ఆగ్రాలో జరిగిన లోకేంద్ర హత్యాకాంత సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అక్రమ సంబంధం, ఆస్తి కోసం తన భర్తను ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేయించిన ఇల్లాలు. 'దృశ్యం' సినిమా చూసి సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకున్నా, పోలీసుల చాకచక్యానికి ఎలా దొరికిపోయారో ఈ కథనంలో చదవండి.
నేర పరిశోధన నేపథ్యంలో వచ్చిన 'దృశ్యం' సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో, నేరగాళ్లకు అంతగా 'పాఠాలు' నేర్పుతోందా? అంటే అవుననే అంటోంది ఆగ్రాలో వెలుగు చూసిన ఘటన. వివాహేతర సంబంధం హత్య కు ప్రధాన కారణం అయినప్పటికీ ఈ కేసులో నిందితులు తాము 'దృశ్యం' హీరో కంటే తెలివైన వాళ్ళమని భావించారు. ఒక ఇల్లాలు తన ప్రియుడు తో కలసి కట్టుకున్నవాడిని అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేయించింది. కానీ, నేరం ఎంత పక్కాగా చేసినా ఏదో ఒక చిన్న సాక్ష్యం వదిలేస్తారన్న సూత్రాన్ని వారు మర్చిపోయారు.
ఉత్తరప్రదేశ్ లోని సయా నివాసి లోకేంద్ర (29) వృత్తిరీత్యా కూలీ పనులు చేసుకుంటూ కుతుమ్భంతో కలిసి జీవిస్తున్నాడు. అతడి భార్య కు పొరుగున ఉండే మహేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. మహేష్ కేవలం లోకేంద్ర భార్యతో సంబంధానికే పరిమితం కాలేదు, లోకేంద్రకు ఉన్న 1.6 ఎకరాల భూమిపై కూడా కన్నేశాడు. ఆ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మగా వచ్చిన సుమారు రూ. 4.50 లక్షలను లోకేంద్ర భార్య తన వద్దే ఉంచుకుంది. ఆ డబ్బును విచ్చలవిడిగా మహేష్‌తో కలిసి ఖర్చు చేసేది. ఈ వ్యవహారం లోకేంద్రకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తన భార్య పరాయి వ్యక్తితో సాగిస్తున్న అక్రమ సంబంధాన్ని గ్రామస్తులకు, బంధువులకు చెప్తానని లోకేంద్ర హెచ్చరించాడు. ఇదే అతనికి శాపంగా మారింది.
స్క్రీన్ ప్లే అదిరింది.. కానీ!
తమ దారికి అడ్డుగా ఉన్న లోకేంద్రను వదిలించుకోవాలని మహేష్, లోకేంద్ర భార్య పథకం పన్నారు. దీనికోసం మహేష్ 'దృశ్యం' సినిమాను అనేకమార్లు చూశాడు. పోలీసులకు దొరక్కుండా సాక్ష్యాధారాలను ఎలా తుడిచిపెట్టాలో ఆ సినిమా చూసి నేర్చుకున్నానని నిందితుడు పోలీసుల విచారణలో స్వయంగా అంగీకరించడం సంచలనంగా మారింది.ఈనెల 1 బుధవారం ఉదయం లోకేంద్ర ఇంటి నుండి బయటకు రాగానే, మహేష్ తన స్నేహితుడు ధర్మవీర్‌తో కలిసి పథకం ప్రకారం అతడిని కలిశాడు. లోకేంద్రకు మద్యం తాగించే సాకుతో ఒక నిర్మానుష్య పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ అతిగా మద్యం తాగించి స్పృహ కోల్పోయేలా చేశారు. మద్యం మత్తులో ఉన్న లోకేంద్ర గొంతును మహేష్, ధర్మవీర్ నులిమారు. లోకేంద్ర చనిపోయాడని భావించినప్పటికీ, అతను కేవలం స్పృహ మాత్రమే కోల్పోయాడు. అయితే లోకేంద్ర ఇంకా బతికే ఉన్నాడని గ్రహించిన నిందితులు, తమ వద్ద ఉన్న మద్యాన్ని అతడిపై పోసి నిప్పు పెట్టారు. అది సరిపోకపోవడంతో, పక్కనే ఉన్న గోధుమ గడ్డిని లోకేంద్ర శరీరంపై వేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. లోకేంద్ర బ్రతికుండగానే మంటల్లో కాలి ప్రాణాలు విడిచాడు. ఈ ఘాతుకం ఎంత భీభత్సంగా జరిగిందంటే, లోకేంద్ర చనిపోయిన తర్వాత మహేష్ నేరుగా ప్రియురాలు (మృతుడి భార్య) వద్దకు వెళ్లాడు. భర్త చనిపోయాడన్న వార్త విన్నాక ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం కలగలేదు. పైగా, ఇద్దరూ కలిసి పండగ చేసుకున్నారు. ఇంట్లోనే 'పాస్తా' వండుకుని, విందు చేసుకుంటూ తమ దారి క్లియర్ అయిందని సంబరపడ్డారు. శవం పూర్తిగా కాలిపోతుందని, ఆనవాళ్లు దొరకవని వారు భ్రమపడ్డారు.
