భారతదేశ బ్లూ ఎకానమీలో శీతల నీటి మత్స్య సాగు కీలక మైలురాయిగా మారింది. పీఎంఎంఎస్వై (PMMSY) పెట్టుబడులు, హిమాలయాల్లో ట్రౌట్ చేపల ఉత్పత్తి వృద్ధిపై ప్రత్యేక కథనం.
న్యూ ఢిల్లీ, మే 23: భారతదేశ ఆర్థిక ప్రగతికి సరికొత్త దిక్సూచిగా మారుతోంది ‘బ్లూ ఎకానమీ’ (నీలి ఆర్థిక వ్యవస్థ). ఇప్పటివరకు సముద్ర తీర ప్రాంతాలకే పరిమితమనుకున్న మత్స్య సంపద, ఇప్పుడు హిమాలయాల మంచు పాయల్లోనూ, ఎత్తయిన పర్వత శ్రేణుల్లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒకప్పుడు కేవలం సంప్రదాయ జీవనోపాధిగా ఉన్న శీతల నీటి మత్స్య రంగం (Cold Water Fisheries), నేడు శాస్త్రీయ పద్ధతులు, అత్యాధునిక మౌలిక వసతులతో దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా అవతరించింది. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే, గిరిజన, పర్వత ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను మార్చడంలో ఈ రంగం అద్భుతాలు చేస్తోంది.
శీతల నీటి మత్స్య సాగుకు అనుకూల వాతావరణం ఇదే..
మంచు కరిగే పర్వత నదులు, జీవధారలు, సరస్సులు ఈ శీతల నీటి చేపల ఎదుగుదలకు ప్రధాన నిలయాలు. సాధారణంగా 5 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, లీటరుకు 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కరిగిన ఆక్సిజన్, అలాగే 6.5 నుండి 8.0 మధ్య ఉండే పీహెచ్ (pH) విలువలు ఈ రకమైన చేపల సాగుకు అత్యంత అనుకూలం. సుమారు 5.33 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హిమాలయ, ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ, తూర్పు కనుమల కొండ ప్రాంతాలు ఈ సాగుకు వేదికలయ్యాయి. మన దేశంలో దాదాపు 278 రకాల శీతల నీటి చేపల జాతులను గుర్తించడం విశేషం. వీటిలో ప్రత్యేకించి రేన్‌బో ట్రౌట్, గోల్డెన్ మహాషీర్, స్నో ట్రౌట్ వంటి రకాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. 1,500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ట్రౌట్ చేపలు, కొద్దిగా తక్కువ ఎత్తులో మహాషీర్ రకాలు పెరుగుతాయి.
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ట్రౌట్ చేపల ఉత్పత్తి
మత్స్య రంగంలో భారత్ సాధిస్తున్న వృద్ధి గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం చేపల ఉత్పత్తి దాదాపు 197.75 లక్షల టన్నులకు చేరింది. ఇందులో దేశీయ అంతర్గత మత్స్య ఉత్పత్తిలో శీతల నీటి మత్స్య రంగం వాటా 3 శాతానికి చేరడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో శీతల నీటి చేపల వార్షిక ఉత్పత్తి 7,000 మెట్రిక్ టన్నులుగా ఉండగా, అందులో కేవలం ట్రౌట్ చేపల ఉత్పత్తి గత దశాబ్ద కాలంలో 1.8 రెట్లు పెరిగి 6,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఈ ఘనత వెనుక అధునాతన హ్యాచరీలు, రేస్‌వేలు, రీ-సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ (RAS), బయోఫ్లాక్ సాంకేతికత వంటి ఆధునిక మౌలిక సదుపాయాల పాత్ర ఎంతో ఉంది.
శీతల నీటి చేపల సాగులో జమ్మూ కాశ్మీర్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇక్కడి ప్రసిద్ధ కోకర్నాగ్ హ్యాచరీతో పాటు 2,000కు పైగా ప్రైవేట్ ట్రౌట్ యూనిట్ల అండతో 2024-25లో రికార్డు స్థాయిలో 3,010 మెట్రిక్ టన్నుల ట్రౌట్ ఉత్పత్తి సాధించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ 1,739 సాగు కేంద్రాలు, 909 మంది నైపుణ్యం కలిగిన రైతులతో 2025-26 నాటికి 1,673 మెట్రిక్ టన్నుల ట్రౌట్ ఉత్పత్తిని నమోదు చేసింది. ఉత్తరాఖండ్ సైతం "ఉత్తరాఫిష్" (UttaraFish) బ్రాండింగ్‌తో దూసుకుపోతూ పిథోరగఢ్, బాగేశ్వర్, చమోలి జిల్లాల్లోని 2,500 రేస్‌వేల ద్వారా 10,486 టన్నుల మొత్తం చేపల ఉత్పత్తిని సాధించింది. కాగా తీవ్రమైన ప్రతికూల వాతావరణం ఉండే లడఖ్ ప్రాంతం సైతం అధునాతన సాంకేతికతతో 50 మెట్రిక్ టన్నుల మార్కును దాటి, డ్రాస్, చోచుత్ ప్రాంతాల్లో సొంతంగా లక్షకు పైగా చేప పిల్లల (సీడ్) ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం విశేషం.
