జ్ఞానానికి సరిహద్దులు లేవని, విద్య అనేది ఒక దేశపు సొత్తు కాదని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత క్షేత్రం నలంద. ఐదవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు విశ్వగురువుగా వెలుగొందిన నలంద ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించేందుకు భారత్ చేస్తున్న యజ్ఞం ఇప్పుడు ఒక క్లిష్ట దశకు చేరుకుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకున్న నలందపై ఆశలు భారీగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుతున్న ఆర్థిక సహకారం మాత్రం నైరాశ్యాన్ని కలిగిస్తోంది. 17 దేశాలు వ్యవస్థాపక భాగస్వాములుగా చేరిన ఈ బృహత్తర ప్రాజెక్టులో, మెజారిటీ దేశాలు కేవలం 'కాగితాల'కే పరిమితం కావడం ఇప్పుడు దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

చరిత్ర పుటల్లో విజ్ఞాన భాండాగారం

నలంద కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు, అది ప్రాచీన భారతీయ మేధస్సుకు సజీవ సాక్ష్యం. చైనా యాత్రికుడు హువాన్ త్సాంగ్ మొదలుకొని కొరియా, జపాన్, టిబెట్ మరియు టర్కీ వంటి దేశాల విద్యార్థులు జ్ఞాన సముపార్జన కోసం ఇక్కడికి తరలివచ్చేవారు. 'ధర్మగంజ్' అని పిలవబడే ఇక్కడి గ్రంథాలయం లక్షలాది తాళపత్ర గ్రంథాలతో విజ్ఞాన గనిగా ఉండేది. ఇక్కద ప్రధానంగా ప్రస్తావించాల్సిన పేరు భక్తియార్ ఖిల్జీ . భక్తియార్ ఖిల్జీ భారత చరిత్రలో, ముఖ్యంగా విద్యా వ్యవస్థ మరియు సాంస్కృతిక వారసత్వంపై జరిగిన దాడుల విషయంలో ఒక వివాదాస్పదమైన మరియు క్రూరమైన వ్యక్తిగా నిలిచిపోయారు. అతని పూర్తి పేరు ఇక్తియారుద్దీన్ ముహమ్మద్ బిన్ భక్తియార్ ఖిల్జీ. ఇతను ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఒక సైనిక జనరల్. 12వ శతాబ్దం చివరలో మరియు 13వ శతాబ్దం ప్రారంభంలో (సుమారు క్రీ.శ. 1200 ప్రాంతంలో) కుతుబుద్దీన్ ఐబక్ సైన్యంలో ఒక కమాండర్‌గా పనిచేశాడు.

భక్తియార్ ఖిల్జీ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం. చరిత్రకారుల కథనం ప్రకారం., ఖిల్జీ ఒకసారి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. తన రాజ వైద్యులు నయం చేయలేకపోయిన వ్యాధిని, నలందకు చెందిన ఆచార్య రాహుల్ శ్రీభద్ర నయం చేశారు. ఒక భారతీయ వైద్యుడు తనకంటే గొప్పవాడనే అసూయతో మరియు ఇక్కడి జ్ఞాన సంపదపై కోపంతో ఖిల్జీ నలందపై దాడికి దిగాడు. అక్కడ ఉన్న వేలాది మంది బౌద్ధ భిక్షువులను, ఆచార్యులను దారుణంగా చంపి, ప్రపంచంలోనే అతిపెద్దదైన నలంద గ్రంథాలయానికి నిప్పు పెట్టాడు. ఆ గ్రంథాలయంలోని లక్షలాది పుస్తకాలు మూడు నెలల పాటు తగలబడుతూనే ఉన్నాయంటే అక్కడి విజ్ఞాన సంపద ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇతను బీహార్‌ను జయించి, ఆ తర్వాత బెంగాల్‌పై దాడి చేశాడు. నాటి బెంగాల్ పాలకుడు లక్ష్మణ సేనను ఓడించి అక్కడ ఖిల్జీ వంశ పాలనకు పునాది వేశాడు. విక్రమశిల మరియు ఉదంతపురి వంటి ఇతర గొప్ప విద్యా కేంద్రాలను కూడా ఇతను ధ్వంసం చేశాడు. భక్తియార్ ఖిల్జీ టిబెట్‌పై దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ తీవ్ర పరాజయాన్ని చవిచూశాడు. తన సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోవడంతో తీవ్ర నిరాశతో తిరిగి వచ్చాడు. చివరకు క్రీ.శ. 1206లో అతని సొంత సేనాధిపతి అలీ మర్దాన్ ఖిల్జీ చేతిలోనే హత్యకు గురయ్యాడు.

