బైడరహళ్లిలో మంగళవారం జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు నగరంలోనే సంచలనం సృష్టిస్తోంది. కొత్తగా ప్రపోజ్ చేస్తానని నమ్మబలికి, కళ్లకు గంతలు కట్టి మరీ తన ప్రియుడిని సజీవ దహనం చేసిన ప్రేమ అనే యువతి ఉదంతం మానవ సంబంధాలు బలహీన పడుతున్న తీరుకు పెడదోవ పడుతున్న ప్రేమకు అద్దం పడుతోంది.
ఆవేదనతో మొదలై... ఆవేగంతో ముగిసి...
తుమకూరుకు చెందిన కిరణ్ (27), ప్రేమ ఆర్‌లు బసవేశ్వరనగర్‌లోని ఒక ప్రైవేట్ మొబైల్ నెట్‌వర్క్ సంస్థలో సహోద్యోగులు. ఇద్దరూ గతం మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. గతంలోనే తమ భాగస్వాములతో విడిపోయారు. అంతా సాఫీగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో, కిరణ్ తనను దూరం పెడుతున్నాడనే అనుమానం ప్రేమ మనసులో బలపడింది. ఇదే ఆవేదన ఆమెను నేరస్తురాలిని చేసింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తన ఇంటికి రావాలని కిరణ్‌ను కోరిన ప్రేమ, తన దగ్గర ఒక 'సర్ ప్రైజ్' ఉందంటూ అతన్ని నమ్మించింది. తీరా కిరణ్ ఇంటికి రాగానే, పక్కా ప్లాన్ ప్రకారం నైలాన్ తాడుతో చేతులు కట్టేసి, కళ్లకు శాలువాతో గంతలు కట్టి, ఏమీ తెలియనట్లు కూర్చోబెట్టింది. అనంతరం పెట్రోల్, కిరోసిన్ కలిపిన మిశ్రమాన్ని అతనిపై పోసి నిప్పంటించడంతో, కిరణ్ అక్కడికక్కడే కన్నుమూశాడు.
సంబంధాల మధ్య వైఫల్యం.. అనుమానాల ఊబిలో ప్రేమ
ఈ ఘటన నేటి సమాజంలో మనుషుల మధ్య పెరుగుతున్న సంబంధాల వైఫల్యానికి, సహన రాహిత్యానికి నిదర్శనం. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే ఓపిక లేకపోవడం, చిన్నపాటి అపార్థాలు, అనుమానాలు ముదిరితే ఎంతటి ఘోరానికి దారితీస్తాయో ఈ ఘటన కళ్లకు కట్టింది. "తనను దూరం పెడుతున్నాడు, తనకి అటెన్షన్ ఇవ్వట్లేదు" అన్న కారణంతోనే ప్రేమ ఈ దారుణానికి ఒడిగట్టడం విచారకరం. ప్రియుడిని చంపిన తర్వాత, తాను వాష్‌రూమ్‌లో ఉన్నానని, ఆత్మహత్య అని నమ్మించేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. పైగా, ఈ దారుణాన్ని ఆమె తన ఫోన్‌లో చిత్రీకరించినట్లు ప్రచారం సాగుతుండటం సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
పొరుగువారికి కూడా అనుమానం రాకుండా...
ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు, ఏదో గ్యాస్ సిలిండర్ పేలి ఉంటుందని మొదట భావించారు. రెండో అంతస్తుకు వెళ్లి తలుపు తట్టగా, జుట్టు పాక్షికంగా కాలిన గాయాలతో గందరగోళంగా ఉన్న ప్రేమ బయటకు వచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడం, తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నా, ఆమె ఈ ఘోరానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకం సడలి, ఇలా దారుణాలకు దారి తీస్తున్న నేటి ప్రేమ వ్యవహారాలు యువతకు ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి.