భారతీయ రైల్వే స్టేషన్లు ఇప్పుడు కేవలం రైళ్లు వచ్చి వెళ్లే వేదికలు మాత్రమే కావు.. మన దేశ అపురూప హస్తకళలకు, సంస్కృతికి మరియు స్థానిక ఉత్పత్తులకు అతిపెద్ద వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' - ఓ ఎస్ ఓ పి పథకం నేటికి విజయవంతంగా నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 'వోకల్ ఫర్ లోకల్' అనే నినాదానికి ప్రాణం పోస్తూ, స్థానిక హస్తకళాకారులు, నేత కార్మికులు మరియు స్వయం సహాయక బృందాలకు రైల్వే స్టేషన్లలోనే మార్కెట్ కల్పించే ఉద్దేశంతో 2022 మార్చి 25న ఈ పథకాన్ని ప్రారంభించారు.
దీనివల్ల ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే కళాకారుల ఉత్పత్తులు నేరుగా వేలాది మంది ప్రయాణికులకు చేరువవుతున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కళాకారులకే నేరుగా ఆదాయం, స్థిరమైన జీవనోపాధి లభిస్తోంది. అంతరించిపోతున్న ప్రాచీన కళలకు ఈ విక్రయ కేంద్రాలు పునర్జీవం పోస్తూ వారసత్వ సంరక్షణకు దోహద పడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,000 పైగా స్టేషన్లలో 2,326 విక్రయ కేంద్రాలు ఓ ఎస్ ఓ పిద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 1.32 లక్షల మందికి పైగా కళాకారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఈ స్టాల్స్‌లో యు పి ఐ , డిజిటల్ పేమెంట్స్ మరియు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ప్రతి స్టేషన్ ఆ ప్రాంతపు విశిష్టతను ప్రతిబింబించేలా విక్రయ కేంద్రాలను కలిగి ఉంది. తమిళనాడు (తెంకాశీ)లో వెదురు మరియు పేముతో చేసిన హస్తకళా వస్తువులు. బీహార్ (పాట్నా)లో ప్రపంచ ప్రసిద్ధ మధుబని చిత్రకళా వస్తువులు. రాజస్థాన్ (జైపూర్)లో సాంప్రదాయ సాంగనేరి ప్రింట్ దుస్తులు. పశ్చిమ బెంగాల్ (అసన్సోల్)లో చేనేత సంచులు మరియు ఇతర కళాఖండాలు. ఒడిశా (బలంగీర్)లో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఆకర్షణీయమైన బొమ్మలు అందుబాటులో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కళల వైభవం: ఎక్కడ ఏమి దొరుకుతాయి?
తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 70కి పైగా స్టేషన్లలో ఈ విక్రయ కేంద్రాలు అత్యంత విజయవంతంగా నడుస్తున్నాయి.
తెలంగాణ (33+ స్టేషన్లు):
సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్ వేస్టేషన్ల లో గద్వాల్, పోచంపల్లి హ్యాండ్లూమ్ చీరలు మరియు జూట్ ఉత్పత్తులు.నిర్మల్ లో ప్రపంచ ప్రసిద్ధ నిర్మల్ పెయింటింగ్స్ మరియు కొయ్య బొమ్మలు. కాచిగూడలో ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు (Millets) మరియు ఆర్గానిక్ ఆహార పదార్థాలు. వరంగల్లో చేనేత దరిశీలుఅందుబాటు లో ఉన్నాయి. వీటికి జి ఐ ట్యాగ్ గుర్తింపు కూడా ఉంది. ఇక్కడి నేత కార్మికులు పత్తి దారాలతో అద్భుతమైన రంగులు, డిజైన్లతో వీటిని తయారు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడి 'కలాం కారి' స్టైల్ దరిశీలకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఎపి లోని కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతం కూడా దరిశీల తయారీకి పూర్వం నుండి పేరుగాంచింది. భద్రాచలంలో వెదురుతో చేసిన కళాకృతులు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ (35+ స్టేషన్లు):
విజయవాడ స్టేషన్ లో కొండపల్లి బొమ్మలు, కలంకారీ వస్త్రాలు. విశాఖపట్నంలో ఏటికొప్పాక చెక్క బొమ్మలు మరియు గిరిజన ఉత్పత్తులు. ధర్మవరంలో కళ్ళు చెదిరే పట్టు చీరలు. తిరుపతిలో అద్భుతమైన చెక్క చెక్కడాలు ,నెల్లూరులో శ్రీహరికోట గిరిజన ఉత్పత్తులు.రాజమండ్రిలో నర్సాపురంలో తయారైన లేస్ వర్క్ మరియు పేపర్ మ్యాచీ వస్తువులు.
ప్రయాణికులు ఈ ఉత్పత్తులనే ఎందుకు కొనాలి?
వస్తువు నేరుగా కళాకారుడి నుండి అక్కడికి వస్తుంది, కాబట్టి ధరలు చాలా తక్కువగా ఉంటాయి. రైల్వే పర్యవేక్షణలో ఉండే ఈ స్టాల్స్‌లో నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. మీరు కొనే ఒక చిన్న వస్తువు ఒక నిరుపేద కళాకారుడి కుటుంబంలో వెలుగులు నింపుతుంది.
"ఒక స్టేషన్ - ఒక ఉత్పత్తి" అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు.. అది మన దేశ ఆర్థిక మరియు సాంస్కృతిక బలానికి నిదర్శనం. రైల్వే స్టేషన్లు ఇప్పుడు అభివృద్ధికి చిరునామాలుగా మారుతున్నాయి. మీ తదుపరి ప్రయాణంలో తప్పకుండా అందుబాటులో ఉన్న ఓ ఎస్ ఓ పి స్టాల్‌ను సందర్శించి, మన దేశీయ వారసత్వాన్ని ఆదరించండి.




