అమరావతి: పామును పట్టడం ఒక విద్య మాత్రమే కాదు, అది ప్రాణాలతో చేసే యుద్ధం. ఎంతటి అనుభవం ఉన్నా ఒక్క క్షణం అప్రమత్తత లోపిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇటీవలి సంఘటనలే నిదర్శనం. ఈ నేపథ్యంలో పాములను రక్షించే స్నేక్ క్యాచెర్స్ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాములను రక్షించి, ప్రజలను ప్రమాదం నుండి తప్పించే సర్ప మిత్రుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అటవీ శాఖ మంత్రి గణేష్ నాయక్ వెల్లడించిన వివరాల ప్రకారం వీరికి బీమా సౌకర్యం కల్పించబోతున్నారు. దీనికోసం క్షేత్రస్థాయిలో పనిచేసే వారి డేటాను సేకరించి, వారికి అటవీ శాఖ ద్వారా ఐ డి కార్డులు జారీ చేయనున్నారు. కేవలం సోషల్ మీడియా రీల్స్ కోసం పాములను పట్టేవారిని నియంత్రించి, అసలైన సర్ప మిత్రులకు శిక్షణ, భద్రతా పరికరాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో పాము కాట్ల కల్లోలం: తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పాము కాట్ల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఏపీలో ఏటా సగటున 340 మంది పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వాస్తవ సంఖ్య దీనికి రెట్టింపు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణాల్లో ఎక్కువగా కోబ్రా (నాగుపాము), కట్లపాము, పొడపాము కాట్ల వల్లే 90% మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు నైపుణ్యం ఉన్న వ్యక్తులు కూడా ప్రమాదాల బారిన పడటం స్నేక్ క్యాచర్లలో ఆందోళన కలిగిస్తోంది. మే 2023లో పామును పట్టిన తర్వాత దానిని సంచిలో వేస్తున్న క్రమంలో వేలిపై కాటు వేయడంతో నెల్లూరు కు చెందిన పౌరుష్ రెడ్డి మరణించారు. ఆయన మరణం ఒక హెచ్చరికగా నిలిచింది. ఇక టి టి డి కి చెందిన భాస్కర్ నాయుడుకు 10 వేల పైగా పాములను పట్టిన అనుభవం ఉంది. ఈయన జూన్ 2025లో తిరుమలలో నాగుపాము కాటుకు గురయ్యారు. ఐ సి యు లో ప్రాణాలతో పోరాడి బయట పడ్డారు. గ్లౌజ్ ఊడిపోవడం లేదా వాడకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.
ఎక్స్‌గ్రేషియా: ఏపీ ప్రభుత్వం పాము కాటు మరణాలకు ప్రస్తుతం రూ. 4 లక్షల వరకు పరిహారం అందిస్తోంది. దీనిని రూ. 10 లక్షలకు పెంచే అంశం పరిశీలనలో ఉంది. పాముకాటు బాధితులకు ఆరోగ్యశ్రీ కింద అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వెనమ్ ఉచితంగా లభిస్తుంది. అయితే ఇప్పటికి పాము కాటు వేసినప్పుడు పలువురు మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లి సమయాన్ని వృథా చేస్తున్నారు , తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 70% మరణాలు ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యం కావడం వల్లే జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
"అనుభవం ప్రాణాలను కాపాడకపోవచ్చు, కానీ అప్రమత్తత కాపాడుతుంది." పాములను పట్టేవారు తప్పనిసరిగా సేఫ్టీ కిట్స్ వాడాలని, ప్రజలు పాము కాటుకు గురైతే తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలని "కోడికూత" కోరుతోంది.




