దేశీయంగా మత్స్య సంపదను పెంపొందించడం మరియు మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భారీ అడుగులు వేస్తోంది. మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'మత్స్య మరియు జలచర సాగు మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి' -ఎఫ్ ఐ డి ఎఫ్ ద్వారా దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) ఈ పథకానికి సంబంధించిన కీలక పురోగతిని వెల్లడించారు.
రూ. 7,522 కోట్లతో బృహత్తర ప్రణాళిక
2018-19 ఆర్థిక సంవత్సరం నుండి అమలవుతున్న ఎఫ్ ఐ డి ఎఫ్ పథకం కోసం కేంద్రం రూ. 7,522.48 కోట్ల భారీ నిధిని కేటాయించింది. ఈ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ప్రైవేట్ భాగస్వాములకు రాయితీతో కూడిన రుణాలను అందిస్తున్నారు. నోడల్ లోనింగ్ వ్యవస్థ ద్వారా అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్- నాబార్డ్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- ఎన్‌సిడిసి, ప్రభుత్వం గుర్తించిన కొన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు యెన్ ఎల్ ఇ లు గా వ్యవహరిస్తున్నాయి. నోడల్ లోనింగ్ ఎంటిటీల (యెన్ ఎల్ ఇ లు) ద్వారా ఇచ్చే రుణాలపై కేంద్రం ఏడాదికి 3% వడ్డీ రాయితీని భరిస్తోంది. లబ్ధిదారులకు వడ్డీ భారం 5% కంటే తక్కువ ఉండకుండా ఈ పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ. 5,559.54 కోట్ల విలువైన 228 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వీటిలో 111 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 4,212.05 కోట్ల రుణాలను మంజూరు చేయగా, ఇప్పటికే రూ. 1,600.56 కోట్లు లబ్ధిదారులకు చేరాయి.
క్షేత్రస్థాయిలో మారుతున్న మౌలిక సదుపాయాలు
ఈ నిధులతో కేవలం హార్బర్లు మాత్రమే కాకుండా, మత్స్య రంగానికి అవసరమైన పూర్తిస్థాయి వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధానంగా అధునాతన చేపల రేవులు మరియు ల్యాండింగ్ కేంద్రాలు., కోల్డ్ స్టోరేజీలు, ఐస్ ప్లాంట్లు మరియు మత్స్య రవాణా సౌకర్యాలు., చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు మరియు మత్స్య శిక్షణ కేంద్రాలు., జలాశయాలలో కేజ్ కల్చర్ మరియు మ్యారీ కల్చర్ కు ప్రోత్సాహం అందుతుంది. ప్రస్తుతం ఆమోదించిన 228 ప్రాజెక్టులలో 68 ప్రాజెక్టులు (60 ప్రభుత్వ, 8 ప్రైవేట్) ఇప్పటికే పూర్తికాగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి.
పెరిగిన ఉత్పత్తి.. దూసుకెళ్తున్న ఎగుమతులు
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన మరియుఎఫ్ ఐ డి ఎఫ్ సమన్వయంతో దేశంలో చేపల ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. 2019-20లో 141.64 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి, 2024-25 నాటికి 197.75 లక్షల టన్నులకు చేరుకుంది. సముద్ర ఆహార ఎగుమతులు రూ. 46,666 కోట్ల నుండి ఏకంగా రూ. 62,408 కోట్లకు పెరిగాయి.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రికార్డు వృద్ధి
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా మత్స్య రంగంలో అద్భుత ప్రగతిని సాధించింది. ఇక్కడ చేపల ఉత్పత్తి కేవలం ఐదేళ్లలో 546% వృద్ధిని నమోదు చేయడం విశేషం. సాత్పతిలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, డ్రెడ్జింగ్ పనులు మరియు మత్స్యకారులకు కల్పించిన పోస్ట్-హార్వెస్టింగ్ సౌకర్యాలు ఈ విజయానికి కారణమని ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మత్స్య రంగానికి మహర్దశ: ఎఫ్ ఐ డి ఎఫ్ ద్వారా రూ. 211 కోట్ల కేటాయింపులు!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మత్స్య మరియు జలచర సాగు మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి - ఎఫ్ ఐ డి ఎఫ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయమైన ప్రయోజనం పొందుతోంది. రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధి వెన్నుముకగా నిలుస్తోంది.
1. ఏపీకి కేటాయింపులు మరియు ప్రాజెక్టుల వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య సంపదను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం భారీ నిధులను ఆమోదించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 ప్రధాన ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టుల అంచనా విలువ రూ. 211.88 కోట్లు. ఇందులో రూ. 124.42 కోట్ల రుణాలపై కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ రాయితీని అందిస్తోంది. అయితే ఆమోదం పొందిన ఈ 8 ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ రంగంలో చేపట్టేవి కావడం గమనార్హం. ఇది రాష్ట్రంలో మత్స్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పెరుగుతున్న ఆసక్తిగా ప్రభుత్వాలు భావిస్తుండగా అందులో తమకు తగిన ప్రాధాన్యత లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2. చేపట్టనున్న మౌలిక సదుపాయాల పనులు
సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిధులతో అధునాతన ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చేపల వేట అనంతరం పడవలు నిలిపేందుకు, సరుకును సురక్షితంగా దించేందుకు ఆధునిక వసతులు సమకూరుతాయి. పట్టుబడిన చేపలు పాడవకుండా ఉండేందుకు ఐస్ ప్లాంట్లు మరియు కోల్డ్ స్టోరేజీల నిర్మాణం జరుగుతుంది. సముద్రం నుండి నేరుగా మార్కెట్లకు లేదా ఎగుమతి కేంద్రాలకు తరలించేందుకు అధునాతన వాహనాలు , రవాణా కు వీలుకలుగుతుంది. అదేవిధంగా నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి కోసం ఆధునిక హేచరీల స్థాపన, చేపలను శుద్ధి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాకేజింగ్ చేసే యూనిట్ల ఏర్పాటు అవుతాయి.
3. మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలు
మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల చేపల వృధా తగ్గి, మత్స్యకారులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుండి విదేశాలకు జరిగే సముద్ర ఆహార ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ 8 ప్రాజెక్టుల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన సాయం, ఇటు ఎఫ్ ఐ డి ఎఫ్ రుణ రాయితీలు కలిసి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు రెట్టింపు ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి.