దక్షిణాది కొండ ప్రాంతాలకూ విస్తరిస్తున్న ఆధునిక సాగు
ఈ విప్లవం కేవలం ఉత్తరాదికే పరిమితం కాలేదు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలు హ్యాచరీలను వేగంగా విస్తరిస్తుండగా, దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు సైతం ఈ రేసులోకి వచ్చాయి. వాయనాడ్, నీలగిరి, ఉత్తర కన్నడ వంటి హిల్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టులుగా ఆర్‌ఏఎస్ (RAS), బయోఫ్లాక్ సాంకేతికతను ఉపయోగించి పర్యావరణ హితంగా చేపల సాగును చేపడుతున్నారు. ఈ పురోగతి ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 23.51 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరగా, 33.78 లక్షల మంది మత్స్యకారులకు బీమా రక్షణ లభించింది.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) తో భారీ పెట్టుబడులు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక పెట్టుబడులు ఈ రంగానికి కొండంత అండగా నిలిచాయి. 2020-26 కాలానికి గానూ ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ (PMMSY) కింద దేశవ్యాప్తంగా రూ. 21,963.48 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, కేవలం శీతల నీటి రాష్ట్రాల కోసమే రూ. 5,638.76 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 5,663 రేస్‌వేలు, 54 ట్రౌట్ హ్యాచరీలు, అధునాతన ఆర్‌ఏఎస్ (RAS) యూనిట్లు, హిమాలయ ప్రాంతాల్లో 4,600 చెరువులు, శీతలీకరణ గిడ్డంగులు, రవాణా వాహనాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరాఖండ్‌కు రూ. 317.25 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ. 155.48 కోట్లు, జమ్మూ కాశ్మీర్‌కు రూ. 149.73 కోట్లు, లడఖ్‌కు రూ. 33.49 కోట్లు లభించాయి. వీటికి తోడు ఫిషరీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (FIDF) కింద మరో రూ. 7,761.78 కోట్ల ప్రాజెక్టులు ఆమోదం పొందాయి.
మత్స్య రంగంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి, విలువ ఆధారిత గొలుసును బలోపేతం చేయడానికి రూ. 6,000 కోట్ల బడ్జెట్‌తో అమలవుతున్న ‘పీఎం-ఎంకెస్సెస్వై’ (PM-MKSSY) పథకం ఎంతో దోహదపడుతోంది. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్, ఉత్తరాఖండ్‌లోని ఉద్దం సింగ్ నగర్, అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో, నాగాలాండ్‌లోని మొకోక్‌చుంగ్ లలో సమగ్ర ఆక్వా పార్కులను (Integrated Aqua Parks) ఏర్పాటు చేశారు. ఇవి అత్యాధునిక ప్రాసెసింగ్, మార్కెటింగ్ హబ్‌లుగా మారుతున్నాయి. అలాగే అనంతనాగ్, పిథోరగఢ్, కులు, కార్గిల్ ప్రాంతాలను ప్రత్యేక శీతల నీటి మత్స్య క్లస్టర్లుగా ప్రకటించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం వచ్చింది.
అంతర్జాతీయ సహకారం.. డిజిటల్ టెక్నాలజీతో సరికొత్త ఆవిష్కరణలు
ప్రస్తుత డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ రంగంలో స్టార్టప్‌ల జోరు పెరిగింది. డ్రోన్ల ద్వారా చేపల రవాణా, స్మార్ట్ ఫీడింగ్ సిస్టమ్స్, డిజిటల్ ట్రేసిబిలిటీ ప్లాట్‌ఫారమ్‌లు, నేరుగా మార్కెట్‌కు అనుసంధానించే మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. మహిళా స్వయం సహాయక సంఘాలు (SHG), సహకార సంఘాలు ఇందులో చురుగ్గా పాల్గొంటున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మోడల్ గైడ్‌లైన్స్ ఫర్ కోల్డ్ వాటర్ ఫిషరీస్ డెవలప్‌మెంట్, 2026’ మార్గదర్శకాలను విడుదల చేసింది.
మరోవైపు, నార్వే, ఐస్‌లాండ్ వంటి అంతర్జాతీయ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. హ్యాచరీల నిర్వహణ, వ్యాధి నియంత్రణ, ఎగుమతి వ్యూహాలలో ఆయా దేశాల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మన రైతులు అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం పర్వత వాగులకే పరిమితమైన శీతల నీటి మత్స్య సాగు, నేడు శాస్త్రీయ ఆవిష్కరణలు, గ్రామీణ పారిశ్రామికీకరణ కలయికతో భారతదేశ 'బ్లూ ఎకానమీ'కి తిరుగులేని శక్తీగా నిలుస్తోంది.
Keywords: Cold Water Fisheries India, Blue Economy India, Trout Farming J&K, PMMSY cold water fisheries, Aquaculture in Himalayas, Rainbow Trout production India, Biofloc and RAS in hilly regions, Integrated Aqua Parks India.