అయితే హత్య జరిగిన మరుసటి రోజు ఈనెల 2 గురువారం ఉదయం పొలాల్లో సగం కాలిన మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఏడీసీపీ వెస్ట్ జోన్ ఆదిత్య సింగ్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అక్కడ దొరికిన మద్యం సీసాలు, పండ్ల తొక్కలు, ఇతర సామాగ్రిని ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. మద్యం దుకాణం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, లోకేంద్రతో పాటు మహేష్, ధర్మవీర్ ఉన్నట్లు స్పష్టమైంది. మృతుడి భార్య కాల్ డేటాను విశ్లేషించగా, మహేష్‌తో ఆమె నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది. నిందితుల మొబైల్స్‌లో వారు కలిసి దిగిన ఫోటోలు, నిందితుల దుస్తులపై ఉన్న రక్తపు మరకలు పోలీసులకు బలమైన సాక్ష్యాలుగా మారాయి.
పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. "భర్త అడ్డు తొలగించుకోవడానికి నేనే మహేష్‌కు అగ్గిపెట్టె ఇచ్చి పంపాను" అని లోకేంద్ర భార్య వాంగ్మూలం ఇవ్వడం పోలీసులనే విస్మయానికి గురిచేసింది. ఈనెల 3 శుక్రవారం నాడు ముగ్గురు నిందితులను (మృతుడి భార్య, మహేష్, ధర్మవీర్) కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించింది.
సినిమా స్టైల్లో క్రైమ్ చేసి తప్పించుకోవాలనుకున్న ఈ కిలాడీ జంట చివరకు చట్టానికి చిక్కింది. ఆస్తుల కోసం, అక్రమ సంబంధాల కోసం కట్టుకున్నవాడిని కాటికి పంపే ఇలాంటి ఘటనలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని చాటి చెబుతున్నాయి. లోకేంద్ర హత్య కేసులో పోలీసులు చూపిన చొరవ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన తీరు అభినందనీయం.
హంతకులను పట్టించిన 'పాస్తా' విందు.. ఆ ఒక్క ఫోన్ కాల్!
నిందితులు లోకేం
[@portabletext/react] Unknown block type "image", specify a component for it in the `components.types` prop
ద్ర గొంతు నులిమినప్పుడు అతను చనిపోలేదు. కేవలం అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. మహేష్, ధర్మవీర్ అతడిని చనిపోయాడనుకుని పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఆ సెగ తగలగానే లోకేంద్ర కళ్ళు తెరిచాడు, కానీ అప్పటికే ఒళ్ళంతా పెట్రోల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అతను ప్రాణాల కోసం కొట్టుకుంటుంటే.. నిందితులు జాలి చూపకుండా ఎండుగడ్డి వేసి అతను బూడిదయ్యే వరకు అక్కడే నిలబడి చూశారు.
హత్య చేసిన కొద్దిసేపటికే మహేష్ నేరుగా తన ప్రియురాలి (మృతుడి భార్య) వద్దకు వెళ్ళాడు. "పని పూర్తయింది.. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు" అంటూ ఆమెతో కలిసి ఇంట్లోనే పాస్తా వండుకుని విందు చేసుకున్నారు. తమ పాపం గడ్డివాము మంటల్లో కలిసిపోయిందని, పోలీసులకు కనీసం ఆధారాలు కూడా దొరకవని వారు భ్రమపడ్డారు.
ఈ కేసులో నేరగాళ్లు ఎంత తెలివైన వారంటే, లోకేంద్రను చంపడానికి పిలిచేటప్పుడు తమ స్వంత ఫోన్లను వాడలేదు. పోలీసులకు కాల్ డేటాలో దొరకకూడదని పక్కింటి మహిళ ఫోన్ తీసుకుని లోకేంద్రకు కాల్ చేశారు. "నీ కోసం ఒక పని ఉంది రా" అని పిలిపించారు. కానీ, పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టాక.. లోకేంద్రకు వచ్చిన చివరి కాల్ ఎవరిది అని ఆరా తీస్తే ఆ పొరుగు మహిళ ఫోన్ నంబర్ బయటపడింది. ఆమెను విచారించగా, "నా ఫోన్ ఆ సమయానికి మహేష్ తీసుకున్నాడు" అని చెప్పడంతో కేసు మలుపు తిరిగింది.
'దృశ్యం' సినిమానే వారికి శాపమైంది
మహేష్ తన ఫోన్‌లో గడిచిన 15 రోజులుగా పదేపదే 'దృశ్యం' సినిమా క్లిప్పింగ్స్ చూడటం, గూగుల్‌లో "శవం ఆనవాళ్లు లేకుండా కాల్చడం ఎలా?" అని వెతకడం వంటివి డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ద్వారా పోలీసులు పట్టుకున్నారు. సినిమా అతనికి ఐడియా ఇచ్చింది నిజమే, కానీ అదే సినిమా అతన్ని అనుమానితుడిగా మార్చేలా పోలీసులకు క్లూ ఇచ్చింది. నిందితులు ఆస్తి కోసం, సుఖం కోసం లోకేంద్రను చంపారు. కానీ, ఏ డబ్బు కోసం అయితే హత్య చేశారో, ఆ 4.50 లక్షల రూపాయల నోట్ల కట్టలను పోలీసులు వారి ఇంటి నుండే స్వాధీనం చేసుకున్నారు. అటు భర్త లేడు, ఇటు ప్రియుడు జైలు పాలయ్యాడు, చివరకు అనుభవించాలనుకున్న డబ్బు కూడా దక్కలేదు. పాపం పండిన వేళ.. 'దృశ్యం' రీల్ లైఫ్ హీరోకి సక్సెస్ ఇస్తే, రియల్ లైఫ్ విలన్లకు జైలు ఊచలు మిగిల్చింది!