భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు జీవనాడి అయిన గంగానది ప్రక్షాళనలో కీలక మైలురాయి నమోదైంది. దశాబ్దాలుగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న గంగమ్మ, ఇప్పుడు మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. తాజాగా లోక్‌సభలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి సమర్పించిన నివేదిక ప్రకారం, గంగా నది నీరు ఇప్పుడు స్నానానికి అనువుగా మారిందని, కాలుష్య స్థాయి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని స్పష్టమవుతోంది.

‘నమామి గంగే’ ప్రాజెక్టు కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అదొక బృహత్తర సంకల్పమని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఇప్పటివరకు 43,030 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 524 ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే 355 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కాగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి.

ముఖ్యంగా మురుగునీటి శుద్ధి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 35,794 కోట్ల రూపాయల వ్యయంతో 218 మురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టారు. మొత్తం ప్రతిరోజూ 6,610 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యాన్ని నిర్మించడం లక్ష్యం కాగా ఇప్పటికే 4,050 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన 138 ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.

క్షేత్రస్థాయిలో నీటి నాణ్యత: పీహెచ్ నుండి ఆక్సిజన్ వరకు..

2025 జనవరి నుండి ఆగస్టు వరకు సేకరించిన శాస్త్రీయ గణాంకాలను పరిశీలిస్తే, నదిలోని హైడ్రోజన్ అయాన్ల సాంద్రత (పి హెచ్ ) మరియు కరిగిన ఆక్సిజన్ స్థాయిలు స్నానపు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిర్ధారించింది. ఐదు రాష్ట్రాల వ్యాప్తంగా 112 కీలక ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోంది. అవి ఆయా రాష్ట్రాల వారీగా పర్యవేక్షణ కేంద్రాలు వరుసగా ఉత్తరాఖండ్లో 19, ఉత్తరప్రదేశ్: 41, బీహార్: 33, జార్ఖండ్: 04 అలాగే పశ్చిమ బెంగాల్: 15 ఉన్నాయి.

ప్రభుత్వ గణాంకాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొన్ని చిక్కుముడులు ఇంకా వీడలేదు. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో నీటి నాణ్యత ఇంకా ఆశించిన స్థాయిలో లేదని కేంద్రం స్వయంగా అంగీకరించింది. ముఖ్యంగా ఫరూఖాబాద్ నుండి కాన్పూర్ (పురాణ రాజాపూర్) వరకు, రాయ్‌బరేలీలోని దల్మౌ ప్రాంతం, గాజీపూర్ నుండి మిర్జాపూర్ దిగువ ప్రాంతాల్లో బయో-కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇంకా ప్రమాణాల మేరకు లేదు. పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి కోసం జాజ్‌మౌ (20 MLD), బంత్ర్ (4.5 MLD), మథుర (6.25 MLD) వద్ద ప్రత్యేక ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటికీ, వీటి పూర్తి స్థాయి పనితీరుపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.

ప్రాణం పోసుకుంటున్న జలచరాలు

నది శుభ్రపడుతుందనడానికి అత్యంత కీలకమైన సాక్ష్యం - అందులోని జీవవైవిధ్యం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ మరియు అటవీ శాఖల సమన్వయంతో చేపట్టిన చర్యల వల్ల గంగా నదిలో డాల్ఫిన్లు, నీటి కుక్కలు , హిల్సా చేపలు, తాబేళ్లు మరియు మొసళ్ళు సంఖ్య పెరుగుతోంది. జల నాణ్యత 'మధ్యమం' నుండి 'మంచి' స్థాయికి చేరుకోవడమే ఈ జీవరాశుల పునరాగమనానికి ప్రధాన కారణం.

యమునా తీరంలో 26 పర్యవేక్షణ కేంద్రాలు, గంగా తీరంలో 50 బయో-మానిటరింగ్ కేంద్రాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, కేవలం ప్రభుత్వ ప్రాజెక్టులే కాకుండా, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే 'నిర్మల గంగ' స్వప్నం సంపూర్ణంగా సాకారమవుతుంది. ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, అవి నిరంతరాయంగా పనిచేసేలా చూడటం ముగిలి ఉన్న అతిపెద్ద సవాలు.

వందల ఏళ్ల కాలుష్యాన్ని కడిగేసే ఈ మహాయజ్ఞంలో.. గంగమ్మ మళ్ళీ పవిత్రంగా, స్వచ్ఛంగా అలరారుతుందన్న ఆశలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చిగురిస్తున్నాయి.