పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం పతాక స్థాయికి చేరింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటడంతో కరాచీ వంటి నగరాల్లో ప్రజలు ప్రాణాలకు తెగించి ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ నింపుకుంటున్నారు. ఒక్కో బెలూన్ రూ. 1500 పలుకుతుండగా, వీటిని 'నడిచే బాంబులు'గా రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్ ప్రస్తుత దుస్థితిపై 'కోడికూత' ప్రత్యేక కథనం.
(కోడికూత డెస్క్ – హైదరాబాద్ )
సాధారణంగా చిన్నారులు ఆడుకునే రంగుల బెలూన్ల ధర ఎంత ఉంటుంది? మహా అయితే పది లేదా ఇరవై రూపాయలు. కానీ, దారుణమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగు దేశం పాకిస్థాన్‌లో మాత్రం వీటి ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ ఒక్కో ప్లాస్టిక్ బెలూన్ ఏకంగా 1000 నుండి 1500 రూపాయల పలుకుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది అక్షర సత్యం. అయితే, ఈ బెలూన్లు సరదా కోసం కాదు.. ఆకలి తీర్చుకోవడానికి వంట గ్యాస్‌ను నింపుకోవడానికి వాడుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాక్ ప్రజలు తమ వంటగదిలో చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.
పాకిస్థాన్ అంతర్గత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అతలాకుతలమవుతోంది. నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ముఖ్యంగా ఇంధన రంగంలో నెలకొన్న సంక్షోభం గృహిణులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వద్ద సరఫరా ఆగిపోవడం పాక్ గ్యాస్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం అక్కడ ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర సుమారు 10,000 పాకిస్థానీ రూపాయలకు చేరింది. ఇంతటి భారీ ధరను భరించలేక, ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్న ప్రజలకు ఈ 'ప్లాస్టిక్ బెలూన్లు' ఒక ప్రమాదకరమైన వరంగా మారాయి.
కరాచీ వీధుల్లో 'నడిచే బాంబులు'.. ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్
కరాచీలోని మోమినాబాద్, ఓరంగీ టౌన్ వంటి రద్దీ ప్రాంతాలతో పాటు వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ వింత పోకడ దర్శనమిస్తోంది. పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యే కొద్దిపాటి సమయంలోనే, ప్రజలు భారీ ప్లాస్టిక్ కవర్లను పట్టుకుని క్యూ కడుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ బెలూన్లలో గ్యాస్ నింపుకోవడానికి సుమారు 20 నుండి 25 నిమిషాల సమయం పడుతుంది. ఇలా నింపుకున్న గ్యాస్‌ను ఇళ్లకు తీసుకెళ్లి, ఒక చిన్న ఎలక్ట్రిక్ కంప్రెసర్ పంప్ సహాయంతో స్టవ్‌లకు అనుసంధానిస్తున్నారు. ఒకసారి నింపుకున్న బెలూన్ సుమారు రెండు నుండి మూడు గంటల వంటకు సరిపోతోంది. వెయ్యి రూపాయలకే గ్యాస్ దొరుకుతుండటంతో, ప్రమాదమని తెలిసినా ప్రజలు వీటివైపే మొగ్గు చూపుతున్నారు.
మృత్యువుకు ఆహ్వానం: గ్యాస్ బెలూన్ల వెనుక దాగివున్న పెను ప్రమాదం
ఈ ప్లాస్టిక్ కవర్లను ఇపుడు అందరూ "మొబైల్ బాంబులు" లేదా "ఫ్లయింగ్ బాంబులు"గా అభివర్ణిస్తున్నారు. ఎల్‌పీజీ లేదా మీథేన్ వంటి వాయువులు అత్యంత ప్రేలుడు స్వభావం కలవి. వీటిని నిల్వ చేయడానికి సిలిండర్ల వంటి అత్యంత పటిష్టమైన లోహ పాత్రలు అవసరం. కానీ, పలచని ప్లాస్టిక్ కవర్లలో ఈ గ్యాస్‌ను నింపడం వల్ల స్వల్ప రాపిడి (Friction) జరిగినా , చిన్న నిప్పురవ్వ తగిలినా అవి భారీ శబ్దంతో పేలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటువంటి సంఘటనల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. అయినా సరే, ఆకలి తీర్చుకోవడం కోసం పాక్ పౌరులు చేస్తున్న ఈ సాహసం ఆ దేశంలోని దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
పాకిస్థాన్ గ్యాస్ సంక్షోభం - అంతర్జాతీయ ప్రభావం
కేవలం దేశీయ కారణాలే కాకుండా, భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ నుండి వచ్చే గ్యాస్ సరఫరాపై ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు ఆ దేశ ఇంధన భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. వంట గ్యాస్ కోసం ప్రజలు ప్రాణాలకు తెగించి బెలూన్లపై ఆధారపడటం అనేది ఒక దేశం ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన మానవీయ సంక్షోభానికి నిదర్శనం. రక్షణ మరియు భద్రతా పరంగా చూస్తే, ఈ 'గ్యాస్ బెలూన్లు' ఎప్పుడు పేలుతాయో తెలియని టైమ్ బాంబుల్లా ఆ దేశ వీధుల్లో తిరుగుతున్నాయి.