భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన JAM ట్రినిటీ మరియు యూపీఐ (UPI) ప్రస్థానం. సామాన్యుడికి ఆర్థిక స్వేచ్ఛను అందించిన డిజిటల్ ఇండియా విప్లవంపై ప్రత్యేక కథనం.
హైదరాబాద్: ఒకప్పుడు బ్యాంకు ముందు క్యూ లైన్ అంటే అది కేవలం నగదు కోసమే కాదు, సామాన్యుడి సహనానికి పరీక్ష కూడా. గంటల కొద్దీ వేచి చూడటం, ఫారాలు నింపడం, సంతకాల సరిపోలిక.. ఇదంతా ఒక ప్రహసనం. కానీ, గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక రంగం ఒక నిశ్శబ్ద విప్లవానికి వేదికైంది. నేడు దేశంలోని మారుమూల పల్లె నుంచి మహానగరాల వరకు 'చిల్లర లేదు' అన్న మాటకు తావులేకుండా, క్షణాల్లో లావాదేవీలు ముగుస్తున్నాయి. క్యూ లైన్ల కాలం పోయి, క్యూఆర్ కోడ్‌ల శకం మొదలైంది. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు, సామాన్యుడి చేతికి ఆర్థిక స్వేచ్ఛను అందించిన మహా పరివర్తన.
JAM ట్రినిటీ: డిజిటల్ పునాదుల నిర్మాణం
భారతదేశం నేడు గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ రంగంలో అగ్రగామిగా నిలవడానికి వెనుక ఒక పక్కా వ్యూహం ఉంది. అదే 'JAM' (జన్ ధన్, ఆధార్, మొబైల్) ట్రినిటీ. గతంలో కోట్లాది మంది భారతీయులకు అసలు బ్యాంకు ఖాతాలే లేవు. ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన ద్వారా ప్రతి ఇంటికి బ్యాంకింగ్ సేవలను చేర్చడం మొదటి అడుగు అయితే, ఆధార్ ద్వారా ప్రతి పౌరుడికి ఒక తిరుగులేని డిజిటల్ గుర్తింపును అందించడం రెండవ అడుగు. దీనికి వేగవంతమైన మొబైల్ కనెక్టివిటీ తోడవడంతో, బ్యాంకింగ్ అనేది భవనాల నుంచి బయటకు వచ్చి సామాన్యుడి అరచేతిలోకి చేరింది.
ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరే 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్'- డి బి టి విధానం ఈ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రూపాయి అవినీతికి తావులేకుండా నగదు బదిలీ జరగడం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టింది.
2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – యెన్ పి సి ఐ ప్రారంభించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ – యు పి ఐ, భారత ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయి. కేవలం ఒక మొబైల్ నంబర్ లేదా ఒక వర్చువల్ అడ్రస్‌తో నగదు పంపడం అనేది అప్పట్లో ఒక విప్లవాత్మక ఆలోచన. అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ల వంటి క్లిష్టమైన వివరాల అవసరం లేకుండా, సెకన్ల వ్యవధిలో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ జరగడం యూపీఐ ప్రత్యేకత.
నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో దాదాపు 49 శాతం వాటా ఒక్క భారతదేశానిదే కావడం విశేషం. జనవరి 2026 నాటి గణాంకాలను పరిశీలిస్తే, ఒక్క నెలలోనే 21.70 బిలియన్ల లావాదేవీలు జరిగాయి, వీటి విలువ సుమారు రూ. 28.33 లక్షల కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఇంత భారీ స్థాయిలో డిజిటల్ లావాదేవీలు జరగడం లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి – ఐ ఏం ఎఫ్ వంటి సంస్థలు కూడా ప్రశంసిస్తున్నాయి.
సామాన్యుడి చెంతకు చేరిన ఆర్థిక సేవలు
ఈ డిజిటల్ విప్లవంలో అతిపెద్ద విజయం ఏమిటంటే.. ఇది ధనవంతులకు మాత్రమే పరిమితం కాలేదు. ఫుట్‌పాత్ మీద కూరగాయలు అమ్మే వ్యక్తి నుంచి, రోడ్డు పక్కన టీ బండి నడిపే వారి దాకా అందరూ క్యూఆర్ కోడ్‌లనే నమ్ముకుంటున్నారు. ఆటో డ్రైవర్లు చిల్లర సమస్య లేకుండా ప్రయాణికుల నుంచి పేమెంట్స్ తీసుకుంటున్నారు. నగరాల్లో ఉండే కొడుకు పంపే డబ్బు, పల్లెటూరిలో ఉండే తల్లికి క్షణాల్లో అందుతోంది.
యూపీఐ కేవలం నగదు బదిలీకే పరిమితం కాకుండా, ఇప్పుడు 'యూపీఐ లైట్' ద్వారా చిన్న చిన్న చెల్లింపులను మరింత వేగవంతం చేస్తోంది. అలాగే 'యూపీఐ ఆటోపే' ద్వారా కరెంటు బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు వంటివి ఆటోమేటిక్‌గా చెల్లించే సౌలభ్యం ఏర్పడింది. ఇది కాకుండా, ఇప్పుడు యూపీఐ ద్వారా క్రెడిట్ సేవలు కూడా అందుబాటులోకి రావడం వల్ల సామాన్య ప్రజలకు తక్షణ రుణ సౌకర్యం కలిగే మార్గం సుగమమైంది.
భద్రత మరియు అంతర్జాతీయ విస్తరణ
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ భద్రత విషయంలోనూ భారత్ కఠినమైన చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) నిబంధనలు వినియోగదారుల సొమ్ముకు మరింత రక్షణ కల్పిస్తున్నాయి. బయోమెట్రిక్స్, పిన్ మరియు సెక్యూర్ టోకెన్ల వంటి బహుళ అంచెల భద్రత వల్ల సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా లావాదేవీలు సురక్షితంగా సాగుతున్నాయి.
కేవలం భారత్‌లోనే కాదు, మన దేశీ మేధస్సుతో రూపొందిన యూపీఐ ఇప్పుడు ప్రపంచ దేశాలకూ పాకింది. సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో మన యూపీఐ ఇప్పుడు చెల్లుబాటు అవుతోంది. ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతి మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక క్రమంలో భారతదేశం ఒక 'సూపర్ పవర్'గా ఎదుగుతుందనడానికి నిదర్శనం.
దశాబ్ద కాలం కిందట ఒక స్వప్నంగా మొదలైన డిజిటల్ ఇండియా, నేడు ఒక జీవనశైలిగా మారింది. నగదు రహిత లావాదేవీల వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతోంది. క్యూల నుంచి క్యూఆర్ కోడ్‌ల వరకు సాగిన ఈ ప్రయాణం, నవ భారత పురోగతికి అద్దం పడుతోంది.