భారత రాజకీయాల్లో అధికారం ఎక్కడ ఉంటే.. నిధుల ప్రవాహం అక్కడ ఉంటుందనేది జగమెరిగిన సత్యం. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ – ఏ డి ఆర్ 2024-25 ఆర్థిక సంవత్సర నివేదికను విడుదల చేసింది. ఇందులో ఇదే విషయం మరోసారి గణాంకాలతో సహా బయట పడింది. దేశంలోని జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అందిన విరాళాల సరళిని పరిశీలిస్తే, అధికార పీఠంపై ఉన్న పార్టీలకు కాసుల వర్షం కురవగా, అధికారం కోల్పోయిన పార్టీలకు గడ్డు కాలం నడుస్తోందని స్పష్టమవుతోంది.
బిజెపి దరిదాపుల్లో ఏ పార్టీ లేనంతగా..
ఈ ఏడాది నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం బిజెపి పొందిన విరాళాల మొత్తం. దేశంలోని ఇతర నాలుగు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ , ఎన్‌పిపి, మరియు సిపిఐ(ఎం)లకు అందిన మొత్తం విరాళాలను కలిపినా, బిజెపికి వచ్చిన దానిలో పది శాతం కూడా ఉండకపోవడం గమనార్హం.
గణాంకాల ప్రకారం, బిజెపికి 5,522 మంది దాతల ద్వారా ఏకంగా రూ.6074 కోట్లు అందాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 171% పెరుగుదల. దీనికి విరుద్ధంగా దేశంలోని పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ కేవలం రూ. 517 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్ కంటే బిజెపికి 10 రెట్లకు పైగా నిధులు సమకూరాయి. ఒకానొక దశలో జాతీయ పార్టీగా వెలుగొందిన మాయావతి సారథ్యంలోని బిఎస్పీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 19 ఏళ్లుగా ఆ పార్టీకి రూ 20,000 పైబడిన ఒక్క విరాళం కూడా అందలేదని నివేదిక పేర్కొనడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది.
నిధుల వెల్లువలో ఢిల్లీ, మహారాష్ట్రలదే అగ్రస్థానం
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే దాతలు ఎక్కువగా మెట్రో నగరాలు మరియు పారిశ్రామిక రాష్ట్రాల నుంచే ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అత్యధికంగా ₹2639 కోట్లు అందగా, ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (రూ. 2438 కోట్లు), గుజరాత్ (రూ.309 కోట్లు) నిలిచాయి. ఆసక్తికరంగా, ఆమ్ ఆద్మీ పార్టీకి అమెరికాలోని ముగ్గురు దాతల నుండి రూ.55,000 విరాళం అందడం విశేషం.
తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏమిటి?
జాతీయ స్థాయిలో బిజెపి ఏకపక్షంగా దూసుకుపోతుంటే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ సమీకరణాలు మరియు అధికార మార్పిడి విరాళాల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గత ఆర్థిక సంవత్సరంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రాంతీయ పార్టీల విభాగంలో నిధుల సేకరణలో అగ్రస్థానంలో నిలిచింది. కేవలం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారానే ఈ పార్టీకి ₹98 కోట్లు అందాయి. అయితే, విరాళాలు రావడమే కాదు, ఖర్చు చేయడంలోనూ వైసీపీ దేశంలోనే మూడవ స్థానంలో ఉంది. సుమారు రూ. 325 కోట్లను ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేసింది.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ – టి డి పి కి ట్రస్ట్‌ల ద్వారా రూ. 44 కోట్లు, నేరుగా అందిన విరాళాలతో కలిపి సుమారు ₹83 కోట్లు లభించాయి. గత ఏడాదితో పోలిస్తే టీడీపీ విరాళాల్లో రూ. 17 కోట్ల స్వల్ప తగ్గుదల కనిపించింది. జనసేన పార్టీ విషయానికి వస్తే, భారీ కార్పొరేట్ సంస్థల కంటే వ్యక్తిగత దాతలే ఆ పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్నారు.
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి – బి ఆర్ ఎస్ ఆర్థికంగా భారీ దెబ్బ తింది. గతంలో ఎలక్టోరల్ బాండ్లు, ట్రస్ట్‌ల ద్వారా ఏకంగా రూ. 580 కోట్లు సేకరించిన ఈ పార్టీ, ఈ ఏడాది కేవలం రూ. 15 కోట్లకు పరిమితమైంది. అంటే విరాళాల్లో ఏకంగా 97% పతనం నమోదైంది. ఇది రాజకీయాల్లో 'అధికారం లేకపోతే ఆదరణ ఉండదు' అనే చేదు నిజాన్ని ప్రతిబింబిస్తోంది.
జాతీయ రాజకీయాల్లో విరాళాల గురించి మాట్లాడేటప్పుడు హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ – ఏం ఇ ఐ ఎల్ సంస్థ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సంస్థ మరియు దాని అనుబంధ ప్రతినిధుల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు రూ. 275 కోట్లు అందాయి. రాజకీయ పార్టీలకు దన్నుగా నిలవడంలో దక్షిణ భారతదేశం నుండి ఈ సంస్థ అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా, ఎలక్టోరల్ ట్రస్ట్‌లకు విరాళాలు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచి తన 'దాతృత్వాన్ని' చాటుకుంది.
నిబంధనల ఉల్లంఘనలో అందరూ సమానమే!
ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత ముఖ్యం అని చెప్పే రాజకీయ పార్టీలు, నిబంధనల అమలులో మాత్రం వెనుకబడి ఉన్నాయి. విరాళాల వివరాలను సెప్టెంబర్ 30 లోగా సమర్పించాల్సి ఉండగా.. బిజెపి 68 రోజులు, సిపిఐ(ఎం) 66 రోజులు, కాంగ్రెస్ 23 రోజుల ఆలస్యంగా వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేశాయి.
మొత్తం మీద 2024-25 గణాంకాలను పరిశీలిస్తే, దేశంలో రాజకీయ నిధుల అధికారం ఒకే చోట కేంద్రీకృతమైందని అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా అందిన మొత్తం విరాళాల్లో దాదాపు 91% వాటా ఒక్క బిజెపిదే కావడం గమనార్హం. ప్రాంతీయ పార్టీలు తమ మనుగడ కోసం స్థానిక కార్పొరేట్ శక్తులపై ఆధారపడుతుంటే, జాతీయ స్థాయిలో మాత్రం బిజెపికి ఎదురులేకుండా పోతోంది. రాబోయే రోజుల్లో ఈ నిధుల బలం ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.




