హైదరాబాద్ , ఏప్రియల్ 15 : సొంత వాహనం ఉన్న ప్రతి సామాన్యుడికి, రవాణా రంగంపై ఆధారపడ్డ ప్రతి ట్రాన్స్‌పోర్టర్ కి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. ఏళ్ల తరబడి అపురూపంగా చూసుకున్న కారునో, జీవనాధారమైన ట్రక్కునో కేవలం 'వయసు' అయిపోయిందన్న కారణంతో తుక్కు (స్క్రాప్) కింద మార్చేయాల్సిన అవసరం ఇకపై ఉండకపోవచ్చు. పాత వాహనాల ఇంజిన్లను మార్చి, వాటిని సరికొత్త హంగులతో రోడ్డెక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్క్రాపేజ్ పాలసీలో అతి త్వరలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు 15 నుండి 20 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలనే నిబంధన యజమానులను కలవరపెడుతోంది. అయితే, కేవలం ఇంజిన్ కాలం చెల్లిందనే కారణంతో మొత్తం వాహనాన్ని నాశనం చేయడం ఆర్థికంగా, పర్యావరణపరంగా సరైన నిర్ణయం కాదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే, పాత వాహనాలను బాడీ షాపులకు పంపే బదులు, వాటిని ఎలక్ట్రిక్ , క్లీన్ ఫ్యూయల్ (CNG/LNG) వాహనాలుగా మార్చే ‘రెట్రోఫిట్‌మెంట్’ ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది. ఈ విధానం అమల్లోకి వస్తే, పాత వాహనాలకు పునర్జన్మ లభించినట్లవుతుంది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 2.44 కోట్ల వాహనాలు స్క్రాపేజ్ పాలసీ పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో కేవలం కార్లే కాకుండా 30 లక్షలకు పైగా ట్రాక్టర్లు, వేలాది ట్రక్కులు, బస్సులు ఉన్నాయి. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తికి కొత్త కారు కొనడం, ఒక ట్రాన్స్‌పోర్టర్ కి కొత్త ట్రక్కు కొనడం ప్రస్తుతం భారమైన వ్యవహారం. కొత్త వాహనం కొనాలంటే లక్షల్లో ఖర్చవుతుంది, కానీ రెట్రోఫిట్‌మెంట్ ద్వారా పాత వాహనాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చడానికి కొత్త వాహనం ఖరీదులో కేవలం 30 నుండి 40 శాతం మాత్రమే ఖర్చవుతుంది. ఇది యజమానులపై పడే ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

ప్రభుత్వ ప్రోత్సాహం.. రాయితీల వెల్లువ

ఈ రెట్రోఫిట్‌మెంట్ ప్రక్రియను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేవలం అనుమతులు ఇవ్వడమే కాకుండా, ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలవాలని యోచిస్తోంది. కమర్షియల్ వాహనాలైన ట్రక్కులు, బస్సులు, టెంపో ట్రావెలర్లకు ఎలక్ట్రిక్ కిట్లు అమర్చుకోవడానికి అయ్యే ఖర్చులో 15 నుండి 25 శాతం వరకు సబ్సిడీని ప్రభుత్వం భరించే అవకాశం ఉంది. తద్వారా రవాణా రంగం మరింత పటిష్టమవడమే కాకుండా, కాలుష్య నివారణలో కూడా భారత్ ముందడుగు వేయనుంది.

అయితే, ఈ మార్పు అంత సులభమేమీ కాదు. పాత వాహనాల ఛాసిస్ (Chassis) పై భారీ బ్యాటరీ ప్యాక్‌ల బరువును ఉంచినప్పుడు, వాహన సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే, పాత బ్రేకింగ్ సిస్టమ్ కొత్త ఎలక్ట్రిక్ ఇంజిన్ వేగానికి సరిపోతుందా లేదా అనేది ప్రధాన సమస్య. ఈ భద్రతా ప్రమాణాల విషయంలో కేంద్ర రవాణా శాఖ అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతోంది. వాహనం ఫిట్‌నెస్‌లో ఎక్కడా రాజీ పడకుండా, అధీకృత రెట్రోఫిట్‌మెంట్ సెంటర్ల ద్వారా మాత్రమే ఈ పనులు జరిగేలా ప్రభుత్వం ఒక నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది.

ఉపాధికి కొత్త దారులు - ఒకే దెబ్బకు రెండు పిట్టలు

ఈ కొత్త విధానం కేవలం వాహన యజమానులకే కాకుండా, నిరుద్యోగులకు కూడా వరంగా మారనుంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ‘అధీకృత రెట్రోఫిట్‌మెంట్ సెంటర్లు’ ఏర్పాటు కానున్నాయి. దీనివల్ల ఆటోమొబైల్ రంగంలో నైపుణ్యం కలిగిన మెకానిక్లకు, ఇంజనీర్లకు వేల సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సర్టిఫైడ్ కిట్లను అమర్చుకున్న వాహనాలకు తదుపరి ఐదేళ్ల వరకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను సులభంగా పొడిగించే వెసులుబాటును కూడా కల్పించనున్నారు.

 కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యం ఒకవైపు, సామాన్యుడి జేబుకు చిల్లు పడకూడదనే ఆలోచన మరోవైపు - ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ కేంద్రం అడుగులు వేస్తోంది. స్క్రాపేజ్ పాలసీ ఆశించిన స్థాయిలో వేగం అందుకోకపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక భారమే. ఇప్పుడు రెట్రోఫిట్‌మెంట్ అనే ప్రత్యామ్నాయం అందుబాటులోకి వస్తే, అది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందనడంలో సందేహం లేదు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయి.