విదేశీ విరాళాల నియంత్రణ చట్టం - ఎఫ్ సి ఆర్ ఏ ప్రకారం నమోదైన స్వచ్ఛంద సంస్థల పై ప్రభుత్వం మరింత కఠిన నియంత్రణ చర్యలు తిసుకోబోతుంది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని విదేశీ నిధులలో మరింత పారదర్శకతను పెంచడానికి ఆయా సంస్థల జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి, ప్రభుత్వం ఈ పార్లమెంట్ సెషన్‌లోనే ఎఫ్‌సిఆర్‌ఏ సవరణ బిల్లును తీసుకురావడానికి సిద్ధ మవుతున్నట్లు తెలుస్తుంది. విదేశీ విరాళాలు ఏ ప్రయోజనం కోసం అందాయో, అదే పద్దు కింద ఖర్చు చేయాలనే నిబంధన ఇందులో ప్రధానమైనది. ఒకవేళ ఏదైనా ఎన్జీఓ అక్రమాలకు పాల్పడితే, ప్రభుత్వం దాని ఆస్తులను విక్రయించే అవకాశం రాబోతున్న సవరణలలో ఉండటం కిలకకిలకపరినామంగా భావించాలి. ప్రస్తుతం దేశంలో ఎఫ్‌సిఆర్‌ఏ కింద 16,000 సంస్థలు నమోదయ్యాయి. ప్రతి ఏటా రూ. 22 వేల కోట్ల విదేశీ విరాళాలను వీటికి అందుతున్నాయి. ప్రస్తుత చట్టంలో విదేశీ విరాళాల సరైన వినియోగం, నిర్వహణపై స్పష్టమైన నిబంధన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ విరాళాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్న క్రమంలో దీనికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికే ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది.

రెన్యువల్ చేయకపోతే ఆటోమేటిక్ గా రద్దు :

విదేశీ నిధులు పొందే ప్రతి ఎన్జీఓ ఒక నామినేటెడ్ అధికారిని నియమించుకోవాలి. ఎన్జీఓకు ఏ ఉద్దేశంతో విదేశీ విరాళం వచ్చిందో, ఆ నిధులు అదే పద్దు కింద ఖర్చు అవుతున్నాయో లేదో ఆ అధికారి నిర్ధారిస్తారు. ఈ అధికారి ఆస్తుల నిర్వహణ, వినియోగం వంటి అమ్సలాను పరిశిలిస్తారు. ఏదైనా కారణం చేత సంస్థ రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరగకపోతే, అది దానికి అదే రద్దయినట్లు పరిగణించబడుతుంది. ఎన్జీఓలు తమకు అందిన విదేశీ నిధులు నిర్ణీత కాలపరిమితిలోగా సంబంధిత ప్రయోజనం కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

తనిఖీ కోసం ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి:

ఎన్జీఓల ముఖ్య ప్రతినిధులలో డైరెక్టర్లు, ట్రస్టీలు, గవర్నింగ్ బాడీ సభ్యులు మరియు హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. ఎన్జీఓ యొక్క ఏదైనా కార్యకలాపానికి వీరందరూ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది కాకుండా, ఏదైనా ఎన్జీఓపై విదేశీ సహాయం విషయంలో జరిగిన అక్రమాలపై క్రిమినల్ విచారణ చేపట్టాలంటే, దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుండి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. మరో వైపు అనధికారికంగా విదేశీ విరాళాలు సేకరించిన సందర్భంలో జైలు శిక్షను తగ్గించే నిబంధన కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం దీనికి గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మరియు విరాళం మొత్తం కంటే ఐదు రెట్లు ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిని తగ్గించి నాలుగేళ్లు చేయాలని ప్రతిపాదించారు.

ఏ ఎన్జీఓ యొక్క ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్ రద్దయినా, సస్పెండ్ చేయబడినా లేదా రెన్యువల్ కాకపోయినా, వారి ఆస్తులను ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకోవచ్చు. దీని కోసం నిర్ణీత అథారిటీని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వం సంస్థ యొక్క విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాసం ఉంది. ఇక ఆ ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని Consolidated Fund of India లో జమ చేసే అధికారం అథారిటీకి ఉంది. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎన్జీఓలు ఆస్తులను విక్రయించడానికి అనుమతి ఉండదు.

Consolidated Fund of India (భారత సంచిత నిధి)

భారత ప్రభుత్వం పొందే అన్ని ఆదాయాలు (పన్నులు, అప్పులు, రుణాలు తిరిగి చెల్లించినప్పుడు వచ్చే నగదు) ఈ నిధిలోనే జమ అవుతాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 266(1) ప్రకారం ఈ నిధి ఏర్పాటు చేయబడింది. పార్లమెంటు అనుమతి (Appropriation Bill) లేకుండా ఈ నిధి నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలుండదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కాగ్ వంటి కీలక పదవుల్లో ఉన్నవారి జీతభత్యాలు ఈ 'సంచిత నిధి' నుండే చెల్లిస్తారు.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం :

భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత మరియు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా, విదేశీ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. ఇది మొదటిసారి 1976లో రూపొందించబడింది, ఆ తర్వాత 2010లో దీనిని పూర్తిగా సవరించి కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇటీవల 2020లో మరిన్ని కఠినమైన సవరణలు చేశారు.

ఏదైనా ఎన్జీఓ విదేశీ నిధులను స్వీకరించాలంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఒక సంస్థ పొందిన విదేశీ నిధులను మరో సంస్థకు (రిజిస్ట్రేషన్ ఉన్నా లేకున్నా) బదిలీ చేయడానికి వీలులేదు. ప్రతి సంస్థ తన నిధులను తానే వినియోగించుకోవాలి. విదేశీ నిధులలో గరిష్టంగా 20% మాత్రమే పరిపాలనా పరమైన ఖర్చులకు ( జీతాలు, అద్దెలు మొదలైనవి) ఉపయోగించాలి. గతంలో ఇది 50% వరకు ఉండేది. అదేవిధంగా విదేశీ నిధులన్నింటినీ కేవలం న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మెయిన్ బ్రాంచ్ లోని ప్రత్యేకంగా కేటాయించిన "FCRA Account" ద్వారానే స్వీకరించాలి. సంస్థ యొక్క ఆఫీస్ బేరర్లు (డైరెక్టర్లు లేదా ట్రస్టీలు) అందరూ తమ ఆధార్ కార్డు వివరాలను సమర్పించడం తప్పనిసరి. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, జర్నలిస్టులు, మీడియా సంస్థలు (న్యూస్ పేపర్, టీవీ ఛానల్స్), న్యాయమూర్తులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు మరియు వాటి అనుబంధ సంస్థలు, శాసనసభ సభ్యులు (MPs, MLAs) విదేశీ నిధులను స్వీకరించడంపై చట్టపరమైన నిషేధం ఉంది. నిబంధనలు ఉల్లంఘించినా లేదా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోకపోయినా ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ రద్దు అవుతుంది.