ఆధునిక సమాజం అంగారకుడిపై అడుగులు వేస్తుంటే, మరికొందరు మాత్రం ఇంకా మూఢనమ్మకాల చీకటి గృహాల్లో బందీలై మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. సంపద కోసం, క్షుద్ర శక్తుల ప్రసన్నం కోసం ఒక నిండు ప్రాణాన్ని, ఇంటికి వచ్చిన కోడలిని పశువుకంటే హీనంగా చూసిన వైనం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగులోకి వచ్చింది. తంత్ర-మంత్రాల పేరుతో నవవధువును నగ్నంగా మార్చి పూజలు చేయించిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అసలేం జరిగిందంటే

కాన్పూర్‌లోని పాండు నగర్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారుల కుటుంబానికి చెందిన కౌతుక్ మిశ్రాతో, సచేండి ప్రాంతానికి చెందిన ఒక యువతికి 2024 మార్చిలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో తండ్రి తన శక్తికి మించి సుమారు రూ. 5 కోట్ల కట్నకానుకలు సమర్పించుకున్నారు. అయితే, ఆ కానుకలు ఆ కుటుంబం ఆకలిని తీర్చలేకపోయాయి. పెళ్లయిన కొన్ని రోజులకే అసలు రంగు బయటపడింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆమె అత్త తనను అర్థరాత్రి వేళల్లో జరిగే క్షుద్ర పూజల్లో పాల్గొనాలని ఒత్తిడి చేసేది. తాము కోల్‌కతా వెళ్లి మరీ ఇలాంటి విద్యలు నేర్చుకున్నామని, తమ సంపద అంతా ఈ తంత్ర పూజల వల్లే వచ్చిందని ఆమె నమ్మబలికింది. ఈ క్రమంలోనే ఒక అర్ధరాత్రి పూజ పేరుతో కోడలిని దిగంబరంగా మార్చి, అందరి ముందూ కూర్చోబెట్టారు.

అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే, కష్టకాలంలో అండగా ఉండాల్సిన భర్త కౌతుక్ మిశ్రా, తన తల్లిదండ్రుల వికృత చేష్టలకు వత్తాసు పలకడమే కాకుండా, భార్యను గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. బాధితురాలు వివరించిన వివరాల ప్రకారం.. ఆమె మామ వినీత్ మిశ్రా, నగ్నంగా ఉన్న ఆమె శరీరానికి విభూతి పూస్తూ మర్యాద గీతలు దాటి అసభ్యంగా ప్రవర్తించారు. దీనిని నిరసించినందుకు ఆమెపై అందరూ కలిసి భౌతిక దాడికి దిగారు.

ఈ కేసులో నిందితుల కుటుంబానికి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో బంధుత్వం ఉండటంతో, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు వెనుకాడారని తెలుస్తోంది. రాజీ కుదర్చాలంటూ నెలల తరబడి కౌన్సెలింగ్ పేరుతో కాలయాపన చేశారు. కానీ, బాధితురాలు మరియు ఆమె కుటుంబం వెనక్కి తగ్గకుండా పోరాడటంతో, చివరికి మహిళా పోలీస్ స్టేషన్‌లో భర్త, అత్తమామలు, తాతతో సహా ఆరుగురిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదైంది.

వరుస ఘటనలు.. సమాజానికి హెచ్చరిక

భారతదేశంలో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కావు. పుణెలో సంతానం కోసం స్మశాన వాటిక ఎముకల పొడిని తాగించి మహిళను నగ్నంగా స్నానం చేయించిన ఘటన 2022 లో జరిగింది. అదే ఏడాది కేరళలో ఆర్థిక లాభం కోసం ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన భయంకర ఉదంతం వెలుగు చూసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె ప్రాంతంలో విద్యావంతులైన తల్లిదండ్రులే తమ ఇద్దరు కుమార్తెలను క్షుద్ర పూజల మాయలో చంపుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటన 2021లో నమోదు అయింది.

ఈ ఘటనలన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్షరాస్యత పెరిగినా, శాస్త్రీయ దృక్పథం మాత్రం ఇంకా మృగ్యమవుతోంది.

చట్టం ఏం చెబుతోంది?

బాధితురాలిపై జరిగిన అకృత్యాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత - బి యెన్ ఎస్ ప్రకారం పలు సెక్షన్లు వర్తిస్తాయి. బి యెన్ ఎస్ 76 (పూర్వపు IPC 354B) మహిళను నగ్నంగా చేయడం వంటి నేరాలకు గరిష్టంగా 7 ఏళ్ల శిక్ష పడుతుంది. బి యెన్ ఎస్ (పూర్వపు IPC 498A) గృహ హింస మరియు వేధింపుల ప్రకారం చర్యలు ఉంటాయి. కాన్పూర్‌ ఘటనలో వరకట్న నిషేధ చట్టం వర్తిస్తుంది. అదనంగా 2 కోట్లు మరియు కిలో బంగారం డిమాండ్ చేసినందుకు దీనిప్రకారం చర్యలు తీసుకుంటార. ఈ కేసులో ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండగా, ఏసీపీ అశుతోష్ సింగ్ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

తంత్ర మంత్రాల పేరుతో జరిగే ఇలాంటి సామాజిక రుగ్మతలను అరికట్టడానికి కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు, సామాజిక స్పృహ కూడా అత్యవసరమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

నగ్న పూజలు చేస్తే అంతులేని సంపద వరిస్తుందా

భారతదేశంలో కొన్ని పురాతన తాంత్రిక సంప్రదాయాలలో (ఉదాహరణకు: అఘోరాలు లేదా కొన్ని రకాల శక్తి పూజలు) బాహ్య ప్రపంచంతో సంబంధం తెంచుకోవడానికి, అహంకారాన్ని విడనాడటానికి నగ్నత్వాన్ని ఒక సంకేతంగా భావిస్తారు. ఇవి చాలా రహస్యంగా, గురువుల పర్యవేక్షణలో జరుగుతాయి. అయితే ఆ పేరుతో ఇపుడు వెలుగు చూస్తున్న ఘటనలు అక్రమమైనవి. ఇక్కడ వ్యక్తిగత స్వార్థం, మహిళల దోపిడీ ఎక్కువగా కనిపిస్తుంది.

ఇలాంటి పూజలు చేసేవారు కాన్పూర్ ఘటనలో లాగా, తంత్ర పూజల ద్వారా కోట్లు గడించవచ్చని నమ్ముతారు. సంతానం కలగని దంపతులను మాంత్రికులు నమ్మించి, మహిళలను నగ్నంగా పూజలో కూర్చోబెట్టడం లేదా స్నానం చేయించడం వంటివి చేస్తారు. ఎవరినైనా తమ అదుపులోకి తెచ్చుకోవడానికి లేదా శత్రువులను నాశనం చేయడానికి ఇలాంటి పూజలు చేస్తారని నమ్మకం. భూమిలో ఉన్న నిధులను వెలికితీయడానికి "నగ్న పూజ" లేదా "నరబలి" అవసరమని తప్పుడు ప్రచారం చేస్తారు. ఇలాంటి పనులు చేసేవారిలో ఎక్కువగా మాంత్రికులు, దొంగ బాబాలు ఉంటారు. వీరు అమాయక ప్రజలను భయపెట్టి, వారి నుండి డబ్బు గుంజడానికి లేదా వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించే మోసగాళ్లు. చదువుకున్న వారైనా, కాకపోయినా., కష్టం చేయకుండా రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని కోరుకునే వారు ఎక్కువగా విరి బారిన పడతారు. ఇలాంటి వాళ్లు మానసిక స్థితి అసహజంగా భావించాలి. భక్తి పేరుతో ఇతరులను ముఖ్యంగా మహిళలను వివస్త్రలను చేసి చూడటంలో పైశాచిక ఆనందం పొందే వికృత మనస్తత్వం కలిగిన వారు వీళ్ళంతా అని అర్ధంచేసుకోవాలి.

అంతేకాదు ఇలాంటి కార్యాలు ఖచ్చితంగా మూఢనమ్మకాలే. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమాత్రం లేవు. బట్టలు విప్పి పూజ చేయడం వల్ల సంపద వస్తుందనే దానికి ఎక్కడా రుజువు లేదు. సంపద అనేది కష్టపడటం, తెలివైన పెట్టుబడులు లేదా వ్యాపారం ద్వారా వస్తుంది తప్ప ఇలాంటి అమానవీయ చర్యల వల్ల కాదు.

నిజమైన ఆధ్యాత్మికత ఎప్పుడూ ఒక వ్యక్తి గౌరవాన్ని తీసివేయమని చెప్పదు. ఒక మహిళను బలవంతంగా నగ్నంగా మార్చడం అనేది నేరం మరియు అనాగరికత. ఏ హిందూ ధర్మశాస్త్రం కూడా సామాన్యులను, ముఖ్యంగా కోడళ్లను అందరి ముందు నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేయమని చెప్పలేదు. ఇది కేవలం స్వార్థపరులు సృష్టించుకున్న వికృత ప్రక్రియ.

కాన్పూర్ లాంటి ఘటనల్లో నిందితులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి "సంప్రదాయం" అనే పేరు వాడుకుంటారు. కానీ చట్టం దృష్టిలో ఇది లైంగిక వేధింపు మరియు మానవ హక్కుల ఉల్లంఘన. సమాజంలో ఇలాంటి వాటిపై అవగాహన పెరగడం మరియు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం చాలా అవసరం.