న్యూఢిల్లీ, మే 12 : అమెరికా – ఇరాన్ యుద్ద నేపధ్యంలో ప్రజల అవసరాలు క్రమ క్రమంగా మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇంధన పొదుపు పాటించాలని దేశప్రజలకు సూచించారు, ఈ క్రమంలో ప్రస్తుతం వ్యక్తి గత వాహనాలు వినియోగిస్తున్న వారు ఎలక్ట్రిక్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాగే మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలను కుంటున్నారా ...అయితే ప్రభుత్వం నుంచి అందే రాయితీ గడువు ముగుసి పోయేలోగా త్వరపడండి. ఎందుకంటె ఈ ఏడాది జూలై 31 తరువాత రాయితీ గడువు ముగిసిపోయే అవకాశం ఉంది.

దేశంలో గ్రీన్ మొబిలిటీని పరుగులెత్తించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు ఉద్దేశించిన ‘పీఎం ఈ-డ్రైవ్’ (PM E-DRIVE) పథకం గడువును పొడిగిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (MHI) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 27, 2026 నాటి ఈ సవరించిన మార్గదర్శకాలతో ముఖ్యంగా ఈ-బైకులు మరియు ఈ-రిక్షాల కొనుగోలుదారులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.

ఈ-టూవీలర్లకు జూలై వరకు రాయితీ (PM E-DRIVE extension for e-2W)

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (e-2W) కోసం కేటాయించిన సబ్సిడీ గడువు మార్చి 31, 2026తో ముగియాల్సి ఉండగా, దానిని మరో నాలుగు నెలల పాటు పొడిగించారు. తాజా నిర్ణయంతో జూలై 31, 2026 వరకు రిజిస్టర్ అయ్యే ఈ-బైకులకు ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయి. పెట్రోల్ ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఈ నిర్ణయం ఒక గొప్ప వరంగా మారనుంది. విక్రయ లక్ష్యాలను కూడా ప్రభుత్వం గతంలో ఉన్న 14 లక్షల నుండి 24.8 లక్షలకు భారీగా పెంచడం గమనార్హం.

ఈ-రిక్షాలకు 2028 వరకు బంపర్ ఆఫర్ (EV subsidies for e-rickshaws till 2028)

ప్రజా రవాణా మరియు చిన్న తరహా సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ-రిక్షాలు (e-Rickshaw), ఈ-కార్టులకు (e-Cart) ప్రభుత్వం దీర్ఘకాలిక భరోసా కల్పించింది. వీటి సబ్సిడీ గడువును ఏకంగా మార్చి 31, 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎల్-5 (L5) కేటగిరీకి చెందిన ఈ-త్రీవీలర్ల రాయితీ విండో ఇప్పటికే డిసెంబర్ 2025లో ముగిసినందున, వాటి విషయంలో ఎటువంటి మార్పు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

పెరిగిన విక్రయ లక్ష్యాలు మరియు బడ్జెట్ కేటాయింపులు

మొత్తం రూ. 10,900 కోట్ల బడ్జెట్‌తో నడుస్తున్న ఈ పథకం కింద మరిన్ని వాహనాలకు చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • ఈ-టూవీలర్ల లక్ష్యం: 24,79,120 యూనిట్లు.

  • ఈ-రిక్షాల లక్ష్యం: 39,034 యూనిట్లు.

జనవరి 2026 నాటి గణాంకాల ప్రకారం, ఇప్పటికే 22 లక్షలకు పైగా వాహనాలు ఈ పథకం కింద రోడ్డెక్కాయి. నిధుల లభ్యత ఉన్నంత వరకు మాత్రమే ఈ రాయితీలు అందుబాటులో ఉంటాయని, గడువు తీరక ముందే నిధులు పూర్తయితే పథకం క్లోజ్ అవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది.

ధరల పరిమితి మరియు నిబంధనలు

సబ్సిడీ పొందాలంటే వాహనాల ధరలపై కూడా ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది.

  1. ఈ-టూవీలర్లకు: వాహనం ఎక్స్-ఫ్యాక్టరీ ధర రూ. 1.5 లక్షలకు మించకూడదు.

  2. ఈ-రిక్షాలకు: ఎక్స్-ఫ్యాక్టరీ ధర రూ. 2.5 లక్షల పరిమితిలో ఉండాలి.

  3. బ్యాటరీ ప్రమాణాలు: ఆధునిక సాంకేతికత కలిగిన బ్యాటరీలను వాడే వాహనాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.

దేశవ్యాప్తంగా కాలుష్య రహిత రవాణా వ్యవస్థను నిర్మించడంలో ఈ నిర్ణయం మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో తయారీదారులకు, వినియోగదారులకు ఈ అదనపు గడువు ఒక సువర్ణావకాశంగా పరిగణించవచ్చు.

మరో వైపు భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల (EV) హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈవీ మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడమే లక్ష్యంగా భారీ ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా "పిఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకం - దేశవ్యాప్త ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన" అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సులో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి పాల్గొని, దేశంలో ఎలక్ట్రిక్ విప్లవానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.

కర్ణాటకకు వరాలు.. దేశవ్యాప్తంగా వేలాది ఛార్జింగ్ పాయింట్లు

ఈ సదస్సు వేదికగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రి కీలక ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో రూ.123.26 కోట్ల వ్యయంతో 1,243 ఈవీ ఛార్జర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను ఆమోదించినట్లు ప్రకటించారు. కేవలం కర్ణాటక మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థల (CPSEs) నుంచి అందిన ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపారు. ఇప్పటివరకు మొత్తం రూ. 503.86 కోట్ల వ్యయంతో 4,874 ఈవీ ఛార్జర్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. వీటిలో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పాటు హెచ్‌పిసిఎల్ (HPCL), ఐఓసిఎల్ (IOCL), బిపిసిఎల్ (BPCL) వంటి దిగ్గజ చమురు కంపెనీలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

రూ. 10,900 కోట్ల భారీ నిధులతో ఈవీ ఎకోసిస్టమ్ బలోపేతం

పర్యావరణ హిత రవాణా కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 'పిఎం ఇ-డ్రైవ్' పథకం ద్వారా మొత్తం రూ.10,900 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో కేవలం ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే కాకుండా, వాహన కొనుగోలుదారులకు రాయితీలు కూడా కల్పిస్తున్నారు. ఈ పథకం కింద సుమారు 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ప్రజా రవాణాలో సమూల మార్పుల కోసం రూ. 4,391 కోట్ల వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. రవాణా రంగంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కుల కొనుగోలుకు కూడా ప్రత్యేక నిధులను కేటాయించడం విశేషం.

నెట్ జీరో లక్ష్యం దిశగా భారత్ అడుగులు

ఈవీల ప్రోత్సాహం కోసం కేంద్రం కేవలం పిఎం ఇ-డ్రైవ్ మాత్రమే కాకుండా, పిఎల్ఐ ఆటో (PLI Auto - రూ. 25,938 కోట్లు), పిఎల్ఐ ఏసీసీ (PLI ACC - రూ. 18,100 కోట్లు) వంటి పలు పథకాలను కూడా విజయవంతంగా అమలు చేస్తోంది. అరుదైన భూ ఖనిజాల (Rare Earth Magnets) తయారీ కోసం రూ. 7,280 కోట్లను వెచ్చిస్తోంది. 2070 నాటికి 'నెట్ జీరో' ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ, 'ఆత్మనిర్భర్ భారత్' మరియు 'వికసిత్ భారత్' కలలను సాకారం చేయడంలో ఈ స్వచ్ఛ ఇంధన విప్లవం వెన్నెముకగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది.