భారతీయ రైల్వే అంటే ఒకప్పుడు కేవలం కిక్కిరిసిన బోగీలు, మురికిగా ఉండే ప్లాట్‌ఫారమ్‌లు, అనిశ్చితంగా సాగే ప్రయాణాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ, కాలం మారుతోంది. ప్రయాణీకుల సౌకర్యమే పరమావధిగా ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో పట్టాలెక్కుతున్న సరికొత్త టెక్నాలజీ భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తోంది. రద్దీని నియంత్రించే శాస్త్రీయ పద్ధతుల నుంచి, ప్రాణ రక్షణ కల్పించే ‘కవచ్’ వరకు.. వేగాన్ని పెంచే ‘బుల్లెట్ రైలు’ నుంచి ‘వందే భారత్’ వరకు.. ఇప్పుడు భారతీయ రైల్వేలు ఒక సరికొత్త పరివర్తన దశలో ఉన్నాయి.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 76 ప్రధాన రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, రద్దీ సమయాల్లో ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా భారీ కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసింది.

ప్లాట్‌ఫారమ్‌లపై ఊపిరి పీల్చుకునేలా ‘హోల్డింగ్ ఏరియాలు’

సాధారణంగా పండుగలు, సెలవుల సమయంలో ప్లాట్‌ఫారమ్‌లపై వేలాది మంది ప్రయాణీకులు ఒకేసారి చేరడం వల్ల తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉంటుంది. దీనిని అధిగమించడానికి రైల్వే శాఖ వినూత్నమైన ‘శాశ్వత హోల్డింగ్ ఏరియా’ విధానాన్ని ప్రవేశపెట్టింది. స్టేషన్ వెలుపల విమానాశ్రయాల తరహాలో ఉండే ఈ హోల్డింగ్ ఏరియాలలో సీటింగ్, స్వచ్ఛమైన ఆర్‌ఓ తాగునీరు, ఆధునిక మరుగుదొడ్లు, ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే బోర్డులు మరియు అదనపు టికెట్ కౌంటర్లు ఉంటాయి. కన్ఫర్మ్ టికెట్ ఉన్న వారిని మాత్రమే రైలు వచ్చే సమయానికి ప్లాట్‌ఫారమ్‌పైకి అనుమతించే ‘యాక్సెస్ కంట్రోల్’ వ్యవస్థను ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇప్పటికే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ వ్యవస్థ విజయవంతంగా అమలవుతూ రద్దీని గణనీయంగా తగ్గిస్తోంది.

ఏఐ కెమెరాల నిఘా.. వార్ రూమ్‌ల పర్యవేక్షణ, కవచ్’ టెక్నాలజీ

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో రైల్వే శాఖ ముందు వరుసలో ఉంది. స్టేషన్లలో రద్దీని ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏ ఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైనా జనం ఎక్కువగా గుమిగూడితే ఇవి వెంటనే అధికారులను అలర్ట్ చేస్తాయి. దీనికి తోడు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు స్టేషన్లలో అన్ని విభాగాల సమన్వయంతో ‘వార్ రూమ్‌లు’ పనిచేస్తాయి. రద్దీని బట్టి టికెట్ల విక్రయాన్ని నియంత్రించే సర్వాధికారాలను స్టేషన్ డైరెక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా క్షేత్రస్థాయిలో పాలన మరింత పటిష్టం కానుంది.

భారతీయ రైల్వే చరిత్రలో అతిపెద్ద భద్రతా సంస్కరణ ‘కవచ్’. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్’ వ్యవస్థ. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు పొరపాటున ఎదురెదురుగా వస్తే, డ్రైవర్ ప్రమేయం లేకుండానే నిర్ణీత దూరంలో రైలును ఆపేయడం దీని ప్రత్యేకత. సిగ్నల్ జంపింగ్ చేసినా, అతి వేగంతో వెళ్తున్నా ఈ వ్యవస్థ రైలును నియంత్రిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే 1,465 కిలోమీటర్ల మేర కవచ్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రెండేళ్లలో ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి అత్యంత రద్దీగా ఉండే రూట్లలో 3,000 కిలోమీటర్ల మేర దీనిని విస్తరించనున్నారు. ఇది పూర్తయితే రైలు ప్రమాదాలనే మాటకు ఇక చోటు ఉండదు.

బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్న అభివృద్ధి

ఒకవైపు భద్రతను పటిష్టం చేస్తూనే, మరోవైపు వేగంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న దేశపు మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు కోసం జపాన్ కు చెందిన ‘షింకాన్సెన్’ టెక్నాలజీని వాడుతున్నారు. థానే క్రీక్ వద్ద సముద్రం అడుగున 7 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించడం ఈ ప్రాజెక్టులోనే హైలైట్.

హైదరాబాద్ వాసులకు శుభవార్త ఏమిటంటే, భవిష్యత్తులో హైదరాబాద్-ముంబై మధ్య కూడా బుల్లెట్ రైలు కారిడార్ ప్రతిపాదనలో ఉంది. ఇది పట్టాలెక్కితే భాగ్యనగరం నుంచి ముంబైకి కేవలం 3.5 గంటల్లోనే చేరుకోవచ్చు.

అంతర్జాతీయ ప్రమాణాలు.. స్వదేశీ ముద్ర

విదేశాల్లో రైల్వేలు వేగంపై దృష్టి పెడితే, భారత్ మాత్రం వేగం , అందుబాటు ధర , భద్రత అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. జపాన్ లేదా యూరప్ దేశాల్లో రైలు ప్రయాణం సామాన్యుడికి భారంగా ఉంటుంది, కానీ భారత్‌లో ప్రభుత్వం భారీ సబ్సిడీలు ఇస్తూనే సౌకర్యాలను పెంచుతోంది. ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం ద్వారా స్టేషన్లను షాపింగ్ మాల్స్ మరియు ఫుడ్ కోర్టులతో కూడిన మల్టీ-మోడల్ హబ్‌లుగా మారుస్తున్నారు.

త్వరలో సిబ్బందికి క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడీ కార్డులు, ప్రత్యేక యూనిఫారాలు, వెడల్పాటి ఫుట్-ఓవర్-బ్రిడ్జిలు.. ఇలా ప్రతి చిన్న అంశంలోనూ మార్పు కనిపిస్తోంది. సాంకేతికతను సంప్రదాయానికి జోడిస్తూ భారతీయ రైల్వేలు సాగిస్తున్న ఈ ప్రయాణం, ప్రయాణీకులకు సురక్షితమైన, వేగవంతమైన మరియు గౌరవప్రదమైన అనుభూతిని అందించబోతోంది. ఇకపై రైల్వే ప్రయాణం అంటే భయం కాదు.. అది ఒక గర్వకారణం!