భారతదేశం తన అమూల్యమైన ప్రాచీన విజ్ఞానాన్ని (వైద్యం, ఖగోళం, గణితం) కోల్పోవడానికి భక్తియార్ ఖిల్జీ చేసిన దాడులే ప్రధాన కారణమని చరిత్రకారులు భావిస్తారు. బీహార్‌లోని భక్తియార్‌పూర్ అనే పట్టణానికి ఇప్పటికీ అతని పేరే ఉండటం కొంత చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది.

ఆధునిక నలంద: ఆశలు వర్సెస్ వాస్తవాలు

2010లో భారత పార్లమెంటు చట్టం ద్వారా నలందకు పునర్జీవం పోసే ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో అత్యాధునిక 'నెట్ జీరో' క్యాంపస్ సిద్ధమైంది. 2014లో కేవలం 12 మంది విద్యార్థులతో మొదలైన ఈ ప్రయాణం, నేడు 2,000 మందికి పైగా విద్యార్థులకు చేరుకోవడం గొప్ప విజయమే. అయితే, ఈ అభివృద్ధి వెనుక ఉన్న ఆర్థిక భారం మాత్రం భారత భుజాలపైనే పడుతోంది. ఏటా రూ. 300 నుండి 400 కోట్ల వరకు అవుతున్న నిర్వహణ వ్యయాన్ని భాగస్వామ్య దేశాలు భరించకపోవడంతో, భారత్ తన సొంత బడ్జెట్ నుండే ఈ నిధులను వెచ్చిస్తోంది.

'ఈస్ట్ ఏషియా సమ్మిట్'లో భాగమైన 17 దేశాలు నలందకు ఆర్థిక సహకారం అందిస్తామని ఒప్పందం చేసుకున్నాయి. కానీ, వాస్తవంలో కేవలం చైనా, థాయ్‌లాండ్, లావోస్ పీడీఆర్, ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా మాత్రమే నిధులు విడుదల చేశాయి. మిగిలిన 12 దేశాలు ., ముఖ్యంగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ నుండి మొదలుకొని సింగపూర్, దక్షిణ కొరియా, న్యూజీలాండ్ వరకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక తోడ్పాటు అందించలేదు.

ఈ పరిస్థితి భారత విదేశాంగ విధానానికి ఒక పరీక్షగా మారింది. ఆసియా దేశాలను మేధోపరంగా ఏకం చేయాలనే భారత్ యొక్క 'సాఫ్ట్ పవర్' వ్యూహానికి ఇది గొడ్డలి పెట్టుగా మారుతోంది. మరోవైపు, నిధులు ఇస్తున్న అతికొద్ది దేశాల్లో చైనా ఒకటి కావడంతో, భవిష్యత్తులో విశ్వవిద్యాలయ విద్యా ప్రణాళికలో లేదా నిర్ణయాధికారాల్లో చైనా పెత్తనం పెరుగుతుందేమోనన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు నిధులు ఇవ్వకపోవడం మన 'నేబర్‌హుడ్ ఫస్ట్' పాలసీలోని లోపాలను ఎత్తిచూపుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జైశంకర్ విశ్లేషణ: 'ఆసియా పునరుజ్జీవనం' లోటుపాట్లు

నిధుల కొరతపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గతంలో కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించారు. నలందను ఆయన ఒక సాధారణ యూనివర్సిటీగా కాకుండా, 'ఏషియన్ రిజనరేషన్' లో కీలక భాగంగా అభివర్ణించారు. ఆసియా దేశాల మధ్య ఉన్న వేల ఏళ్ల నాటి సాంస్కృతిక అనుసంధానాన్ని మళ్ళీ చిగురింపజేయడమే నలంద లక్ష్యమని ఆయన నమ్ముతారు.

"ఇది ఒక భాగస్వామ్య కల.. దీని విజయం కేవలం భారత్ బాధ్యత మాత్రమే కాదు" అని ఆయన అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేశారు. భాగస్వామ్య దేశాలు తమ నిబద్ధతను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. నిధులు రాకపోయినా భారత్ వెనక్కి తగ్గదని, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు.

పొరుగు దేశాలు మొండిచేయి చూపడంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. నిధుల సేకరణ కోసం ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కార్పొరేట్ సంస్థల నుండి నిధులు సేకరించడం లేదా అంతర్జాతీయ విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆర్థిక వనరులను పెంచుకోవాలని భావిస్తోంది.

నలంద అంటే కేవలం భవనాల సముదాయం కాదు, అది భారతీయ జ్ఞాన వారసత్వానికి ప్రతీక. మిత్ర దేశాలను సమన్వయం చేసుకుంటూ, చైనా వంటి దేశాల ప్రభావం పెరగకుండా జాగ్రత్త పడుతూనే, నలందను మళ్ళీ 'ప్రపంచ గురువు'గా నిలబెట్టడం ఇప్పుడు భారత్ ముందున్న అతిపెద్ద దౌత్య సవాలు.