సామాన్యుడి అత్యవసర నిధి 'బంగారం'. ఇంటి అవసరమైనా, వ్యాపార పెట్టుబడైనా.. తక్కువ సమయంలో అప్పు పుట్టాలంటే అందరికీ గుర్తొచ్చేది గోల్డ్ లోన్. అయితే, ఏప్రిల్ 1 నుండి ఈ బంగారు రుణాల ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – ఆర్ బి ఐ ప్రకటించిన సరికొత్త మార్గదర్శకాలు కస్టమర్లకు ఊరటనిచ్చేలా ఉండటమే కాకుండా, బ్యాంకులు జవాబుదారీగా ఉండేవిధంగా నిభందనలు అమల్లోకి రాబోతున్నాయి. కేవలం అప్పు ఇవ్వడమే కాకుండా, తిరిగి ఇచ్చే సమయంలో బ్యాంకులు చూపే జాప్యానికి భారీగా జరిమానా విధించేలా ఆర్‌బీఐ రూల్స్ లో మార్పు తీసుకువచ్చింది.

బంగారంతో కస్టమర్ల చేతికి మరిన్ని నిధులు

ఈ నూతన సంస్కరణల్లో అత్యంత కీలకమైనది 'లోన్ టు వ్యాల్యూ' రేటు పెంపు. గతంలో రూ.2.5 లక్షల లోపు రుణాలపై బంగారం విలువలో 75 శాతం మాత్రమే అప్పుగా లభించేది. ఇప్పుడు దీనిని 85 శాతానికి పెంచారు.ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ. లక్ష విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే, నిన్నటి వరకు మీకు కేవలం రూ75వేలు మాత్రమే లభించేవి. కానీ ఏప్రిల్ 1 నుండి అదే బంగారానికి అదనంగా మరో పది వేలు అంటే రూ. 85 వేలు నగదు పొందవచ్చు. ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారులకు, అత్యవసర వైద్య ఖర్చులు ఉన్నవారికి గొప్ప లిక్విడిటీ బూస్ట్ అని చెప్పాలి. కేవలం అప్పు తీసుకోవడమే కాదు, అవసరమైతే 'టాప్-అప్' సదుపాయాన్ని కూడా ఆర్‌బీఐ సులభతరం చేసింది. మీరు మొదట 80 శాతమే లోన్ తీసుకుంటే, మిగిలిన 5 శాతాన్ని భవిష్యత్తులో అదే తాకట్టుపై ఎప్పుడైనా పొందే వెసులుబాటు ఉంటుంది.

బ్యాంకులకు '7 రోజుల' గడువు.. లేదంటే రోజుకు రూ. 5 వేల జరిమానా!

సాధారణంగా లోన్ కట్టిన తర్వాత బంగారాన్ని తిరిగి తీసుకోవడానికి కస్టమర్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆ ఆటలు సాగవని ఆర్‌బీఐ హెచ్చరించింది. కస్టమర్ తన అసలు, వడ్డీని పూర్తిగా చెల్లించిన 7 పనిదినాల్లోపు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు క్షేమంగా తిరిగి అప్పగించాలి. ఒకవేళ ఏడు రోజుల గడువు దాటితే, 8వ రోజు నుండి సదరు బ్యాంకు కస్టమర్‌కు ప్రతిరోజూ రూ. 5 వేల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు నిర్లక్ష్యం వల్ల బంగారం గానీ, సంబంధిత పత్రాలు గానీ పోయినట్లయితే, ఆ నష్టానికి పరిహారంతో పాటు కొత్త పత్రాల ఖర్చును కూడా బ్యాంకులే భరించాలి.

కస్టమర్ లోన్ కట్టలేదని బ్యాంకులు ఏకపక్షంగా బంగారాన్ని వేలం వేయడానికి వీల్లేదు. ఇకపై కనీసం 90 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. అంతేకాకుండా, వేలం వేసిన తర్వాత వచ్చే సొమ్ము బాకీ పడిన మొత్తం కంటే ఎక్కువగా ఉంటే, ఆ అదనపు సొమ్మును కస్టమర్‌కు తిరిగి ఇవ్వాలి. ఇందులో ఎలాంటి జాప్యం జరిగినా అది ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.

 లాభాలతో పాటు రిస్క్ కూడా గమనించాలి

ఈ మార్పులను లోతుగా పరిశీలిస్తే, కస్టమర్లకు రక్షణ పెరిగిన మాట వాస్తవమే అయినా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎల్‌టీవీ 85 శాతానికి పెరగడం వల్ల బ్యాంకులపై రిస్క్ పెరుగుతుంది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అకస్మాత్తుగా పడిపోతే, తాకట్టు పెట్టిన బంగారం విలువ అప్పు కంటే తగ్గిపోవచ్చు. అప్పుడు బ్యాంకులు కస్టమర్లను అదనపు నగదు కట్టమని లేదా మరింత బంగారం తాకట్టు పెట్టమని మద్యలో అడిగే అవకాశం ఉంటుంది. బ్యాంకులు తమ రిస్క్ కవర్ చేసుకోవడానికి వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచే ఛాన్స్ ఉంది. కాబట్టి లోన్ తీసుకునేటప్పుడు అది 'రెడ్యూసింగ్ బ్యాలెన్స్' పద్ధతిలో ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. లోన్ ఎక్కువ ఇస్తున్నాం కదా అని ప్రాసెసింగ్ ఫీజులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి అగ్రిమెంట్ మీద సంతకం చేసే ముందే అన్ని హిడెన్ ఛార్జీలను అడిగి తెలుసుకోవాలి.

ఏప్రిల్ 1 నుండి రాబోతున్న ఈ మార్పులు బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచనున్నాయి. గోల్డ్ లోన్ తీసుకోవడం ఇప్పుడు మరింత సులభం మరియు సురక్షితం. అయితే, రుణం తీసుకునే ప్రతి కస్టమర్ తన 'లోన్ శాంక్షన్ లెటర్' లో ఈ 7 రోజుల రిటర్న్ రూల్ మరియు పెనాల్టీ క్లాజ్‌లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. సకాలంలో వడ్డీ చెల్లిస్తే, బంగారంపై మీ నమ్మకం మరింత బలపడుతుంది.