గూగుల్ సెర్చ్‌లో కనిపించే నంబర్లను గుడ్డిగా నమ్మకండి. గ్రేటర్ నోయిడాకు చెందిన ఒక మహిళ కేవలం ₹241 రీఫండ్ కోసం వెతికి ₹97,000 పోగొట్టుకుంది. అసలు ఆ మోసం ఎలా జరిగింది? సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి కథనం ఇక్కడ చదవండి.
హైదరాబాద్ , ఏప్రియల్ 22 : గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో కనిపించే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ తాజా ఘటన హెచ్చరిస్తోంది. ఆన్‌లైన్ మోసాల పట్ల అవగాహన లేకపోతే, సైబర్ కేటుగాళ్లు మన కష్టార్జితాన్ని క్షణాల్లో మాయం చేస్తారని ఈ ఉదంతం నిరూపించింది. కేవలం రూ.241 ల రీఫండ్ కోసం వెతుకుతూ, ఏకంగా రూ. 97 వేలకు పైగా పోగొట్టుకున్న ఒక మహిళా బాధితురాలి కథనం ఇది.
చిన్న పొరపాటు.. భారీ నష్టం!
గ్రేటర్ నోయిడాలోని సూరజ్‌పూర్ కొత్వాలీ ప్రాంతానికి చెందిన అనిత దూబే అనే మహిళ ఇటీవల ఒక ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా దుస్తులను ఆర్డర్ చేశారు. ఇందుకోసం ఆమె తన బ్యాంక్ ఖాతా నుండి రూ. 241 చెల్లించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ ఆర్డర్ రద్దయింది. తాను చెల్లించిన నగదు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె, సంబంధిత కంపెనీ కస్టమర్ కేర్ సహాయం కోరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గూగుల్‌లో సదరు కంపెనీ పేరుతో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్ కోసం వెతకడం ఆమె చేసిన మొదటి పొరపాటు.
గూగుల్ సెర్చ్ ఫలితాల్లో కనిపించిన ఒక మొబైల్ నంబర్‌ను నిజమైన కస్టమర్ కేర్ నంబర్‌గా భావించిన అనిత, దానికి ఫోన్ చేసి తన సమస్యను వివరించారు. అవతలి వైపు ఉన్న వ్యక్తి కంపెనీ ప్రతినిధిగా నమ్మబలికి, ఆమె డబ్బును వెంటనే రీఫండ్ చేస్తామని హామీ ఇచ్చాడు.
లింక్ పంపించి నిలువుదోపిడీ
బాధితురాలి నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాడు, రీఫండ్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఒక లింక్‌ను పంపించాడు. ఆ లింక్ క్లిక్ చేసి అందులో అడిగిన వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పొందుపరచాలని సూచించాడు. కేవలం రూ.241 రూపాయలు తిరిగి వస్తాయనే ఆశతో ఆమె ఆ లింక్ ఓపెన్ చేసి వివరాలన్నీ నమోదు చేశారు. ప్రక్రియ పూర్తయిన కొద్దిసేపటికే ఆమె మొబైల్‌కు వచ్చిన బ్యాంక్ సందేశం చూసి ఆమె షాక్‌కు గురయ్యారు. తన ఖాతా నుండి ఏకంగా రూ. 97,737లు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సూరజ్‌పూర్ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ స్పందిస్తూ.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. సైబర్ నేరగాళ్లు గూగుల్ సెర్చ్‌లో తప్పుడు నంబర్లను అప్‌లోడ్ చేసి అమాయకులను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో ఈ కేసు ద్వారా మరోసారి వెల్లడైందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఉదంతం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఏ కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ వివరాలైనా నేరుగా ఆయా అధికారిక వెబ్‌సైట్ల నుండే తీసుకోవాలని, తెలియని వ్యక్తులు పంపే లింక్‌లపై క్లిక్ చేసి బ్యాంక్ వివరాలు వెల్లడించకూడదని హెచ్చరిస్తున్నారు. సెర్చ్ ఇంజిన్లలో కనిపించే ప్రతి నంబర్ ప్రామాణికం కాదని గుర్తుంచుకోవాలి.